కొంచెం ఇష్టంగానే ఉన్నా…?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి

సంక్షేమం..సామాజిక న్యాయం..సాధికారత మూడే ముక్కల్లో చెప్పాలంటే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంచుకున్న పరిపాలన పాలసీ ఇదే. తొలి అడుగుల్లోనే తన విధానాలను స్పష్టం చేస్తూ వడివడిగా వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని సక్రమంగా అమలు చేయడమే రానున్న కాలంలో ప్రభుత్వ సమర్థతకు నిదర్శనగా నిలవబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడమే సంచలనం. రికార్డులను బద్దలు కొట్టేంత ప్రజాభిమానంతో దూసుకు వచ్చారు. 2014లో త్రుటిలో తప్పిన అధికారం 2019 వచ్చేసరికి వెల్లువెత్తిన కెరటంలా ప్రజాతీర్పు రూపంలో వెల్లడైంది. ఏడింట ఆరువంతుల మెజార్టీతో శాసనసభ స్థానాలను కైవసం చేసుకోవడం అసాధారణం. అన్నివర్గాలు జగన్ ను సొంతం చేసుకోవడంతోనే ఈ విజయం సాధ్య మైంది. నిజానికి ఇది తలకుమించిన బాధ్యత. ప్రజల్లో అంచనాలు పెరిగిపోతాయి. నాయకత్వం పై అపరిమితమైన విశ్వాసం ఉన్నప్పుడే ఈ స్థాయిలో పాజిటివ్ వేవ్ వస్తుంది. ప్రజలిచ్చిన అనూహ్య మద్దతు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బలం మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో బలహీనతగా కూడా మారుతుంది. అందర్నీ సంతృప్తి పరచాల్సిన బాధ్యత. ఏమాత్రం అంచనాలు అందుకోకపోయినా అసంతృప్తి సైతం తీవ్రంగా ప్రబలుతుంది. గడచిన వందరోజులుగా ఓటర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకునే దిశలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయ వ్యూహాలతో కొన్ని సందర్బాల్లో మింగుడుపడని నిర్ణయాలకూ కారణమయ్యారు. ఏదేమైనప్పటికీ తన పాలనకు ఈ స్వల్పవ్యవధిలోనే దిశానిర్దేశం చేసుకున్నారు.

సంక్షేమమే సైదోడుగా…

వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి సంక్షేమమే తారకమంత్రం. సమాజంలోని వివిధ వర్గాలను ప్రభుత్వం ఆదుకోవడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతోనే పరిపాలన సాగుతోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక నుంచే వ్రుద్ధాప్య పింఛన్ల మొత్తాన్ని పెంచుతూ తొలి సంతకం చేయడమే ఇందుకు నిదర్శనం. వేణ్నీళ్లకు చన్నీళ్లుగా కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికంగా తోడ్పాటునిస్తారని పిల్లలను బడికి పంపకుండా పనుల్లో పెడుతున్న తల్లిదండ్రులు పేద వర్గాలలో ఎక్కువగానే కనిపిస్తారు. మధ్యతరగతి వర్గాలైతే పదో తరగతి లోపు పిల్లలను పాఠశాలలు మానిపించి ఏదో ఒక పనిలో పెడుతున్నారు. దీనివల్ల పదోతరగతి లోపుగానే 25శాతం వరకూ డ్రాపవుట్లు నమోదవుతున్నాయి. దీనిని నివారించేందుకు ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. ప్రభుత్వ పాఠశాలలకే దీనిని వర్తింపచేయాలనే విమర్శలున్నాయి. కానీ తమ బిడ్డకు సరైన విద్య ఎక్కడ లభిస్తుందో ఎంచుకునే స్వేచ్ఛ తల్లిదండ్రులకు ఉండాలి. అందువల్ల సార్వత్రికంగా వర్తింప చేయడంలో తప్పేమీ లేదు. అదే విధంగా పదో తరగతి పైన ఉన్నత చదువులు చదువుకునే వారందరి ఫీజులను ప్రభుత్వమే భరించే ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకమూ ప్రభుత్వ బాధ్యతకు పట్టం గట్టేదే. అలాగే అయిదు లక్షల రూపాయలలోపు వార్షిక కుటుంబ ఆదాయం ఉన్న అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపచేయడమూ ప్రభుత్వ ఉద్దేశాన్ని చాటిచెప్పేదే. అమలులో కొన్ని సవాళ్లున్నప్పటికీ వైద్యం అందించడం సర్కారు కర్తవ్యం అన్న సంగతిని గుర్తు చేసుకోవడం అభినందించదగ్గ ఘట్టం. విద్య, వైద్యం, సంక్షేమం ఈ ప్రభుత్వానికి సంబంధించిన అత్యధిక ప్రాధాన్యమున్న అంశాలు. వందరోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నాణ్యతతో కూడిన బియ్యం రేషన్ గా అందించాలనే మరో నిర్ణయానికీ శ్రీకారం చుట్టారు. నిజానికి రేషన్ బియ్యం పై ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ దుర్వినియోగం ఎక్కువగా ఉంది. వాటిని ప్రజలు తమ ఆహార అవసరాలకోసం వినియోగించడం లేదు. పక్కదారిపడుతున్నాయి. నిజంగానే ఈ లోపాన్ని సరిచేస్తే పేద,మధ్యతరగతికి చాలా ప్రయోజనం చేకూర్చినట్లవుతుంది.

సామాజిక న్యాయం…

సామాజిక న్యాయం అన్న పదం చాలా సంవత్సరాలుగా రాజకీయ పార్టీల ఊకదంపుడు ఉపన్యాసాలకే తప్ప ఆచరణలో అడుగులు పడటం లేదు. రాజకీయంగా అధికారం సాధించే వర్గాల ప్రజలే పదవుల్లోనూ, ఆర్థిక పరమైన అంశాల్లోనూ అగ్రభాగం పొందుతున్నారు. కొన్నిదశాబ్దాలుగా ఈ అన్యాయం కొనసాగుతూనే వస్తోంది. దీనిని కొంతమేరకు నియంత్రించే విధంగా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం గమనించదగిన అంశం. నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు కేటాయించాలన్న చట్టం సామాజిక న్యాయానికి ఊతమిస్తుంది. జనాభాలో 80 శాతం మేరకు ఉన్న ఆయా వర్గాలు భవిష్యత్తులో నిలదొక్కుకుని రాజకీయంగా పోటీ పడేస్థాయికి చేరుకోవడానికి ఇది దోహదం చేస్తుంది. చట్టసభల్లో ఎస్సీ,ఎస్టీ వర్గాలకు మినహాయించి మిగిలిన వారికి రిజర్వేషన్లు లేకపోవడం వల్ల బీసీ, మైనారిటీ, మహిళలకు తగినంత ప్రాతినిధ్యం దొరకడం లేదు. కనీసం నామినేటెడ్ పోస్టుల ద్వారా అయినా ఈ అంతరాన్ని కొంతమేరకు పూరించే ప్రయత్నం చేయడం దేశంలోనే ఇది తొలిసారి అని చెప్పవచ్చు.

గడప..గడపకూ…

ప్రభుత్వం సంక్షేమ పథకాల రూపంలో వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. దాంతోపాటు అనేక రకాల ధ్రువీకరణ పత్రాలకు ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడి ఉంటున్నారు. ఈ పథకాలపై అవినీతి కమ్ముకుంటోంది. సేవలు ప్రజలకు చేరువ కావడం లేదు. ఈలోపాలను సరిదిద్దడానికి గ్రామవాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలను అందుబాటులోకి తేవడం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మకమైన పాలన సంస్కరణగానే చెప్పాలి. అయితే వాలంటీర్ల వ్యవస్థ గత ప్రభుత్వంలోని జన్మభూమి కమిటీల తరహాలో ముద్ర పడకుండా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. పరిపాలనను, ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిళ్లలోకి చేర్చాలనే ప్రయత్నం గ్రామ స్వరాజ్యానికి నాందీ వాచకంగానే పేర్కొనాలి.

నిధుల సమస్య…

నిర్ణయాలలో వేగం కనబరుస్తున్న జగన్ సర్కారును ఇప్పటికే కొన్ని సమస్యలు చుట్టుముట్టి ఉన్నాయి. ఆర్థికభారం గతం కంటే బాగా పెరుగుతోంది. కొత్తగా ప్రవేశపెట్టిన స్కీములకు వేల కోట్ల రూపాయల్లో అవసరమవుతాయి. ఆ స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయవనరులు లేవు. అప్పుల మీదనే ఆధారపడాలి. వాటిని తీర్చడమూ సమస్యాత్మకమే. సంపద సృష్టికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి తగిన ప్రణాళిక ఇంతవరకూ ప్రభుత్వం వద్ద లేదు. రాజధాని పనుల నిలిపివేతలో ఒక కోణం మాత్రమే బహిర్గతమవుతోంది. అమరావతిపై జగన్మోహన్ రెడ్డి సర్కారుకు పాజిటివ్ ఆలోచన లేదు కాబట్టే సందిగ్ధతకు, సందేహాలకు తెర తీశారనేది ఒక వాదన. మరో కోణంలో చూస్తే వేల కో్ట్ల పనులకు బిల్లుల చెల్లింపు సాధ్యం కాదు కాబట్టే ప్రస్తుతానికి పక్కన పెట్టారనే మరోవాదన ఉంది. పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల పై పునస్సమీక్ష వంటి విషయాల్లో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. పాత ప్రభుత్వ విధానాలను సమీక్షించి తమ పార్టీ ప్రాధాన్యాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. దీర్ఘకాలిక ప్రయోజనాలతో ముడిపడిన అంశాల్లో వెనకడుగు పడినట్లు కనిపిస్తే ప్రభుత్వ ప్రతిష్టకు ఇబ్బందికరమే. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. సంక్షేమ పథకాల విషయంలో అత్యంత వేగంగా నిర్ణయాలను తీసుకున్నారు జగన్. అదే దూకుడును పాత ప్రభుత్వ పథకాలను తిరగదోడటంలోనూ కనబరిచారు. రెంటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవడంలో సంయమనం కనబరచలేకపోయారనేది విమర్శకులు చేస్తున్న అభియోగం. ఏదేమైనప్పటికీ కొత్త ప్రభుత్వ పాలసీలు నిర్ణయమైపోయాయి. పంథా తెలిసిపోయింది. సర్కారు భవిష్యత్ ప్రస్థానమూ ఈ వందరోజుల్లో వెల్లడైంది. పథకాలను పరుగులు తీయిస్తూ నిధులను సర్దుబాటు చేసుకుంటూ సంక్షేమం, సమతుల్యాభివ్రుద్ధి మధ్య సమన్వయం సాధించడమే ఇక పరిపాలనకు గీటురాయిగా నిలవనుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 22582 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*