భవిష్యత్తుకు బ్యాలెన్స్…!!

ys-jaganmohanreddy-future-politics

దీర్ఘకాలం అధికారంలో ఉండాలనుకుంటున్నవారు సమాజంలోని వివిధ వర్గాలను సంత్రుప్తి పరచడం చాలా అవసరం. వర్గమంటే ఇప్పుడు కులంగా స్థిరపడిపోయింది. ముఖ్యంగా రాజకీయాల్లో ఎవరికెన్ని టిక్కెట్లిచ్చారు? తమకెంత వాటా దక్కిందనే లెక్కలు ఎక్కువైపోయాయి. ముప్ఫైఏళ్లపాటు రాష్ట్రంలో రాజకీయాధికారం తనదేనని ఘంటాపథంగా ప్రకటిస్తున్న జగన్ వ్యూహాత్మకంగానే పావులు కదుపుతున్నారు. టిక్కెట్ల పంపిణీ సందర్భంగా కొంత ఒత్తిడికి గురయ్యారు. అప్పటికి చాలా బలంగా కనిపించిన తెలుగుదేశం, దాని అధినేత చంద్రబాబు సమయానుకూల వ్యూహాలను ఎదుర్కోవాలంటే మాటలు కాదని వైసీపీ భావించింది. అందుకే అనేక రకాలైన సమీకరణలను దృష్టిలో పెట్టుకోవాల్సి వచ్చింది. అందువల్లనే అందరికీ అనుకున్నట్లుగా టిక్కెట్లు ఇవ్వడం సాధ్యపడలేదు.కానీ వైసీపీ అప్రతిహతమైన విజయం తో టీడీపీ మేజిక్ పేలవమేనని తేలిపోయింది. అందుకే మంత్రివర్గ ఏర్పాటు సందర్భంగా స్వేచ్ఛను తీసుకున్నారు. పక్కా లెక్క, భవిష్యత్తు అధికార స్థిరత్వం, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మరింత పటిష్ఠపరచడమనే ఎత్తుగడలతో మంత్రివర్గ కూర్పు సాగింది.

కులాల కురుక్షేత్రం…

ప్రతి విషయమూ కులం చుట్టూనే తిరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కులాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధి వంటి మాటలు, గణాంకాలను ప్రభుత్వం ఎంతగా చెబుతున్నప్పటికీ కులం కూడా అతి ప్రధానమైన రాజకీయాంశంగా మారింది. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలే రాష్ట్రాన్ని పాలిస్తున్నాయనే భావన సర్వత్రా వ్యాపించింది. అయితే ఆయా సామాజిక వర్గాలకు ప్రత్యామ్నాయం ఆవిష్కరించడంలో విపక్షాలు విఫలమవుతున్నాయి. కాపు సామాజిక వర్గం దన్నుతో ప్రజారాజ్యం, జనసేన రంగంలోకి దిగాయి. 2009లో ప్రజారాజ్యాన్ని కొంతమేరకు టీడీపీ, కాంగ్రెసులకు ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించారు. అందుకే 70 లక్షల ఓట్ల పైచిలుకు లభించాయి. కానీ జనసేనను వైసీపీ, టీడీపీ లకు ప్రత్యామ్నాయ శక్తిగా భావించకపోవడంతో సొంత సామాజిక వర్గం సైతం పూర్తిగా మద్దతు ఇవ్వలేకపోయింది. పవన్ కల్యాణ్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. మిగిలిన కొన్ని సామాజిక వర్గాల మద్దతు కూడగట్టగలడనే భరోసా లభిస్తే కాపు సామాజిక వర్గం వెన్నంటి నిలిచి ఉండేది. ఆ అవకాశం భవిష్యత్తులో కూడా రాకుండా జగన్ మోహన్ రెడ్డి చాలా సంతులనంతో మంత్రి వర్గ కూర్పు చేయగలిగారు. ఏ సామాజిక వర్గమూ తమకు అన్యాయం జరిగిందనే వాదన తేకుండా జాగ్రత్త పడ్డారు.తన సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు ఉన్నప్పటికీ అతి తక్కువ సంఖ్యలో మంత్రివర్గంలో రెడ్ల సంఖ్యను కుదించగలిగారు.

అందరికీ ఆదరణ…

సొంత సామాజిక వర్గాన్ని నియంత్రించడంలో వైఫల్యం చెంది కుల ముద్ర బలంగా వేయించుకుంది టీడీపీ. మంత్రివర్గంలో ఆరోవంతు మంది కమ్మసామాజిక వర్గానికే ప్రాతినిధ్యం వహించారు. ఎన్నికల్లో 175 సీట్లకు గాను 40 సీట్లు అదే సామాజిక వర్గానికి కేటాయించింది. దీంతో మిగిలిన కులాలు, వర్గాలకు సీట్లు ఇవ్వడంలో టీడీపీకి ఇబ్బందులు ఎదురయ్యాయి. అదే సమయంలో వైసీపీ కమ్మ కులస్థులకు కేవలం పది సీట్లు మాత్రమే కేటాయించింది. టీడీపీ, వైసీపీలు రెడ్ల విషయంలో ఇంచుమించు సమానంగానే కేటాయింపులు చేయాల్సి వచ్చింది. పదిలోపు సీట్లు తేడా తప్ప. సామాజికంగా అధికారచీలిక కారణంగా రెడ్లు ఎనబై శాతం పైచిలుకు వైసీపీకి అండగా నిలిచారు. కమ్మసామాజిక వర్గం డెబ్భై శాతం వరకూ టీడీపీకి అండగా నిలిచింది. తమ సొంత సామాజిక వర్గానికే టీడీపీ టిక్కెట్లిచ్చుకున్నట్లు గణాంకాలు నిరూపిస్తుండటంతో టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీలు సైతం దూరమయ్యారు. ఇవన్నీ కలగలిసి టీడీపీ ఘోరపరాజయానికి దారి తీశాయి. టీడీపీపై పడిన కులముద్ర వైసీపీపై పడలేదు. కమ్మ సామాజిక వర్గం సీట్లలో కోత పెట్టి మిగిలిన వారందరికీ పంచగలిగింది. ఫలితంగా మొదట్నుంచి అండగా ఉన్న ఎస్సీ,ఎస్టీ, రెడ్డి, మైనారిటీలతోపాటు అన్ని కులాలు ఆ పార్టీని ఆదరించాయి. అదే ఘన విజయానికి కారణమైంది.

జ’గన్‘ పేలింది..

టీడీపీ ఎందుకు ఘోరంగా విఫలమైందో గమనించిన జగన్ తొలి అడుగు నుంచే జాగ్రత్త పడుతున్నారు. తాను అందరి వాడిగా ముద్ర వేయించుకోవాలని తహతహలాడుతున్నారు. సొంత కులానికి చెందిన కొందరు నొచ్చుకున్నా మిగిలిన కుల వర్గాలను కలుపుకుని పోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకుంటున్నారు. సొంత కుల వలయంలో చిక్కుకోకుండా మంత్రివర్గాన్ని వివిధకులాల సమాహారంగా తీర్చిదిద్దడంలోని లౌక్యమిదే. కొందరికి మంత్రిపదవులు ఇవ్వకపోయినంతమాత్రాన తన కులస్థులు వైసీపీకి దూరం కారు. అదే విధంగా కమ్మ కులానికి పెద్ద పీట వేసినంతమాత్రాన ఆ కులస్థులు అక్కున చేర్చుకోరు. అందువల్ల మిగిలిన కులాల విషయంలో బ్యాలెన్సు పాటించడం ద్వారా అధికార స్థిరత్వం సాధించాలి. భవిష్యత్ ఎన్నికలకు బాటలు వేసుకోవాలి . ఈ సూత్రాన్ని వంటపట్టించుకోవడం వల్లనే తొలి మంత్రివర్గంలోనే మైనారిటీలు, అగ్రవర్ణాలు, బడుగు,బలహీనవర్గాలందరికీ చోటు ఉండేలా చూసుకున్నారు. చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలో ఈ సంతులనం లోపించింది. దాదాపు చివరి ఏడాది వరకూ ఎస్టీ, మైనారిటీలు మంత్రివర్గంలోనే లేరు. కమ్మసామాజిక వర్గమే అగ్రపీఠం వహించింది. మిగిలిన కులాలు దూరమవ్వడానికి అదో కారణంగా నిలిచింది. అందువల్లనే సంక్షేమ మంత్రం సైతం ఫలించలేదు. మన వాడు ఎలాగూ మన వాడే. మిగిలిన వాళ్ల సంగతి పట్టించుకోవాలనే రాజనీతి సూత్రాన్ని వంట పట్టించుకున్న ముందుచూపు జగన్ మంత్రివర్గంలో కనిపిస్తోంది. గడచిన పదేళ్లు కోల్పోయామన్న అత్యుత్సాహం టీడీపీ పాలనలో ఆ సామాజికవర్గంలో కనిపిస్తే, వైసీపీ ప్రభుత్వం రానున్న కాలానికి మరింత పటిష్ఠమవ్వాలనే ముందు చూపు జగన్ లో తొంగి చూస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 39148 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*