
వైసీపీ అధినేత జగన్ వేస్తున్న ప్లాన్ లు అధికార పార్టీకి దిమ్మతిరిగేలా కన్పిస్తున్నాయి. జగన్ వేస్తున్న ప్రతి వ్యూహమూ అధికార పార్టీని ఇబ్బంది పెట్టేగానే ఉంది. ప్రధానంగా వైసీపీ పార్లమెంటు సభ్యలు రాజీనామాలు ఇప్పుడు అధికార టీడీపీకి తలనొప్పిగా మారనున్నాయి. తమతో కలిసి రాజీనామాలు చేయాలంటూ జగన్ పార్టీ వత్తిడి పెంచుతోంది. అయితే టీడీపీ మాత్రం వైసీపీ ఎంపీల రాజీనామాలు డ్రామాలుగా కొట్టిపారేస్తున్నాయి. వైసీపీ ఎంపీల రాజీనామాలు స్పీకర్ ఆమోదించరని, ఉప ఎన్నికలు జరగవని తెలుగుదేశం ఎదురు దాడికి దిగుతోంది.
ఉప ఎన్నికలు జరిగినా…..
అయితే ఇక్కగ ఫ్యాన్ పార్టీ ప్లాన్ వేరే విధంగా ఉంది. ఒకవేళ స్పీకర్ ఆమోదించినా పెద్దగా భయపడాల్సిన పనిలేదంటోంది. ఉప ఎన్నికలు జరగాలని కోరుకుంటోంది వైసీపీ. ఎందుకంటే వైసీపీ ఎంపీలు రాజీనామాలు ప్రత్యేక హోదా సాధన కోసమే చేశారన్నది ప్రజల్లోకి బలంగా వెళుతుంది. సెంటిమెంట్ రాజుకుంటుంది. ఉప ఎన్నికలు జరిగినా పెద్దగా నష్టం ఉండదు. తిరిగి అవే సీట్లను వారు గెలుచుకునే అవకాశం ఉంటుంది. అదే పరిస్థితుల్లో ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టే సాహసం చేయదన్నది వారి వ్యూహంలో భాగంగా కన్పిస్తోంది.
గతంలో సెంటిమెంట్ ను గౌరవించి….
గతంలో శాసనసభ్యుడు మరణిస్తే జరిగిన ఉప ఎన్నికల్లో ఏపీలో పోటీ పెట్టకపోవడం సంప్రదాయంగా వస్తోంది. ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో అఖిలప్రియ ఏకగ్రీవ ఎన్నికకు టీడీపీ సహకరించింది. అలాగే నందిగామ, తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ పోటీ పెట్టకుండా సెంటిమెంట్ ను గౌరవించింది. ఒక్క నంద్యాల ఉప ఎన్నిక విషయంలోనే వైసీపీ సెంటిమెంట్ ను గౌరవించమని చెప్పేసింది. ఎందుకంటే ఆ స్థానం వాస్తవానికి వైసీపీకి చెందింది కాబట్టి, భూమా నాగిరెడ్డి పార్టీ మారారని, అందువల్లే తాము పోటీ పెడుతున్నామని జగన్ అప్పుడు ప్రకటించారు.
టీడీపీ పోటీ పెట్టే సాహసం చేయకపోవచ్చని….
ఇప్పుడు ప్రత్యేక హోదా సెంటిమెంట్ తో రాజీనామాలు చేస్తే జరిగే ఎన్నికలలో అధికార తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టే ధైర్యం చేయదంటున్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు రాజీనామాలు చేస్తే వారి మీద పోటీకి ఎలా నిలబెడతారని ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికలు ఏడాది ఉన్నా ఈ పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా పడిన వెంటనే రాజీనామాలు చేయాలని జగన్ నిర్ణయించినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఉప ఎన్నికలు జరిగినా టీడీపీ పోటీ పెట్టకపోవచ్చు. దీంతో ఇబ్బంది ఉండదన్నది ఫ్యాన్ పార్టీ ప్లాన్ గా కన్పిస్తోంది. మొత్తం మీద జగన్ వ్యూహం అదిరింది కదూ…!
Leave a Reply