బీజేపీ గెలిచినా…యడ్యూరప్పకు మాత్రం?

కర్టాటలో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకుండా అతి పెద్ద పార్టీగా అవతరిస్తే యడ్యూరప్పకు అధిష్టానం షాకిచ్చే అవకాశాలున్నాయి. ఇదే చర్చ ఇప్పుడు కర్ణాటకలో జరగుతుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావని తేల్చాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పగా, మరికొన్ని కాంగ్రెస్ మాత్రమే అధికారంలోకి చేరువలో్ ఉంటుందని తేల్చాయి. కమలనాధులు మాత్రం కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

హంగ్ అసెంబ్లీ ఏర్పడితే….

ఇకవేళ హంగ్ అసెంబ్లీ కనుక వస్తే జనతాదళ్ ఎస్ తో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కమలం పార్టీ సిద్ధమవుతుంది. ఈ మేరకు సంకేతాలను కూడా ఆ పార్టీకి పంపినట్లు తెలిసింది. కమలం పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే జేడీఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కుమారస్వామిని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుని ఆ పార్టీ మద్దతుతో కన్నడనాట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో బీజేపీ ఉంది. కమలనాధులు తమకు 90 స్థానాలకు పైగానే వస్తాయన్న భావనలో ఉన్నారు. ఆపార్టీ జరిపిన అంతర్గత సర్వేల్లో సయితం ఇవే ఫలితాలు రావడంతో ఈ మేరకు జేడీఎస్ తో జత కట్టేందుకు సిద్ధమవుతుందన్న వార్తలు వస్తున్నాయి.

ఇద్దరిపేర్లు తెరపైకి…..

అయితే హంగ్ అసెంబ్లీ ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాుటు చేసే అవకాశం దక్కితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా యడ్యూరప్పను కమలం పార్టీ అధిష్టానం పక్కనపెట్టే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతుంది. బీజేపీలో ఇప్పటికే దళిత వాయిస్ ఎక్కువగా విన్పిస్తుంది. బీజేపీ అధికారంలోకి వస్తే దళితులను ముఖ్యమంత్రిగా చేయాలన్న వాదన ఊపందుకుంది. అయితే బీజేపీ అధిష్టానం కూడా దీనిపై ఆలోచిస్తున్నట్లు కన్నడనాట ఊహాగానాలు చెలరేగాయి. బీజేపీ జేడీఎస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేంద్ర మంత్రి అనంతకుమార్ ను గాని, గాలి జనార్థన్ రెడ్డి అనుచరుడు శ్రీరాములునుగాని చేసే అవకాశముందన్నట్లు వార్తలు కన్నడ రాష్ట్రంలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఫలితాల వెల్లడి తర్వాత ఈ డిమాండ్ మరింత ఊపందుకునే అవకాశముంది.

కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించినా…..

గతంలోనూ జేడీఎస్, బీజేపీలు కలసి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భమూ లేకపోలేదు. ఇప్పటికే హంగ్ ఖాయమన్న వార్తలు రావడంతో జేడీఎస్ కూడా మానసికంగా పొత్తుకు సిద్ధమయినట్లు సమాచారం. అయితే ఏ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయో వారివైపే మొగ్గు చూపే అవకాశముందంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా జేడీఎస్, బీజేపీ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న జోస్యం బలంగా విన్పిస్తోంది. ఫలితాలు ఇంకా వెలువడక ముందే యడ్యూరప్ప సీటుకు ఎర్త్ పెట్టేస్తూ కొందరు బీజేపీ నేతలు అప్పుడే అధిష్టానంపై వత్తిడి తేవడం చర్చనీయాంశమైంది. కాని యడ్యూరప్ప మాత్రం బీజేపీయే ఇక్కడ అధికారంలోకి వస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 31057 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*