
వారు లేదు వీరు లేదు అంతా జగన్ క్యాబినెట్ కూర్పు… నేర్పును ఆహా ఓహో అన్నారు. అయితే సొంత పార్టీలో కొందరు మాత్రం అలకపాన్పు ఎక్కేసారు. టిడిపి హయాంలో నానా కష్టాలు పడి వైసిపిని అధికారంలోకి తెస్తే మమల్ని అధినేత గుర్తించలేదా ? అనే ఆవేదన కొందరు ఎమ్యెల్యేల్లో అసంతృప్తి రగిలించింది. వారంతా బాహాటంగా తమ అసంతృప్తిని ఇప్పటికిప్పుడు వ్యక్తం చేయలేకపోయినా లోలోపల ఆందోళన వారిని దహిస్తుంది. అయితే మరో రెండున్నరేళ్ల తరువాత జగన్ ప్రక్షాళన ఉంటుంది అన్న ప్రకటన ఒక్కటే వారికి కొంత ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయినా క్యాబినెట్ బెర్త్ ఆశించి నిరాశ చెందిన వారు మంత్రి వర్గ ప్రమాణస్వీకారానికి డుమ్మా కొట్టారు.
వీరు నిరాశలోనే …?
మంత్రి అవుతారు అనుకున్న ఆర్కే రోజా కు షాక్ తగలడంతో ఆమె ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కాలేదు.వైసిపి మౌత్ పీస్ అంబటి రాంబాబు కూడా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. లోకేష్ పై గెలిచినా కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కి క్యాబినెట్ లో ఛాన్స్ లభించకపోవడంతో ఆయన కూడా ప్రమాణస్వీకారానికి రాలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలిచినా భీమవరం ఎమ్యెల్యే గ్రంధి శ్రీనివాస్ కి అవకాశం దక్కలేదు. ఆయన కూడా నిరాశలోనే వున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మరో పక్క భూమన కరుణాకర రెడ్డి వంటి వారు సంగతి సరే సరి. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గానికి చాలా షాక్ ఇచ్చారు జగన్.
లెక్కలవల్లే ఇలా జరిగింది …
అన్ని సామాజిక వర్గాలను సంతృప్తి పరిచేందుకే జగన్ తనవారిని పక్కన పెట్టారన్నది వాస్తవం. అందువల్లే వైసిపి అధినేత తరతమ భేదం లేకుండా వ్యవహరించడం తో ఇలా జరిగిందన్నది విశ్లేషకుల అంచనా. నిరాశ లో ఉన్నవారికి సైతం బుజ్జగింపులు మొదలయ్యాయి అని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. క్యాబినెట్ కి ముందు జగన్ భావోద్వేగం అందుకే అన్నది ప్రచారం సాగుతుంది. జిల్లాల వారి సమీకరణాలు వల్లే కావలిసిన వారిని దూరం చేసుకోవాలిసి వచ్చిందన్నది వారికి అర్ధం అయ్యేలా చెప్పే ప్రయత్నం మొదలైంది. మరి దీనికి అసంతృప్తులు సంతృప్తులుగా మారతారా అనేది వేచి చూడాలి.
Leave a Reply