
ప్రత్యేక హోదా ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి ఏపీలో రాజకీయ సమీకరణాలన్నీ శరవేగంగా మారిపోతు న్నాయి. ముఖ్యంగా బీజేపీకి టీడీపీ దూరమైన నాటి నుంచి వైసీపీతో కమలనాథులు దోస్తీ చేయబోతు న్నారనే ప్రచారం జోరందుకుంది. అనంతరం జరిగిన, జరుగుతున్న పరిణామాలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి. హోదా విషయంలో కేవలం టీడీపీనే కార్నర్ చేసేలా విమర్శిస్తూ.. బీజేపీ, ప్రధాని మోడీ మాట వినిపించకుండా జాగ్రత్త పడతున్నారు వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు!! దీనినే ఫోకస్, టార్గెట్ చేసుకుని టీడీపీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు.
చంద్రబాబు టార్గెట్ గా….
ఈ దాడి నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న జగన్.. నేడు అంబటి.. మోడీపై విమర్శలు చేస్తున్నా అది మనసు పెట్టి చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ-బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగిందనే ప్రచారం ఏపీలో జోరందుకుంది. వైసీపీ నేతల వైఖరి కూడా దీనికి మరింత బలం చేకూరుస్తోంది. ఢిల్లీ వేదికగా గొప్పగా ప్రత్యేక హోదా సాధన ఉద్యమాన్ని సాగించామని, అంతకు మించిన స్థాయిలో రాష్ట్రంలో పోరాడుతున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీనిని సాధించేందుకు వరుసగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. అన్నింటిలోనూ ఒక్కరే టార్గెట్ చంద్రబాబు.
చంద్రబాబు మాత్రం…..
ఏపీకి హోదా ఇస్తామని చెప్పింది బీజేపీ. ఏపీని నిలువునా ముంచింది బీజేపీ. ఇందులో టీడీపీది కూడా కొంత తప్పు ఉన్నా.. ఇప్పుడు బీజేపీ చేసిన ద్రోహాన్ని గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. మోదీతో నేరుగా ఢీ అంటే ఢీ అంటున్నారు. అయినా వైసీపీ నేతలు మాత్రం.. మోదీపై విమర్శలు చేసిన దాఖలాలు లేవు. పార్లమెంటులో మోదీ సర్కారుపై నామ్ కే వాస్తే అన్నట్టు అవిశ్వాసం పెట్టారుగానీ, అప్పుడు కూడా విమర్శించలేదు. ఇక అవిశ్వాసం పెట్టిన సమయంలో.. పీఎంవోలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మోడీని కలుసుకోవడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది.
మోడీ మీద మాట్లాడేందుకు….
ఢిల్లీలో పోరాడుతున్న సమయంలోనూ మోడీ వైఖరిపై కనీసం మాట్లాడింది లేదు. ఇప్పుడు కూడా విమర్శించే సందర్భం వచ్చినా.. వైసీపీ నేతలకు మనసు రావడం లేదు. ఆ పార్టీ నేత అంబటి మాట్లాడుతూ… ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, జనసేన, వామపక్షాలు ఇచ్చిన ఏపీ బంద్ పిలుపును సీఎం చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఇదే సందర్భంలో మోడీ గురించి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించారన్నది తన అభిప్రాయం అని అంబటి నొక్కి మరీ చెప్పారు.
సున్నితంగానే….
ఈ దేశాన్ని పాలించాల్సిన వ్యక్తి, పార్లమెంటును నడపాల్సిన బాధ్యత ఉన్న ప్రధానమంత్రి.. వారి వైఫల్యాన్ని ప్రతి పక్షాలపై నెట్టేసే ప్రయత్నం చేశారన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించేలా ప్రధాని వ్యవహరించడం దురదృష్టకరమైన ప్రయత్నం అన్నారు. ఇక్కడి నుంచి మళ్లీ చంద్రబాబును విమర్శించారు. ప్రధాని గురించి చాలా సున్నితంగా విమర్శించడం మొదలెట్టగానే.. ఇది తన అభిప్రాయం మాత్రమే అని డబుల్ కోట్స్ లో అంబటి మాట్లాడారు. ఎక్కడా ఎలాంటి భావోద్వేగానికి లోను కాలేదు. కానీ, చంద్రబాబుపై విమర్శలు మొదలుపెట్టగానే ఆయనకి పూనకం వచ్చినట్టు వ్యవహరించారు. బీజేపీని అనాలన్నా.. ప్రధానిని విమర్శించాలన్నా వీళ్లకు మనసు రావట్లేదేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Leave a Reply