ఉత్తరాంధ్రను ఒడిసిపట్టిన జగన్ !!

ys-jaganmohanreddy-uttarandhra-politics

టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలకు నాలుగు మంత్రి పదవులు చంద్రబాబు కేటాయించారు. 2014లో అధికారంలోకి వస్తూనే విశాఖ నుంచి సీనియర్ నేతలుగా ఉన్న గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, విజయనగరం నుంచి కిమిడి మ్రుణాళిని, శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడుకు మంత్రి పదవులు దక్కాయి. ఆ తరువాత విస్తరణలో శ్రీకాకుళం నుంచి కిమిడి కళా వెంకటరావుకు, చివర్లో కిడారి శ్రావణ్ కుమార్ కు విశాఖకు ఇవ్వడం ద్వారా ఆ సంఖ్య ఆరుకు పెంచారు. ఇక కులాల వారీగా చూసుకుంటే వెలమలు ఇద్దరికి, బీసి కాపు, ఓసీ కాపు ఇద్దరిని చంద్రబాబు మొదట్లో చోటు కల్పించినా తరువాత ముగ్గురు వెలమలు, ఇద్దరు కాపులు, ఒక ఎస్టీగా విస్తరించారు.ప్రధానంగా ఉత్తరాంధ్రాలో వెలమలు, కాపులు, బీసీలు ఎస్టీలు ఎక్కువ. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ వర్గాలకు న్యాయం చేయాల్సిందే.

కాళింగుకు పెద్ద పీట….

ఇక జగన్ బీసీలను మరింత దగ్గరకు తీస్తూనే టీడీపీ అన్న గారి హయాం తరువాత మరచిన కాళింగులకు కూడా పెద్ద పీట వేశారు. అదే ఈసారి ఎన్నికల్లో వైసీపీకి బాగా ఉపయోగపడింది. అన్న నందమూరి నాయకత్వంలో కాళింగులకు అన్నింటా అవకాశాలు దక్కేవి, ఆ సామాజిక వర్గానికి చెందిన హనుమంతు అప్పయ్యదొరను ఎంపీగా, ఎమ్మెల్యేగా చేసిన ఘనత నందమూరిదే. తిరిగి ఆ సామాజికవర్గం నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి తమ్మినెని సీతారాంని స్పీకర్ ని చేస్తున్న ఘనత జగన్ కే దక్కింది. ఇక ఎంపీ టికెట్ తో పాటు, ఎమ్మెల్యే టికెట్లు కూడా ఆ సామాజిక వర్గానికి ఈసారి జగన్ ఇచ్చారు. శ్రీకాకుళంలో చూసుకుంటే కాళింగులకు, వెలమలకు జగన్ పదవులు ఇచ్చి సమ న్యాయం పాటించారనే చెప్పాలి. ఇక కాపుల నుంచి డిమాండ్ ఉన్నా మరో రెండున్నరేళ్ల తరువాత దాన్ని పరిశీలించే అవకాశాలైతే ఉన్నాయి.

తూర్పు కాపులకే చాన్స్…..

ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ తూర్పు కాపులు, కొప్పుల వెలమలు ఎక్కువ. దాంతో జగన్ తూర్పు కాపులు,వర్గానిక్ చెందిన సీనినర్ నేత బొత్స సత్యనారాయణకు తన క్యాబినెట్లో చోటు ఇచ్చారు. ఇక ఎస్టీల నుంచి పుష్ప శ్రీవాణిని ఉప ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం ద్వారా మహిళలను, గిరిజనులను కూడా గౌరవించారని చెప్పాలి. నిజానికి ఉత్తరాంధ్రకు ఉప ముఖ్యమంత్రి పదవి అన్నది గతంలో చంద్రబాబు హయాంలో వినిపించింది. కానీ గోదావరి జిల్లలను దాటి ముందుకు రాలేదు. ఇపుడు జగన్ ఆ ఆశను నెరవేర్చారు.

విశాఖ సిటీ రిపేర్ల కోసం….

విశాఖ రూరల్ జిల్లా అంతా వైసీపీ గాలి వీచినా అర్బన్ జిల్లాలో మాత్రం టీడీపీ జెండావే ఎగిరింది. దాంతో విశాఖ సిటీని ఒడిసిపట్టాలనుకున్న జగన్ ఇక్కడ నుంచి భీమునిపటం ఎమ్మెల్యెగా ఉన్న అవంతి శ్రీనివాస్ కి మంత్రి పదవి ఇచ్చారు. కాపు సామాజికవర్గంతో పాటు, అర్బన్ జిల్లాలో ధీటైన నేతగా ఉండడంతో అవంతిను ముందు పెట్టి టీడీపీ కోటలను బద్దలుకొట్టాలన్నది జగన్ వ్యూహంగా ఉంది. ఇక రూరల్ జిల్లాలో ఎందరో పదవులు ఆశించినా మొదటి నుంచి జగన్ పట్ల పార్టీ పట్ల విశ్వాసంగా ఉన్న బూడి ముత్యాలనాయుడుకు ప్రభుత్వ్ విప్ పదవిని ఇచ్చి వెలమ సామాజికవర్గాన్ని సంతృప్తి పరచారు. మొత్తానికి చూసుకుంటే ఉత్తరాంధ్రలో వెలమలకు రెండు పదవులు, బీసీ, ఓసీ కాపులకు రెండు పదవులు, ఎస్టీకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం ద్వారా సామాజిక సమతూకాన్ని జగన్ పాటించిననట్లైంది.

Ravi Batchali
About Ravi Batchali 18771 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*