‘‘ఫ్యాన్’’కు ఫిట్ అయితేనే…??

ys-jaganmohanreddy-fan-symbol

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి జగన్ కొత్త రాజకీయాలకు తెరదీశారు. పార్టీని నమ్ముకుని ఉంటే ఖచ్చితంగా టిక్కెట్ వస్తుందన్న సంకేతాలను ఈ ఎన్నికల ద్వారా పంపారు. పార్టీని నమ్ముకుని ఉండటమే కాకుండా, కష్టపడిపనిచేసిన వారికి గుర్తింపు ఇస్తామని జగన్ చెప్పకనే చెప్పినట్లయింది. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 23 మంది పార్టీని వదిలి పెట్టి వెళ్లిపోవడంతో కొంత గుణపాఠం వైసీపీ నేర్చుకుంది. ఈ ఎన్నికలలో అలాంటి పరిణామాలు రిపీట్ కాకూడదని భావించి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి, తమను వదలి వెళ్లపోరన్న నమ్మకంతో టిక్కెట్లను ప్రకటించడంపై పార్టీలో నేతలు విశేషంగా చెబుతున్నారు.

నమ్మకాన్ని నిలబెట్టిన వారికే….

నమ్మకమనేదానికి గ్యారంటీ లేదు. అయినా నమ్మకం అనేది ఉండాలి. గత ఐదేళ్లుగా పార్టీకోసం శ్రమించిన వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా గుర్తించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో 25 మంది పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు ఉంటే వారిలో 20 మంది వరకూ టిక్కెట్ పొందారు. వీరంతా గత ఐదేళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తున్న వారే కావడం విశేషం. తమ సొంత డబ్బులు ఖర్చు చేసి మరీ పార్టీని కాపాడారు. అంతేకాదు కే్ంద్ర నాయకత్వం ఏ పిలుపునిచ్చినా వెంటనే స్పందించి కార్యాచరణకు దగేవారు. ఈ ఫీడ్ బ్యాక్ అంతటినీ జగన్ తెప్పించుకున్న తర్వాతనే అభ్యర్థులను ఖరారు చేశారు.

ఇరవై మంది వరకూ…..

మొత్తం 25 మందిలో 20 మందికి టిక్కెట్లు లభించాయి. మిగిలిన ఐదుగురికి టిక్కెట్లు దక్కకపోవడానికి కారణాలున్నాయి. అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ ఛార్జి పరీక్షిత్ రాజుకు టిక్కెట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఈయన సతీమణి పుష్పశ్రీవాణికి జగన్ కురుపాం టిక్కెట్ ను కేటాయించారు. అలాగే విశాఖపట్నం పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ తానే పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఇక కడప జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు కడప మేయర్ గా ఉండటంతో ఆయన టిక్కెట్ కోసం ప్రయత్నించనూ లేదు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జి ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి టిక్కెట్ ఆశించినా అక్కడ టీడీపీ నుంచి వచ్చిన మేడా మల్లికార్జున్ రెడ్డికి కేటాయించాల్సి రావడంతో ఆయనకు ఇవ్వలేకపోయారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

రాత్రికి రాత్రికి వచ్చి…..

ఒక్క కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జి బీవై రామయ్య కు మాత్రం సీటు దక్కలేదు. కోట్ల సూర్యప్రకాశరెడ్డిని ఎదుర్కొనే అంగ,అర్థ బలం లేకపోవడం వల్లనే ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా 25 పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జుల్లో 20 మంది వరకూ ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లను దక్కించుకున్నారు. అలాగే అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి కూడా జగన్ మొండిచేయి చూపడాన్నికూడా పార్టీ నేతలు స్వాగతిస్తున్నారు. చివరి నిమిషంలో వచ్చి టిక్కెట్లు దక్కించుకునే వారికి జగన్ ఈ విధంగా ఫుల్ స్టాప్ పెట్టారంటున్నారు. అయితే నెల్లూరు, ఒంగోలు, కాకినాడ పార్లమెంటు స్థానాల్లో మాత్రం జగన్ అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారట. మొత్తం మీద జగన్ ఫ్యాన్ కోసం కష్టపడిన వారనే ఎంపిక చేశారు.

Ravi Batchali
About Ravi Batchali 31160 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*