ఇద్దరికీ ఆ…సీట్లే టెన్షన్….!!

ys-jaganmohanreddy-narachandrababu-naidu

ఇద్దరికీ ఆ సీట్లపైనే టెన్షన్… వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడులు కొన్ని సీట్లపై తీవ్రంగా టెన్షన్ పడుతున్నారు. ఈ నియోజకవర్గాలపై తాజాగా కూడా ఇద్దరూ రివ్యూ చేయడం విశేషం. ఈ సీట్లలో ప్రత్యర్థిని ఓడించడమే ఇద్దరి లక్ష్యం. తమ పార్టీ అభ్యర్థులు గెలిస్తే సంఖ్యాపరంగానే కాకుండా మానసికంగా కూడా పెద్ద విజయమే అవుతుందన్నది రెండు పార్టీల అధినేతల భావన. అందుకోసమే ఈ హాట్ సీట్లపై పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల సరళిని తెప్పించుకుని మరీ లెక్కలు వేసుకుంటున్నారంటే వారికి ఈ సీట్లు గెలవడం ఎంత ప్రతిష్టాత్మకమో ఇట్టే అర్థమవుతుంది.

నారా లోకేష్ సీటు…

ముఖ్యంగా మంగళగిరి సీటు తీసుకుంటే ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్ పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. చంద్రబాబునాయుడు ఈ సీటుపై కొంత టెన్షన్ పడుతున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా లెక్కలు తెప్పించుకుని చూసినా గెలుపు ఖాయమని టీడీపీ నేతలే చెప్పలేకపోతున్నారు. లోకేష్ ను ఓడించి మానసికంగా చంద్రబాబును దెబ్బతీయాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. అందుకే జగన్ ఈ నియోజకవర్గంపై ఇటీవల హాలీడే ట్రిప్ నుంచి వచ్చిన అనంతరమూ రివ్యూ చేసినట్లు చెబుతున్నారు.

చీరాల చికాకు….

గుడివాడ సీటు కూడా చంద్రబాబుకు ప్రతిష్టాత్మకమే. తనపై విరుచుకుపడే కొడాలి నానిని ఓడించాలన్నది చంద్రబాబు లక్ష్యం. ఇక్కడ దేవినేని అవినాష్ ను టీడీపీ బరిలోకి దించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో జగన్ కూడా కొడాలి నాని గెలుపు అవకాశాలు ఎంత వరకూ ఉన్నాయన్నదానిపై సమీక్ష చేశారట. ఇక మరోహాట్ సీటు చీరాల. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్, టీడీపీ అభ్యర్థిగా కరణం బలరాం బరిలోకి దిగారు. కరణం గెలుపు కన్నా ఆమంచిని ఓటమే చంద్రబాబు ఎక్కువగా కోరుకుంటున్నారు. చివరి నిమిషంలో తనకు హ్యాండ్ ఇచ్చి పార్టీని వీడటం పట్ల ఆయన ఆమంచిపై ఆగ్రహంతో ఉన్నారు. ఇక జగన్ కూడా కరణాన్ని ఓడించి ప్రకాశం జిల్లాలో పార్టీ క్లీన్ స్వీప్ ఉండాలని భావిస్తున్నారు.

సోమిరెడ్డి విషయంలోనూ….

సర్వేపల్లి నియోజకవర్గంపై జగన్ టెన్షన్ పడుతున్నారట. అక్కడ కాకాణి గెలిచి సోమిరెడ్డిని దెబ్బతీయాలన్నది జగన్ ఆలోచన. గత ఐదేళ్ల నుంచి సోమిరెడ్డి తనపై వ్యక్తిగతంగా చేస్తున్న విమర్శలకు ఈ గెలుపుతో చెక్ పెట్టాలన్నది జగన్ భావనగా ఉంది. చంద్రబాబు సయితం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిస్తే నెల్లూరు జిల్లాలో అధిక స్థానాలు వచ్చే అవకాశముందని నమ్ముతున్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల్లో సయితం ఫలితాలపై చంద్రబాబు, జగన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమ పార్టీ వాయిస్ లుగా ఉన్న రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు గెలిచి చంద్రబాబును సొంత జిల్లాలో దెబ్బతీయాలని ఈ రెండు నియోజకవర్గాల రిపోర్టులు కూడా తెప్పించుకున్నారట. చంద్రబాబు కూడా నగరి, చంద్రగిరిల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయి అసెంబ్లీలో వారి వాణి విన్పించకూడదన్నభావనతో ఉన్నారు. మొత్తం మీద జగన్, చంద్రబాబులు ఇద్దరూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ హాట్ సీట్లపైనే ఎక్కువగా టెన్షన్ పడుతున్నట్లు కన్పిస్తోంది.

Ravi Batchali
About Ravi Batchali 39095 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*