
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాబినెట్ కూర్పులో విశాఖ అర్బన్ జిల్లాకు తొలి విడతలో ప్రాతినిధ్యం ఉండకపోవచ్చునని తెలుస్తోంది. విశాఖ జిల్లాలో మొత్తం 15 సీట్లకు గానూ 11 సీట్లు గెలుచుకున్న వైసీపీ అర్బన్ లో మాత్రం పరువు పోగొట్టుకుంది. నాలుగు కీలకమైన సీట్లను పార్టీ కోల్పోయింది. . మంత్రి గంటా శ్రీనివాసరావు ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవాలని వైసీపీ అధినాయకత్వం బలంగాప్రయత్నించింది. కానీ చివరికి ఓటమి తప్పలేదు. కేవలం 1500 ఓట్ల తేడాతో గంటా విజయం సాధించారు. ఓటమి తరువాత జగన్ ప్రత్యేకంగా విశాఖ నార్త్ వైసీపీ అభ్యర్ధి అయిన కేకే రాజుకు ఫోన్ చేసి దిగులు పడవద్దు నేనున్ననంటూ భరోసా ఇచ్చారు. దాంతో జగన్ ఈ సీటుపై ఎంతలా దృష్టి పెట్టారో తెలుస్తుంది.
అవంతికి షాకేనట….
ఇదిలా ఉండగా ఎన్నికల ముందు వైసీపీలో చేరిన భీమిలీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుకు మంత్రి వర్గంలో స్థానం ఉండదని అంటున్నారు. ఆయన కంటే ముందు నుంచి ఉన్న వారు, పార్టీని, జగన్ నమ్మి పదేళ్ళుగా వెంట నడచిన వారికే తొలి విడతలో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. విశాఖ నగరంలో వైసీపీకి సీట్లు కూడా రాకపోవడం వంటి పరిణామాల నేపధ్యంలో ఇక్కడ గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు అవంతి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిలకు అవకాశం ఉండదని అంటున్నారు. ఈ పరిణామంతో అవంతి వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.
రూరల్, ఏజెన్సీలకు చాన్స్…?
ఇక విశాఖ రూఅరల్ జిల్లాతో పాటు, ఏజెన్సీలో మొత్తం సీట్లను భారీ మెజారిటీతో వైసీపీ గెలుచుకుంది. దాంతో తొలి ప్రాధాన్యత అక్కడ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. రూరల్లో పార్టీ పట్టు నిలిపే నాయకుడికే మంత్రి పదవి అని జగన్ భావిస్తున్నారుట. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ లలో ఒకరికి మంత్రి పదవి ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇక ఏజెన్సీలో అయితే పాడేరు ఎమ్మెల్యే కే భాగ్యలక్ష్మికి బెర్త్ ఖాయమని కూడా అంటున్నారు. మొత్తానికి జగన్ ఆలోచన మేరకు చూస్తే విశాఖ అర్బన్ జిల్లాను ఈసారి పక్కన పెట్టేస్తున్నారని తెలుస్తోంది.
Leave a Reply