జగన్ మీద అంత నమ్మకమా

జగన్

జగన్ రాజకీయ నాయకుడు, పైగా ఆశావాది కాబట్టి తనకు తాను ఎక్కువ చేసుకునే చెబుతాడు. ఆ ధీమాతోనే రాజకీయాలు చేస్తాడు. జగన్ 2014లో ఎన్నికలకు ముందు ఒకసారి సీఎం అయితే చాలు అనుకున్నారు, కానీ 2014లో అధికారం దగ్గరకు వచ్చి ఓడిపోగానే మాట మార్చారు. జనాల్లో లభించిన అదరణ, పాదయాత్రకు బ్రహ్మాండమైన స్పందనను చూసి తాను ఏపీకి ముప్పయ్యేళ్ళ సీఎం అని జగన్ గట్టిగానే తీర్మానించుకున్నారు. ఆ విషయంలో విపక్షాల విమర్శలు పక్కన పెడితే జగన్ 2019లో సాధించిన విజయం అసాధారణమైనది. ఆ మెజారిటీని చూసిన వారు కచ్చితంగా జగన్ 2024లో కూడా గెలిచి తీరుతారని అనుకున్నారు.

అలా చేయకపోతే?

ఇక రాజకీయాల్లో తలపండిన నేత సీపీఐ నారాయణ జగన్ అమరావతి రాజధాని తరలిస్తూ పెద్ద తప్పు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలన సజావుగా సాగుతున్న వేళ ఇలా లేని కొరివిని బుర్ర మీద పెట్టుకుని తన రాజకీయ భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటున్నాడని కూడా విమర్శించారు. జగన్ ముప్పయ్యేళ్ళ సీఎం అని చెప్పుకున్నాడని, ఆయన రాజధాని ఊసు ఎత్తకుండా ఉంటే అందులో సగమైనా పాలించేవాడని, ఇపుడు అమరావతితో పెట్టుకుని మూడేళ్ళ సీఎం గా మిగిలిపోయే ప్రమాదం తెచ్చుకున్నాడని అంటున్నారు. అంటే అమరావతి జోలికి రాకపోతే జగన్ కచ్చితంగా పదో, పదిహేనో ఏళ్ళ పాటు సీఎంగా ఉండేవారన్నది నారాయణ వేసిన అంచనాగా ఉంది. మరి విపక్షంలో ఉన్నా కూడా జగన్ సామర్ధ్యం, ప్రజాభిమానం మీద నారాయణ అమరావతి అంశం ముందు వరకూ ఇలాగే అనుకున్నారన్న సంగతి ఈ గొడవతో బయటపెట్టుకున్నారన్న మాట.

పదిహేనేళ్ళ సీఎం…

జగన్ పదిహేనేళ్ళ సీఎం, అనవసరంగా భవిష్యత్తు పాడుచేసుకుంటున్నారని, టీడీపీ నాయకుడు, ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ కూడా అంటున్నారు. జగన్ వాళ్ళ నాయన వైఎస్సార్ చేసిన పాలనలో పదవ వంతు అమరావతిలో కూర్చుని చేస్తే చాలు కచ్చితంగా మూడు టెర్ములు ఆయనే ముఖ్యమంత్రి అని బల్లగుద్ది మరీ అశ్వనీదత్ చెబుతున్నారు. జగన్ కి ఎందుకో అమరావతిని తరలించాలన్న ఆలోచన వచ్చిందని, ఆయనకు సలహా ఇచ్చేవారు కూడా తప్పుతోవ పట్టించారని ఆయన అంటున్నారు. అమరావతిని అలా ఉంచుతూనే జగన్ మిగిలిన ప్రాంతాలు అభివృధ్ధి చేసినట్లైతే ఆయనకు తిరుగు ఉండేది కాదని ఈ టీడీపీ నేత అనడమే విశేషం.

నిజమేనా…?

వాస్తవానికి రాజకీయ పరిశీలకులు , మేధావులు కూడా జగన్ ఏడు నెలల పాలన వరకూ దాదాపుగా ఓకే అనేశారు. అయితే అమరావతి అంశం మాత్రం జగన్ ని హీరోను చేస్తుందా, విలన్ని చేస్తుందా అన్నది వారికి కూడా అంచనాకు అందడం లేదు. జగన్ వికేంద్రీకరణతో పాటు, రాజకీయ పట్టు కోసం రాజధానుల అంశాన్ని ఉపయోగించుకుంటున్నారన్న మాట ఉంది. అదే సమయంలో ముప్పయ్యేళ్ళ సీఎం కోసమే జగన్ ఈ ప్రతిపాదనలు సిధ్ధం చేశారని ఆయన అంతరంగికులు అంటున్న మాట. మరి అమరావతిని తరలిస్తే మూడేళ్లు, తరలించక పోతే ముప్పయ్యేళ్ళ సీఎంగా ఉంటారా అన్నది కాలమే జవాబు చెప్పాలి. మొత్తానికి విపక్షానికి సైతం దడ పుట్టించేలా జగన్ ప్రజాదరణ ఉందన్నది అమరావతి తరలింపు ముందు వరకూ ఉన్న మాటగా అంతా ఏకీభవిస్తున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 22614 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*