
రాష్ట్రంలో రాజకీయ ప్రభంజనం ఎన్నికల సునామీ.. సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న టీడీపీకి శరాఘాతంగా మారిపోయింది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. ఫార్టీ ఇయర్స్ వయసున్న జగన్ చేతిలో ఘోరంగా పరాభవానికి గురైంది. నిజానికి ఈ పరిస్థితి చంద్రబాబు కానీ, టీడీపీ శ్రేణులు కానీ ఎక్కడా ఊహించలేదు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కలలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. అనేక సర్వేలు, అనేక రూపాల్లో నివేదికలు తెప్పించుకున్న చంద్రబాబు ఎన్నికలకు ముందు, తర్వాత కూడా అనేక విధాల సమీక్ష చేసుకున్నారు. నిన్నటికి నిన్న కూడా చంద్రబాబు పెద్ద ఎత్తున రాష్ట్రంలో గెలుపు గుర్రం ఎక్కుతున్నామని ప్రకటించారు. ఈ పరిణామంతో ఉత్సాహంలో ఉన్న నేతలకు గురువారం ఉదయమే చేదు అనుభవం ఎదురైంది.
ప్రధాన ప్రతిపక్ష హోదా సయితం…
హోరా హోరీగా సాగిన ఎన్నికల పోరులో టీడీపీ చతికిల పడింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకునేందుకు కూడా పాకులాడాల్సిన పరిస్థితి వచ్చింది. సరే..ఈ విషయం అలా ఉంచితే.. జగన్ సునామీ ముందు టీడీపీ అతిరథమహారథులు సైతం మట్టికరించారు. మాకు తిరుగులేదని అనుకున్న నాయకులు కూడా పెద్ద ఎత్తున ఓటమిపాలయ్యారు. ఇంతలా జగన్ విజయం సాధించడం వెనక.. ఆయన ప్రజలను కోరిన విధంగా ఒక్కఛాన్స్ నినాదమే పనిచేసిందా? లేక ప్రజలే ఒక్కసారి జగన్ కావాలని కోరుకున్నారా ? అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సుదీర్ఘ పాదయాత్ర, చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగుబాటు వంటి కార్యక్రమాల ద్వారా జగన్ ప్రజలకు విశేషంగా ఆకట్టుకున్నారు. అదే సమయంలో ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలతో రాజీనామా చేయించారు.
నవరత్నాలతో….
ఇలా తనకంటూ ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని ముందుకు సాగారు జగన్. అదే సమయంలో జగన్ ప్రకటించిన నవరత్నాలు వంటివి కూడా ప్రజల్లోకి భారీగా వేళ్లాయి. ముఖ్యంగా ఆరోగ్య శ్రీ పథకానికి ఊపిరులూదుతానని జగన్ చేసిన ప్రతిజ్ఞ ప్రజల్లో ఆశలను రేకెత్తించింది. ఇదే సమయంలో ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నేతల ఆగడాలకు ముక్కుతాడు వేయడంలో టీం లీడర్‌గా చంద్రబాబు ఫెయిలయ్యారు. ఫలితంగా ఇసుక మాఫియా, కాల్ మునీ మాఫియాలు చెలరేగిపోయాయి. ఫలితంగా అధికార పార్టీపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ పరిణామాల నుంచి పార్టీని బయట పడేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం అంటూ లేకుండా పోయిన ఫలితం ఇప్పుడు ఓట్ల రూపంలో ఆ పార్టీని నిలువునా ముంచేసింది. మొత్తంగా చూసుకుంటే.. ఒక్క పక్క ఎలా అయితే.. ఒక్కఛాన్స్ కోసం ప్రజలను కోరారో.. ప్రజలు కూడా టీడీపీ ప్రభుత్వాన్ని మార్చి.. మార్పుకు ఓటేయాలని నిర్ణయించుకోవడం వల్లే ఇప్పుడు ఇంత సునామీ వచ్చిందని అంటున్నారు పరిశీలకులు.
Leave a Reply