
యనమల రామకృష్ణుడు. టీడీపీతో ఆయన పెనవేసుకున్న బంధం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చంద్రబాబు నాయకత్వానికి పార్టీ సంక్షోభసమయంలో జై కొట్టిన నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అనేక పదవులు నిర్వహించారు. అటు పార్టీలోను, ఇటు ప్రభుత్వంలోనూ ఆయన నెంబర్ 2గా అనేక సార్లు పేరు తెచ్చుకున్నారు. ఆర్థిక శాఖ వంటి కీలక పదవులు కూడా నిర్వహించారు. స్పీకర్గా కూడా పనిచేశారు. తూర్పు గోదావరి జిల్లా తుని నుంచి పలు మార్లు గెలిచిన యనమల రామకృష్ణుడు.. దివంగత ఎన్టీఆర్ హయాం నుంచి కూడా టీడీపీలో చక్రం తిప్పారు. బీసీ వర్గానికి చెందిన యనమలకు ఆయా వర్గాల్లోనూ గట్టి పట్టుంది.
ప్రత్యక్ష రాజకీయాల నుంచి….
ఎలాంటి సమస్యనైనా నిశితంగా ఆలోచించి పరిష్కరించే వ్యక్తిత్వం కూడా ఆయన సొంతం. సంచలనాలకు దూరంగా ఉంటూ.. పార్టీ విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే, ఇదంతా గతం. వర్తమానంలోకి వచ్చే సరికి సొంత పార్టీలోనే ఆయన అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయి. 2009లో ఒక సారి ఓటమి తర్వాత ఆయన ప్రత్య క్ష రాజకీయాల నుంచి విరమించుకుని నామినేటెడ్ ఎమ్మెల్సీగానే చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆయన ఓడిపోయినా.. మంత్రి పదవులు ఇవ్వడంతోపాటు ఆయన సిఫారసుకుల కూడా పెద్ద పీట వేస్తున్నారు.
ఓటమి పాలయినా….
2014, 2019 ఎన్నికల్లో తన తమ్ముడు యనమల కృష్ణుడును రంగంలోకి దింపిన రామకృష్ణుడు.. ఆయనను గెలిపించుకోవడంలో మాత్రం చతికి లపడ్డారు. ఆరుసార్లు యనమల గెలిచిన తునిలో ఇప్పుడు ఆ ఫ్యామిలీ పేరు చెపితేనే జనాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వరుస పరాజయాలు పొందినా.. కూడా పార్టీలో యనమల హవా మాత్రం కొనసాగుతోంది. తన సొదరుడు కృష్ణుడు ఓడిపోయినా.. ఆయనకు ఏఎంసీ చైర్మన్ పదవిని ఇప్పించుకున్నారు. అదే సమయంలో యువతను ప్రోత్సహించడంలో మాత్రం ఎక్కడా ఆయన దూకుడుగా ఉండకపోగా.. అంతా తన హవానే చెల్లాలి అనే ధోరణితో వ్యవహరిస్తున్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
బయటపడుతున్న సీనియర్లు….
ఇటీవల జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరోక్షంగా యనమలను కడిగిపారేశారనే చర్చ తమ్ముళ్ల జరుగుతోంది. వరుసగా ఓడిపోయిన వారినే చంద్రబాబు అందలం ఎక్కించుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. అదే సమయంలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని మరో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా బాహాటంగానే పరోక్షంగా యనమలపై విమర్శలు సంధించారు. ఎవరినీ ఎదగకుండా కొందరు వ్యవహరి స్తున్నా రంటూ.. అయ్యన్న దుయ్యబట్టారు.
సైడ్ చేసే ఆలోచనలో….
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇప్పుడు ఆత్మ పరిశీలనలో పడ్డారని తెలుస్తోంది. యనమల కారణంగా పార్టీకి ఇప్పటికిప్పుడు ఒనగూరే ప్రయోజనం అంటూ ఏమీలేదని ఆయన ఆలోచిస్తున్నారు. మరోసారి ఎమ్మెల్సీగా రెన్యువల్ చేసే ఛాన్స్ కూడా లేదు. సో.. ఇప్పుడు యనమల స్థానాన్ని బీద మస్తాన్ రావు వంటి నేతల చేతిలో పెట్టడమే బెటర్ అని భావిస్తున్నారని సమాచారం. యనమలను బాబే స్వయంగా సైడ్ చేసే యోచనలో ఉన్నారని టీడీపీ వర్గాలే చెపుతున్నాయ్. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Leave a Reply