చరిత్ర తిరగరాస్తేనే మంచిదా…??

ys-jaganmohanreddy-temple-committees

దేవాలయాల ధర్మకర్తల మండలి పేరు చెబితే చాలు రాజకీయ వాసనలు గుప్పుమంటాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కీలకమైన దేవస్థానాల పదవుల కోసం అప్పుడే పైరవీలు మొదలయ్యాయి. ఛైర్మన్, ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమితులైతే సంఘంలో హోదా, ప్రత్యేక గుర్తింపు, పలుకుబడి లభిస్తాయి. అందుకే అధికారంలో ఉన్న పార్టీల నాయకులు తమ స్థాయికి తగిన విధంగా ఏదో ఒక పదవిని దక్కించుకోవాలనుకుంటారు. ఏమాత్రం అవకాశమున్నా రాష్ట్రస్థాయి దేవాలయాల్లో పదవులు, వీలు కాకపోతే నియోజకవర్గంలో ప్రఖ్యాత ఆలయాల పాలన బాధ్యతలు స్వీకరించాలనే యోచనతో మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద రాజకీయ ఒత్తిడి పెంచుతుంటారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం సంగతైతే చెప్పనే అక్కర్లేదు. ముఖ్యమంత్రే స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ గత ప్రభుత్వం నియమించిన పాలకమండళ్లు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం పాలకమండళ్లు రాజీనామా చేశాయి. కొన్ని చోట్ల తమ పదవీ కాలం పూర్తయ్యే వరకూ కొనసాగుతామంటూ భీష్మిస్తున్నాయి. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా అయినా వీరిని తొలగించాలనేది ప్రభుత్వ యత్నం. కానీ సాంకేతికంగా న్యాయపరమైన చిక్కులు తలెత్తేందుకు అవకాశం ఉంది. చట్టంలో నిర్దిష్ట కాలవ్యవధికి నియమితమైన పాలకమండలిని తొలగించేందుకు తగినంత ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.

మార్పు వచ్చేనా…?

ఇదిలా ఉండగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయిన ట్రస్టుబోర్డులలో ఈ సారైనా మార్పు తేవాలని కోరుతున్నారు. గతంలో పొలిటికల్ ప్రాధాన్యాలతో అన్నిటా నాయకులతో నింపేయడంతో పవిత్రత దెబ్బతిందనే విమర్శ ఉంది. దాంతో జగన్ మోహన్ రెడ్డి నేతృత్రుత్వంలోని సర్కారైనా దీనికి స్వస్తి పలకాలనే వాదన ఊపందుకుంటోంది. అన్నిటా కొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాలయాలను కూడా సంస్కరించాలనే డిమాండ్ పెరుగుతోంది. రాజకీయ శిబిరాలుగా మారిపోయిన ధర్మకర్తల మండళ్ల లో పొలిటీషియన్ల పాత్రను తగ్గించాలని ఆధ్యాత్మిక వేత్తలు అభ్యర్థిస్తున్నారు. భక్తులకు సేవల మెరుగుదల, నిధుల సద్వినియోగం, దేవాలయాల ఆస్తుల పరిరక్షణ ప్రధాన బాధ్యతలుగా మానవ సేవయే మాధవ సేవగా తరించాల్సిన ధర్మకర్తలు రాజకీయ ఆశ్రితులుగా మారడం ఆక్షేపణీయమవుతోంది. ప్రభుత్వం మారినప్పుడల్లా బోర్డులు మార్చాల్సి వస్తోంది. ఏపార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులతో ఛైర్మన్ , బోర్డు సభ్యుల పదవులను నింపేస్తున్నారు. దాంతో పార్టీని బట్టి పాలకమండళ్లు రాజకీయ వాసనలు వెదజల్లుతున్నాయి. దీనికి కొత్త సర్కారు అడ్డుకట్ట వేయాలనేది ముఖ్యమైన డిమాండ్.

పైరవీలు..పంచాయతీలు..

రాజకీయ ఆశ్రితులకే అందలం వెయ్యడమనేది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సాధారణంగా సాగే తంతే. పదవిని అడ్డుపెట్టుకుని పైరవీలు చేసుకునేవారే దేవాలయాల్లో కనిపిస్తున్నారు. పెద్ద నాయకుల భజన తప్ప ధర్మకర్తగా భక్త జనసేవలు శూన్యంగా కనిపిస్తున్నాయి. అందులోనూ తిరుమలతిరుపతి దేవస్థానం వంటి పదవులైతే చిన్నాచితక వ్యవహారం కాదు. టీటీడీ బోర్డులో స్థానం అంటే కనీసం ఎమ్మెల్యే స్థాయి ఉండాల్సిందే.మంత్రులుగా అవకాశం ఇవ్వడం కుదరని వారికి బుజ్జగింపుగా టీటీడీ ట్రస్టు బోర్డు పదవులు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. అదే విధంగా పార్టీకి నిధులు సమకూర్చేవారు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు,సినీపెద్దల వంటివారితోనూ బోర్డులు నిండిపోతున్నాయి. ధార్మిక, ఆధ్యాత్మిక భావాలు కలిగినవారు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అటువంటి వారిని ఒకరిద్దర్ని నియమించినా అదంతా మొక్కుబడి తంతే. కేవలం బోర్డు పరపతి చాటుకోవడానికే. గతంలో ట్రస్టుబోర్డు సభ్యులు టీటీడీ టిక్కెట్లు విక్రయించుకొన్నారనే ఆరోపణలు సైతం వినవచ్చాయి. ప్రధానంగా తమ పరపతి పెంచుకోవడానికి దేవాలయాల పదవులను వినియోగించుకుంటున్నారు తప్పితే భక్తులకు ఏరకంగా వసతులు పెంచాలనే విషయమై బోర్డు సభ్యులు ద్రుష్టి పెట్టడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పెద్ద దేవాలయాలన్నీ రాజకీయ ప్రముఖులతో నిండిపోతున్నాయి. ఇక జిల్లా, నియోజకవర్గ స్థాయి ప్రముఖ క్షేత్రాలు అధికారపార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎమ్మెల్యేల సిఫార్సులతోనే స్థానిక ఆలయాల ట్రస్టులు నియామకమవుతున్నాయి. దీంతో చోటామోటా నాయకులకు శిబిరాలుగా మారిపోతున్నాయి ఆలయాలు.

ఎవరైతేనేం…?

పార్టీ, ముఖ్యమంత్రి ఎవరైనా రాజకీయ ప్రాపకంతోనే ట్రస్టు బోర్డుల నియామకాలు సాగుతున్నాయి. ఇందుకు పెద్ద ఉదాహరణగా తిరుమల తిరుపతి దేవస్థానాలనే చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి చంద్రబాబు నాయుడు ఇలా గడచిన 25 ఏళ్ల సర్కారుల హయాం తీసుకుని లెక్కిస్తే అసలు సంగతి బయటపడుతుంది. ఆదికేశవులు నాయుడు, సుబ్బిరామిరెడ్డి, కరుణాకరరెడ్డి, కనుమూరి బాపిరాజు, చదలవాడ కృష్ణమూర్తి, పుట్టా సుధాకర్ యాదవ్ ఇలా టీటీడీ ఛైర్మన్ పదవి అలంకరించిన వారంతా ఫక్తు రాజకీయవేత్తలే. కేవలం అధ్యక్షులే కాకుండా మూడొంతుల మంది సభ్యులూ రాజకీయ నాయకులే. అందువల్లనే టీటీడీ నిధుల దుర్వినియోగానికి కూడా ఆస్కారం ఏర్పడుతోంది. తమ ప్రాపకం కోసం ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల్లో అవసరానికి మించి టీటీడీ నిధులతో కల్యాణ మండపాల వంటి నిర్మాణాలు చేపట్టారు. ఇక దర్శనాలు, సేవల టిక్కెట్ల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. గతంలో ముఖ్యమంత్రుల వ్యవహారశైలికి భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటారా? లేదా? అన్నది వేచి చూడాలి. మంత్రివర్గం విషయంలో సాహసోపేతంగా వ్యవహరించిన జగన్ ధర్మకర్తల మండలి విషయంలోనూ కొత్త సంప్రదాయం నెలకొల్పితే అది రికార్డే అవుతుంది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ టీటీడీ పాలకమండలిపై అనేక విమర్శలు చేశారు. తన ప్రభుత్వంపై కూడా ఆ రకమైన విమర్శలు రాకుండా ఉండాలంటే రాజకీయ నాయకులను నాలుగోవంతుకు పరిమితం చేసి, మిగిలిన సభ్యులను ధార్మిక, ఆధ్యాత్మిక వేత్తలనుంచి ఎంపిక చేస్తే బాగుంటుందనే సూచనలు వెలువడుతున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 16633 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*