జగన్ నువ్వు చేసింది నచ్చలేదు..!!

ఉండవల్లి అరుణ్ కుమార్

వైఎస్ జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ విభేదించారు. ఎపి విభజన అంశాన్ని అసెంబ్లీలో మరోసారి చర్చించాలని గతంలో చేసిన తీర్మానాలను పరిశీలించి లోక్ సభలో అన్ని పార్టీల ముందు జరిగిన అన్యాయం వివరించాలని సూచించారు. రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన విభజన ప్రక్రియకు ఏమి న్యాయం అంతా కలిసి చేస్తారో నిలదీయాలి అని చెప్పారు. 2014 తీర్మానాల ఆధారంగా పోరాడితే మన హక్కులు మనం సాధించుకోవచ్చని తెలిపారు ఆయన. నాడు ఎంపీగా విభజన సమయంలో వున్న జగన్ పార్లమెంట్ లో ఏం చేశారో గుర్తుంచుకోవాలన్నారు. నాటి అన్యాయానికి పార్లమెంట్ లో సాక్షి జగన్ అని గుర్తు చేశారు ఉండవల్లి.

కెసిఆర్ తో కలయిక శుభపరిణామమే …

కెసిఆర్ తో రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసిన తీరు శుభపరిణామమే అన్నారు అరుణ కుమార్. విభజన సమస్యలు ఇరువురు ఒక కొలిక్కి తీసుకు వచ్చే ప్రయత్నం చేయడం ద్వారా రెండు రాష్ట్రాలకు ముఖ్యంగా ఏపీకి న్యాయం జరుగుతుందన్నారు. ఈ సఖ్యత ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. లోక్ సభ లో జరిగిన అవమానాలు మర్చిపోతే ఆంధ్రులు అసమర్థులుగా చరిత్రలో నిలిచిపోతారని హెచ్చరించారు ఉండవల్లి. తెలంగాణ కు ఒక పోర్ట్ కావాలని గతంలో కెసిఆర్ కోరారని, అది కేటాయించడం ద్వారా ఇరు రాష్ట్రాలు లబ్ది పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉపాధి అవకాశాలు మెరుగు పడి ఏపీకి నిధుల వరద పారే అవకాశం ఉంటుందన్నారు.

వాన్ పిక్ మళ్ళీ తీసుకురండి …

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వైఎస్ రాజశేఖర రెడ్డి వాన్ పిక్ ప్రాజెక్ట్ తీసుకువచ్చారని దానిపై మళ్ళీ కసరత్తు చేసి జగన్ తండ్రి డ్రీం ను పూర్తి చేయాలనీ కోరారు. ఆ ప్రాజెక్ట్ గ్రౌండ్ అయితే యువతకు ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా వుంటాయనై దీనిపై తక్షణం ఆలోచన చేయాలని ఉండవల్లి జగన్ కి సూచించారు. వాన్ పిక్ వివాదంలోనే జగన్ కేసుల్లో ఇరికించారన్న విషయాన్ని గుర్తు చేశారు. అందువల్ల ఈ ప్రాజెక్ట్ ను జగన్ తిరిగి టేక్ అప్ చేసి దానివల్ల జరిగే అభివృద్ధిని ప్రజలకు చూపించాలని కోరారు అరుణ కుమార్. ప్రాజెక్టులపై ఆరోపణలు వేరు అందులో వుండే లబ్ది వేరన్నారు ఆయన. గతంలో బోఫోర్స్ గన్ లపై ఆరోపణలు వెల్లువెత్తాయని కానీ ఆ గన్స్ లేకపోతే కార్గిల్ యుద్ధంలో మన సైనికులు ముందుకు సాగలేక పోయేవారని గుర్తు చేశారు. వాన్ పిక్ ను పెద్ద వివాదంగా మలిచిన ప్రాంతంలోనే దాదాపు అన్ని సీట్లను వైసిపి గెలిచిందని మర్చిపోవొద్దన్నారు.

మీరు ఇలా చేస్తే మద్యపాన నిషేధం చేసినట్లే …

నార్కోటిక్స్ మీద, సిగరెట్ల మీద జరుగుతున్న ప్రచారం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని అదే రీతిలో మద్యపానం మీద కూడా పోరాటం చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేయండని సలహా ఇచ్చారు అరుణ కుమార్. మద్యపాన నిషేధం దశలవారీగా అమలు పై ఎమ్యెల్యేలు, మంత్రులు అధికారులతో ఇతర అన్ని వర్గాలతో విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

మోడీ అంటే నాకు ఇష్టం లేదు …

దేశ ప్రధాని నరేంద్ర మోడీ రెండో సారి పదవిని చేపట్టడం వ్యక్తిగతంగా ఇష్టం లేదని కానీ ప్రజా ఆమోదాన్ని అందరు శిరసావహించాలన్నారు. మోడీ విజయం సాధించడానికి ప్రతిపక్షాలకు వ్యూహం సక్రమంగా లేకపోవడమే అని విపక్షాల వ్యూహాలను ప్రధాని తనకు అనుకూలంగా సమర్ధవంతంగా మార్చుకున్నారని విశ్లేషించారు ఉండవల్లి. ప్రధాని తన ప్రసంగంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని ఇప్పటివరకు కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చని కానీ తప్పు చేయలేదన్నారని చెప్పారు. ఇక పై పబ్లిసిటీ కోసం పని చేయనని చెప్పారని అంటే ఇప్పటివరకు ఆయన పొరపాట్లు చేయడం, పబ్లిసిటీ కోసమే పని చేశారని పరోక్షంగా అంగీకరించారని అయితే అవి సరిదిద్దుకోవాలనుకుంటున్నట్లు చెప్పడాన్ని స్వాగతించారు ఉండవల్లి.

మోడీకి సూచనలు చేయండి …

కాశ్మీర్ వివాదానికి స్వస్తి పలికితే దేశానికి ఆదాయం మాములుగా ఉండదని అన్నారు అరుణ కుమార్. రక్షణ బడ్జెట్ లో సగం మిగిలి పోతుందని దేశంలో పూరి గుడిశ లేకుండా అన్ని పక్కా గృహాలు నిర్మించి పేదరికం భారత్ ను చూడొచ్చన్నారు. పూర్తి బలంతో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ కి జగన్ ఈ విషయంలో సూచనలు చేయాలని పాకిస్థాన్ తో ఫలప్రదమైన చర్చలు జరిపితే కాశ్మీర్ సమస్య శాస్వితంగా పరిష్కారం అవుతుందని వివరించారు ఉండవల్లి. తీవ్రవాదం దేశ అభివృద్ధి నిరోధకమని దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రూపంలో మంచి అవకాశం ఉందన్నారు. ఇమ్రాన్ సైతం ఈ అంశంపై గట్టిగా దృష్టి పెట్టారని కనుక మోడీ కూడా సీరియస్ గా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలనీ ఆకాంక్ష వ్యక్తం చేశారు.

పేదలకు భారం అవుతున్న విద్య పై …

నేడు భారంగా మారిన విద్య వ్యవస్థను గాడిన పెట్టేందుకు జగన్ కృషి చేయాలన్నారు. కార్పొరేట్ స్కూల్స్ అన్ని సొసైటీలపేరుతో కోట్లాది రూపాయలు దోచేస్తున్నాయని కనుక వారితో మాట్లాడి బిసి, ఎస్సి విద్యార్థులకు ఉచిత విద్యను అందులో అందించే కార్యక్రమం చేయాలనీ కోరారు ఉండవల్లి. తాను వ్యక్తిగత పనులపై వచ్చే నెల అమెరికా వెళుతున్నందున 100 రోజుల పాటు మీడియా కు దూరంగా ఉంటున్నానని చెప్పారు అరుణ్ కుమార్. ప్రభుత్వ ఉద్యోగులు 100 శాతం అవినీతి పరులు అని జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాని వారిలో నిజాయితీ పరులను గుర్తించి ప్రోత్సహిస్తే మొత్తం వ్యవస్థలో మార్పు తధ్యమన్నారు. దీనికి ఉదాహరణ కేరళ రాష్ట్రమే అని అక్కడికి ఒక బృందాన్ని పంపి అధ్యయనం చేయిస్తే ఇక్కడ కూడా ఆ విధానాలు అమలు చేయించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి వైఎస్ జగన్ తీసుకువెళ్లాలని కోరారు.

అర్బన్ ప్రాంతాల్లో వైసిపి బలహీనత  …

వైసిపి ఓటమి చెందిన నియోజకవర్గాల్లో అర్బన్ ప్రాంతాలు ఎక్కువగా వున్న విషయాన్నీ ప్రస్తావించారు ఉండవల్లి. పత్రికల, టివి ల ప్రభావం అధికంగా అర్బన్ ప్రాంతాల్లో ఉంటుందని టిడిపి మీడియా ప్రచారం వారు నమ్మడం వల్లే అర్బన్ లో వైసిపి సీట్లు ఎక్కువ కోల్పోయిందని విశ్లేషించారు ఉండవల్లి.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1795 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*