
ఏపీలో వైసీపీకి 151 సీట్లు, ఇరవై రెండు లోక్‌సభ సీట్లు వచ్చాయి. సంఖ్యాపరంగా చూస్తే ఈ రెండు ఫిగర్లు తిరుగు లేనివి. ప్రతిపక్ష టిడిపి కేవలం 3 ఎంపీ సీట్లతో పాటు… 23 అసెంబ్లీ సీట్లకు పరిమితమైంది. ఇంతటి ఘనమైన ప్రభంజనంలోనూ జగన్ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే మరో రెండు మూడు సీట్లు వైసీపీ సులువుగా గెలిచి ఉండేదన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సీట్లు గుంటూరు నగరంలో ఉన్న గుంటూరు వెస్ట్ సీటు ఒకటి. గత ఎన్నికల్లో ఈ సీటును టిడిపి 19 వేల ఓట్ల మెజార్టీతో గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల రెడ్డి వైసీపీ అభ్యర్థి లేళ్ల అప్పిరెడ్డిపై విజయం సాధించారు. మోదుగులకు, స్థానిక టిడిపి కేడర్‌తో పాటు పార్టీ అధిష్టానంతో తీవ్రమైన వైరుధ్యం ఉండడంతో నియోజకవర్గంలో టీడీపీ అంటేనే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది.
ఖచ్చితంగా ఓడే సీట్లలో…
మోదుగుల పార్టీని, నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఆయన్ను పార్టీ వాళ్లు పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లాలో టిడిపి ఖచ్చితంగా ఓడిపోయే సీట్లలో వెస్ట్ సీటు కూడా ఉంటుందని ఆ పార్టీ వాళ్ళు చెప్పారు. అలాంటి చోట ఈరోజు టిడిపి గెలవటం వెనక వైసిపి వ్యూహాలు ఇక్కడ పని చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. జగన్ ఈ ఎన్నికల్లో మాజీ ఐపిఎస్ అధికారి చంద్రగిరి ఏసురత్నంను రంగంలోకి దింపారు. కేవలం ఆర్థిక కోణాల నేపథ్యంలోనే ఏసురత్నంకు బాధ్యతలు అప్పగించిన జగన్ ఇక్కడ ఎలా అయినా గెలవొచ్చని భావించారు. ఏసురత్నం బీసీల్లోని వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న 15వేల వడ్డెర సామాజిక వర్గం ఓట్లు పార్టీకి వన్ సైడ్ పడతాయని జగన్ ప్లాన్ వేశారు.
దూసుకెళ్లలేక…..
జగన్ ప్లాన్ ఎలా ఉన్నా ఏసురత్నం నియోజకవర్గ ప్రజలకు కాదు కదా… కనీసం వైసిపి కేడర్‌లోకి కూడా దూసుకు వెళ్ళలేకపోయారు. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆయనకు ప్రజలతో ఎలా మమేకం కావాలి, ప్రజల్లోకి ఎలా చొచ్చుకుపోవాలన్నది తెలియలేదు. అయితే యేసురత్నం కంటే ఎన్నికల చివరిలో సీటు దక్కించుకున్న ఉండవల్లి శ్రీదేవి, కిలారు వెంకట రోశయ్య లాంటి వాళ్ళు తాడికొండ, పొన్నూరులో విజయం సాధించారంటే అవి గ్రామీణ నియోజకవర్గాలు కావడం కూడా ఓ కారణం. చంద్రగిరి ఏసురత్నం ఎన్నికల చివరి వరకు కూడా ప్రచారంలో సరైన ప్రణాళిక లేకుండా వెళ్లడం కూడా ఆయన ఓటమికి ప్రధాన కారణం. నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో పాటు, గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ గా భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న అప్పిరెడ్డిని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లడంలో కూడా ఏసురత్నం విఫలమైనట్టే కనబడుతోంది.
అప్పిరెడ్డికి ఇచ్చి ఉంటే….
ఎన్నికల ఫలితాలు వచ్చాక చాలా మంది వెస్ట్ సీటు ఇచ్చి ఉంటే ఆయన ఖచ్చితంగా విజయం సాధించి ఉండే వారు అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోనే కాకుండా గుంటూరు నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న మూడు నాలుగు నియోజకవర్గాల్లో అప్పిరెడ్డి కి మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. గత ఎన్నికల్లో ఓడిన అప్పిరెడ్డి ఆర్థికంగా కాస్త వీక్ అయ్యారన్న కారణంతోనే జగన్ పక్కన పెట్టారు. వాస్తవంగా చూస్తే అప్పిరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. జగన్ కాంగ్రెస్‌ను వీడి వైసిపి పెట్టినప్పటినుంచి ఆయన వెంటే నడుస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ? ఉన్నా పోల్ మేనేజ్ మెంట్ చేయడంలో అప్పిరెడ్డి దిట్ట. ఈ ఎన్నికల్లో ఆయన పూర్తిగా వాడుకోవటంలో ఏసురత్నం విఫలమయ్యారు. మిర్చి యార్డ్ చైర్మన్ గా ఉన్నప్పుడు అప్పిరెడ్డి గుంటూరు నగరంతోపాటు గుంటూరు రూరల్ ప్రాంతంలో రైతుల దగ్గర మంచి పట్టు సాధించారు. పార్టీతో పాటు ఆయనకు వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉంది. అప్పిరెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన ఖచ్చితంగా గెలిచి ఉండేవారు. వాస్తవానికి వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన ఎన్నికల్లో ఆర్థికంగా టిడిపి అభ్యర్థులను ఢీ కొట్ట లేరు అన్న ఒకే ఒక్క కారణంతోనే పక్కన పెట్టారు.
సామాజికవర్గాల సమీకరణల్లోనే…..
పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనకు మరో పదవి ఇస్తామన్న హామీతో సరిపెట్టారు. దీనికి తోడు జిల్లాలో వైసీపీ నుంచి మంగళగిరి, నరసరావుపేట, గురజాల, మాచర్ల తో పాటు గుంటూరు ఎంపీ సీటుని సైతం రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడంతో అదే సామాజికవర్గానికి చెందిన అప్పిరెడ్డి సీటుకు కోత పెట్టటానికి మరో కారణం. గత ఎన్నికల్లో గుంటూరు తూర్పు నుంచి ఓడిన వైశ్య సామాజిక వర్గానికి చెందిన మద్దాలి గిరి ఈ సారి టిడిపి వెస్ట్ కు మార్చింది. ఏసురత్నంతో పోలిస్తే మద్దాలి గిరి గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతితో కూడా గట్టెక్కారు. అదే జగన్ అప్పటి రెడ్డికే ఇక్కడ సీటు ఇచ్చి ఉంటే వెస్ట్ నియోజకవర్గంలో గత ఎన్నికలలో అప్పిరెడ్డి ఓడిన సానుభూతితో ఇక్కడ ఖచ్చితంగా వైసీపీ గెలిచే ఉండేది. ఏదేమైనా జగన్ వెస్ట్ సీటుపై చేసిన ప్రయోగం ఇంత వేవ్‌లో కూడా ఫెయిల్ అయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
Leave a Reply