తెగింపు యాటిట్యూడ్ జగన్ కు కలసి వస్తుందా?

వైసీపీ

న్యాయపరమైన ఇబ్బందులు, రాజ్యాంగ సంస్థలతో వైరం, ఆలయాలపై వరుసదాడుల వంటి ఘట్టాలతో డీలాపడిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం రూటు మార్చింది. మళ్లీ క్రమేపీ పైచేయి సాధిస్తోంది. ప్రతిపక్షాల బలహీనతలను అస్త్రాలుగా చేస్తూ మానసిక ఒత్తిడికి గురి చేయడం ద్వారా ఆధిక్యాన్ని చాటుకునే వ్యూహాన్ని రచిస్తోంది. ఈ విషయంలో వైసీపీలో ఇద్దరు ప్రదాన నాయకులు కీలక భూమిక పోషిస్తున్నారు. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆ బాధ్యతను స్వీకరించినట్లు కనిపిస్తోంది. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లేఖ రాయడం, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సైతం అందులో భాగంగా చూపించడం తో వైసీపీ వ్యూహం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. న్యాయమూర్తులు నిష్పాక్షికంగా ఉండటమే కాదు, అలా కనిపించాల్సిన అవసరమూ ఉందన్న సహజ నిబంధనతో హైకోర్టు స్థానాలు కదిలిపోయాయి. సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయమూర్తిపై విచారణ విషయంలో ఏం జరుగుతుందో తాము బహిరంగ పరచబోమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పేసింది. దీనిని బట్టి చూస్తే ఏదో జరుగుతోందనే సామాన్యులు, న్యాయస్థానాలు అర్థం చేసుకుంటాయి.

ఎదురుదాడి…

తెగింపు వైఖరి జగన్ మోహన్ రెడ్డికి అలవాటైన విద్య. కొండను ఢీకొనడానికి సైతం సిద్ధంగా ఉంటారు. ధైర్యే సాహసే లక్ష్మి అనుకుంటారాయన. ప్రత్యర్థులు దుస్సాహసంగా చూస్తుంటారు. ఏదేమైనప్పటికీ న్యాయమూర్తులపై ఎవరూ ఊహించని విధంగా ఆరోపణలు గుప్పించి న్యాయవ్యవస్థలో కలకలం సృష్టించారు. ప్రభుత్వ విధానాల విషయంలో న్యాయస్థానాలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు. రాష్ట్రప్రభుత్వ విధానాల్లో కేంద్రం పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. న్యాయస్థానమే వివిధ రకాల సంశయాలతో బ్రేకులు వేస్తోంది. తాజా పరిణామాల్లో న్యాయస్థానం కూడా రాజ్యాంగ బద్ధమైన తన పరిధులకే పరిమితం కావచ్చు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో ప్రభుత్వం మొండిగా ఉంది. పంచాయతీ ఎన్నికలు ఆయన హయాంలో జరిపేదే లేదని భీష్మించుకు కూర్చుంది. న్యాయస్థానం కూడా ప్రభుత్వ వాదనవైపే మొగ్గు చూపింది. ఎదురు దాడితో ముందుగానే రాజకీయ ఆయుధాలు ప్రయోగిస్తున్న అధికార పార్టీ దూకుడు తో ప్రధాన ప్రతిపక్షం చతికిలపడాల్సి వస్తోంది. స్థానిక ఎన్నికల లో పాలకపక్సం పైచేయి సాధిస్తుందని టీడీపీ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే ఎంతో కొంత న్యాయం జరిగే అవకాశం ఉండేదన్న ఆశలు వారిలో నెలకొన్నాయి. ప్రస్తుతం ఆ ఆశలు కూడా అడియాసలై పోయాయి.

ఆత్మరక్షణలో విపక్షం..

దేవాలయాలపై దాడుల విషయంలో రాజకీయ మైలేజీ ఎవరికి దక్కుతుందనే అంశంపై టీడీపీ, బీజేపీ కాట్టాడుకుంటున్నాయి. దీనిని ప్రజల్లో వైసీపీ చక్కగా ఎక్స్ పోజ్ చేస్తోంది. పైపెచ్చు చంద్రబాబు నాయుడు అత్యుత్సాహంతో తన స్థాయిని కుదించుకుని మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో కొద్దో గొప్పో దళిత వర్గాలనుంచి చంద్రబాబును సమర్థించే వారు కూడా దూరమవుతున్నారు. ఇంతవరకూ సెక్యులర్ నాయకునిగా ఉన్న ముద్రను తనంతతాను చెరిపేసుకుంటున్నారు. మెజార్టీ వాదమే తనకు రక్షగా నిలుస్తోందనే కొత్త అంచనాలో ఉన్నారు చంద్రబాబు నాయుడు. అయితే ఆలయాల వివాదం ఎంతోకొంత బీజేపీకి కలిసొస్తుందే తప్ప టీడీపికి అచ్చిరాదని పరిశీలకులు పేర్కొంటున్నారు. తన హయాంలో అధికారికంగానే అనేక ఆలయాలను తరలించిన చరిత్ర చంద్రబాబుది. అందువల్ల ఈవిషయంలో టీడీపీ విశ్వసనీయత అంతంతమాత్రమే. దళిత, రెడ్డి, మైనారిటీ ల గంపగుత్త ఓటు బ్యాంకు వైసీపీకి ఎలాగూ చెక్కు చెదరదు. మత భావనలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే ఓటర్లు ఎవరైనా ఉంటే టీడీపీ నుంచి బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని వైసీపీ అంచనా వేస్తోంది. తద్వారా తెలుగుదేశం ఓటు బ్యాంకుకే చిల్లు పడుతుంది.

అమరావతిపై అదే మాట…

అమరావతిని మైండ్ గేమ్ గా మార్చేసింది అధికారపార్టీ. ఇప్పటికే ఈవివాదంతో తనకు రాజకీయంగా రావాల్సిన మైలేజీ తెచ్చేసుకుంది. అటు రాయలసీమలో హైకోర్టు అంటూ తన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లింది. విశాఖలో రాజధాని పేరిట ఉత్తరాంధ్రకు ఉత్సాహం తెచ్చింది. జాప్యం జరిగినా, ఒకవేళ ఆచరణలోకి రాలేకపోయినా ఆ పాపమంతా టీడీపీ పైకి నెట్టేసేందుకు సిద్ధమవుతోంది. అప్పుడప్పుడూ విశాఖ కు వెళ్లిపోతున్నామంటూ ప్రకటనలు గుప్పిస్తోంది. ఇంకా న్యాయస్థానంలో వ్యాజ్యం నడుస్తోంది. మౌలిక వసతుల పరమైన ఏర్పాట్లు పూర్తి కాలేదు. అయినా మరో నాలుగు నెలల్లో విశాఖ కార్యనిర్వాహక రాజధాని కాబోతోందంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రుష్ణారెడ్డి ప్రకటించారు. ఏడాది దాటిన ఆందోళనలకు ప్రదాన ధర్మకర్తగా ఉన్న తెలుగుదేశం పార్టీని, అధినేతను మానసికంగా బలహీనపరచడమే ఈ ప్రకటనల సారాంశం.

మానసికంగా… నైతికంగా…..

తమ ఆందోళనలకు సానుకూల సంకేతాలు కనిపించకపోతే ఉద్యమకారులు క్రమేపీ తీవ్రతను తగ్గించేస్తారని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి నుంచి రాజధాని తరలిపోతే చంద్రబాబు నాయుడి రాజకీయ జీవితంలోనే అత్యంత విషాదకరమైన ఘట్టం. మానసికంగా, నైతికంగా కూడా తెలుగుదేశం బలహీనపడుతుంది. ప్రజలను ఒప్పించి బాబు హయాంలో ప్రభుత్వం భూములు సమీకరించింది. కానీ అమరావతి ఉద్యమాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ సమర్థించడం లేదు. అందువల్ల ఆందోళనలు అమరావతి ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ రాజధాని ఉండదని పదే పదే చెప్పడం ద్వారా ప్రతిపక్షమైన తెలుగుదేశాన్ని, ఆందోళన కారులను వైసీపీ నాయకులు రెచ్చగొడుతున్నారు. ఉద్యమం హింసాత్మక రూపు దాల్చినా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా అణచివేయడం చాలా సులభం. అందుకోసమే సర్కారు ఎదురుచూస్తోంది. తెలుగుదేశం అధినేత తప్పటడుగు వేసేలా రెచ్చగొడుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 35688 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*