
వైసీపీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూనే మరోవైపు హస్తినలో కూడా హీట్ పెంచాలని యోచిస్తుంది. నిన్న మొన్నటి వరకూ వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఆమరణ దీక్షకు దిగిన ఎంపీల ఆరోగ్యం క్షీణించడంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
మరోసారి ఢిల్లీలో…..
అయితే మరోసారి ఢిల్లీలో వేడి పుట్టించేందుకు వైసీపీ ప్రణాళిక రచించుకుంది. ఈరోజు వైసీపీ ఎంపీలు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలవనున్నారు. తమ రాజీనామాలకు దారి తీసిన పరిస్థితులను రాష్ట్రపతికి చెప్పడమే కాకుండా, ఏపీ విభజన హామీలు, ప్రత్యేక హోదా వంటి అంశాలపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై కూడా వారు ఆయనకు ఫిర్యాదు చేయనున్నారు. నాలుగేళ్లుగా తాము పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని చెప్పనున్నారు.
రాజీనామాల ఆమోదానికి……
అంతేకాకుండా తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీల రాజీనామాలపై కూడా రాష్ట్రపతితో చర్చించనున్నారు. రాష్ట్రపతిని కలసిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణను ఎంపీలు ప్రకటించనున్నారు. మరోసారి స్పీకర్ ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని వైసీపీ ఎంపీలు కోరనున్నట్లు తెలిసింది. ఈ నెల 6వ తేదీన రాజీనామా చేస్తే ఇంత వరకూ ఆమోదం పొందక పోవడంతో ఏపీలో దీనిపై అధికార పార్టీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ రాజీనామాల ఆమోదానికి ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. మొత్తం మీద వైసీపీ ఇటు రాష్ట్రంలోనూ, అటు హస్తినలోనూ హీట్ పెంచాలని యోచిస్తోంది.
Leave a Reply