అప్పు…రాజకీయం

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి

అప్పూ ఒక రాజకీయాస్త్రమే. ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య వాదవివాదాలు దాని చుట్టూ తిరుగుతున్నాయి. అంకెలు అబద్దాలు చెప్పవు.అప్పుల ఆంధ్రప్రదేశ్ అసలు స్వరూపం ఆవిష్క్రుతమైంది. సంస్కరణల శకం నుంచీ అప్పు..అభివృద్ది చెట్టపట్టాలేసుకుని నడుస్తున్నాయి. అప్పు చేసి పప్పు కూడు అనే పాత సామెత స్థానంలో అప్పు చేసైనా అభివృద్ధి చేస్తే చాలనే కొత్త విధానంలో అమల్లోకి వచ్చింది. రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం లో అంకెల విషయంలో నూటికి నూరుపాళ్లు ఎవరూ తోసిపుచ్చలేరు. నిర్వచనాలను మాత్రం తమకు నచ్చినట్లుగా అన్వయించుకునే వెసులుబాటు ఆయా రాజకీయ పార్టీలకు ఉంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డ సహా రాష్ట్రంలోని ప్రజలందరికీ అప్పులు పంచేస్తే ప్రతి ఒక్కరి తలపై 42 వేల రూపాయల పైచిలుకు రుణం ఉన్నట్లే అని స్పష్టంగా తేలిపోయింది. కేంద్రప్రభుత్వమూ మరో ఏడు లక్షల కోట్ల రూపాయలను దేశంలో అప్పు చేసి పెట్టింది. దానికీ తలసరి పంచాల్సివస్తే మరింత తడిసిమోపెడవుతుంది. కేంద్రానికి నిధుల సమీకరణకు వేర్వేరు మార్గాలుంటాయి. విదేశీ రుణాలు, కరెన్సీముద్రణ, అదనపు సుంకాల వంటి రూపాల్లో నొప్పి కనిపించకుండా పన్ను రాబట్టడంలో కేంద్రం ఆరితేరిపోయింది. అందువల్ల ప్రస్తుతానికి దాని విషయం పక్కనపెడితే రాష్ట్రం చేసిన రుణానికి సంబంధించి ప్రతిపైసా పౌరుని జేబు నుంచి రావాల్సిందే. ఏటా తలసరి ఆరువేల రూపాయల వరకూ వడ్డీలకే పోతుందని చెబుతున్నారు. మూడింట ఒకవంతు మాత్రమే రాష్ట్రంలో ఆదాయఆర్జనపరులున్నారు. అంటే ప్రతి ఒక్కరి కష్టార్జితం నుంచే ఏటా పద్దెనిమిదివేల రూపాయల వరకూ ఏదో రూపంలో సర్కారు తప్పనిసరి వసూలు చేయాల్సి ఉంటుంది. అది సేవల రూపంలోనా? ఉత్పత్తుల రూపంలోనా? పన్నుల రూపంలోనా? అన్నది ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది.

తిమ్మిని బమ్మి చేసి…

కేంద్రప్రభుత్వం రాష్ట్రాల విచ్చలవిడి తనాన్ని గమనించిన తర్వాత అనేక రకాల చర్యలకు ఉపక్రమించింది. తమ పాలనలో ఇష్టారాజ్యంగా అప్పులు తెచ్చి ప్రజలను సంతృప్తి పరిచేందుకు రాష్ట్రప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అందువల్ల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోంది. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తోంది. ఫలితంగా అభివృద్ధి కుంటుపడుతోంది. దీనిని సరిదిద్దే క్రమంలో భాగంగానే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ -ఎఫ్ ఆర్ బీఎం చట్టాన్ని 2003లోనే కేంద్రం అమల్లోకి తెచ్చింది. రాష్ట్రప్రభుత్వం చేసే అప్పులపై నియంత్రణ విధించింది. సేవలు, ఉత్పత్తుల రూపంలో ఉండే ఆయా రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తిలో మూడు శాతానికి మించి ఏ ఆర్థికసంవత్సరంలోనూ అప్పు తేకూడదని నిషేధం పెట్టింది. తొలినాళ్లలో ఈ చట్టాన్ని చూసి జడుసుకుని కొంచెం ఒద్దికగా ప్రవర్తించిన రాష్ట్రాలు తర్వాత కాలంలో తూట్లు పొడిచే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాయి. బడ్జెట్ మేనేజ్ మెంట్ ద్రవ్యనిర్వహణ చట్టం కోరలకు చిక్కకుండా అప్పులు తెచ్చేందుకు కొత్త రూట్లు కనిపెట్టాయి. తమ తమ రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తిని పెంచి చూపడం ద్వారా అప్పులు తెచ్చుకునే అవకాశాన్ని విస్తరించుకుంటున్నాయి. అదే విధంగా ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లుగా కార్పొరేషన్లను స్థాపించి వాటికి అప్పులు ఇప్పించి ఆ సొమ్ములు వాడుకోవడమనేది మరొక మార్గం. ఇది కూడా ప్రభుత్వ ఖజానా అప్పుకింద కనిపించదు. ఫలితంగా రోజురోజుకీ ప్రభుత్వమూ, ప్రభుత్వ రంగ సంస్థలూ రుణ సంక్షోభంలో కూరుకుపోతున్నాయి.

అపాత్రదానం…

అప్పు చేయడం తప్పు అని ఆధునిక కాలంలో ఎవరూ చెప్పడం లేదు. అయితే ఆమొత్తాన్ని ఎందుకు వినియోగించామన్నది చాలా ముఖ్యం. ఒక పరిశ్రమను స్థాపించడానికి లేదా మౌలిక వసతులైన రహదారులు, చెరువులు, నీటిపారుదల సౌకర్యాల మెరుగుదల, ప్రాజెక్టుల నిర్మాణాలకు రుణాలు తీసుకోవచ్చు. తద్వారా వసతులు మెరుగై ఆదాయం పెరుగుతుంది. అది దీర్ఘకాలంలో అభివృద్ధికి దోహదపడుతుంది. అదే విధంగా మానవవనరుల వికాసానికి వినియోగించే విద్య,వైద్య సౌకర్యాల విషయంలోనూ రుణాలను ఉపయోగిస్తే తప్పులేదు. తద్వారా నాణ్యమైన మానవవనరులు అందుబాటులోకి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా కాకుండా ప్రచారానికి, ఆడంబరానికి నిధులను దుర్వినియోగం చేస్తే భావితరాలపై ఆ భారం పడుతుంది. విపరీతమైన సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించడమూ ప్రభుత్వ దుబారా కిందకే వస్తుంది. దానివల్ల ప్రజల్లో కష్టించే తత్వం తగ్గుతుంది. తమ సేవకు మించిన ప్రతిఫలాన్ని ఆశిస్తారు. ప్రతి విషయానికి ప్రభుత్వంపై ఆధారపడే తత్వాన్ని అలవరచుకుంటారు. దీనివల్ల మానవ వనరులను గరిష్ఠంగా వినియోగించుకోవడం సాధ్యంకాదు. ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత వ్యవసాయరంగానికి కూలీల కొరత ఎదురవుతోందనే విమర్శ ను ఇందుకొక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఉపాధి హామీ పథకం ఆస్తుల కల్పనకు ఉపయోగపడితే దానివల్ల మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవి. కానీ కేవలం మొక్కుబడి పనులతో నిధులు వెచ్చించే తంతుగా మారడంతో వేల కోట్ల రూపాయల విలువైన ఉపాధి పనుల కాంపొనెంట్ అభివృద్ధిలో భాగంగా కనిపించడం లేదు.

బడ్జెట్ ను మించిన బకాయిలు…

ఇప్పుడు ఏపీ అప్పుల చిట్టా మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయల పైచిలుకు చేరింది. దాదాపు రాష్ట్ర బడ్జెట్ కు రెట్టింపు. స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో సగానికి పైచిలుకు. వ్యవసాయాధార రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు ఇది పెనుభారమనే చెప్పాలి. గత ప్రభుత్వం కేంద్ర చట్టాలకు చిక్కకుండా కార్పొరేషన్లు, ఇతర మార్గాల్లో లక్ష కోట్ల రూపాయల వరకూ రుణాలు దూసి తెచ్చిందనేది ఆరోపణ. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సంక్రమించిన అప్పు లక్ష కోట్ల రూపాయలవరకూ ఉంటే మరో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అయిదేళ్లలో పెరిగిపోయింది. ఈ మేరకు నవ్యాంధ్రలో ఆస్తులు, మౌలిక వసతులు పెరిగి ఉంటే కొత్త ఆదాయం వచ్చేందుకు అవకాశం ఉండేది. కానీ ఆ రకమైన పెట్టుబడులు కనిపించడం లేదని కొత్త ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిని బట్టి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయనే అర్థం చేసుకోవాలి. ఇది కొత్త ప్రభుత్వానికి ఒక గుణపాఠం. ఆర్థిక క్రమశిక్షణ లోపించి దారి తప్పితే ఎంతటి దుష్ప్రభావం ఏర్పడుతుందో పాత ప్రభుత్వం తన చర్యల ద్వారా నిరూపించి వెళ్లిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకే డబ్బులు వెదుక్కోవాల్సిన దుస్థితి. సంక్షేమ పథకాలకు సర్దుబాట్లు తలకు మించిన భారమే. రుణవాయిదాల చెల్లింపులకు మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి. అభివృద్ధి ఎలా అంటే అయోమయమే. జగన్ సర్కారు కత్తిమీద సాము చేయక తప్పదు. నవరత్నాల అమలు, నవ్యాంధ్రకు వసతుల కల్పన ఆర్థిక సవాళ్లుగానే చెప్పుకోవాలి. ప్రతి పైసాను ఆచితూచి వినియోగిస్తేనే ఒడ్డున పడటం సాధ్యమవుతుంది. అప్పుల సెగ ఇప్పటికే అభివ్రుద్ధిపై పడుతోంది. అప్పు నిప్పుగా మారకుండా ఉపశమన చర్యలకు వెంటనే ఉపక్రమించాల్సి ఉంది. లేకపోతే ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 39176 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*