
ఎన్నికలకు మరో ఆరు మాసాలకు మించి సమయం లేదు. ఇప్పటికే దాదాపు ఏపీలో అధికార టీడీపీ, విపక్షం వైసీపీల మధ్య పోరు తీవ్రస్థాయిలో సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం ప్రధానంగా వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్యే పోరు సాగనుంది. ఈ క్రమంలో టీడీపీ నాయకులు చాలా మంది ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్రలు, ఇంటింటికీ టీడీపీ వంటి వినూత్న కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా రాజధాని నగరం విజయవాడలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే, ఇక్కడ వైసీపీ వ్యూహాలు ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా కీలకమైన తూర్పు నియోజకవర్గంలో నాయకులు టికెట్ కోసం ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు.
టచ్ లోకి రాలేక…..
గత ఎన్నికల్లో పోటీ చేశాం. చాలానే పోగొట్టుకున్నాం. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మాకే టికెట్ ఇవ్వాలి. అని ఓ వర్గం నాయ కులు వైసీపీ అధినేత జగన్పై ఒత్తిడి పెంచుతున్నారు. అదేసమయంలో కొత్తగ వచ్చిన నాయకులను వారు పట్టించుకో వడం లేదు. నిన్న మొన్నటి వరకు మనల్ని తిట్టిపోసిన వారిని ఇప్పుడు మేం మద్దతివ్వడం ఎలా అనే విషయంపై వారు తర్జన భర్జన పడుతున్నారు. ఇక, ఎన్నో ఆశలతో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన యలమంచిలి రవిలోనూ కూడా ఇక్కడ ఊపు కనిపించలేదు. ఆయన కూడా స్థానిక వైసీపీ నేతలతో టచ్లోకి రాలేకే పోతున్నారు. ఇటీవల విజయవాడలో నిరుద్యోగ భృతికి వ్యతిరేకంగా బెంజిసర్కిల్ వద్ద(తూర్పు నియోజకవర్గం) భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఆయన మాత్రం దూరంగానే…..
దీనికి వైసీపీలోని పాత నేతలు, గత ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకుడు కూడా పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చక్రం తిప్పారు. అయితే, కొత్తగా పార్టీలో చేరిన రవి మాత్రం దీనికి దూరంగా ఉన్నారు. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు ఆయన వద్ద సంప్రదించగా.. తనకు ఆహ్వానం అందలేదని ముక్తసరి సమాధానం చెప్పి తప్పించుకున్నారు. కానీ, దీనివెనుక ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేయడంలో జగన్ తాత్సారం చేస్తున్నారని, అందుకే ఆయన దూరంగా ఉంటున్నారనేది బహిరంగ రహస్యం. ఇక, ఇక్కడ నుంచి వైసీపీ తరఫున బరిలో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్న బొప్పన భవకుమార్.. తనకు కాదని టికెట్ మరెవరికైనా ఇస్తే.. తాను ఏం చేయాలతో తనకు తెలుసునని వ్యాఖ్యలు చేస్తున్నారు.
రాధా అంగీకరిస్తే…..
ఇక సెంట్రల్లో సీటు దక్కే పరిస్థితి లేకపోవడంతో వంగవీటి రాధాకు ఇప్పుడు తూర్పు సీటే దిక్కుగా ఉంది. దీంతో ఇక్కడ వైసీపీ రాజకీయాలు ఎటు దారితీస్తాయో చూడాలి. ఏదేమైనా.,. ఎన్నికల సమయం ముంచుకు వస్తున్న నేపథ్యంలో నాయకుల మధ్య ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలా? అనేది ప్రధాన ప్రశ్న!!
Leave a Reply