ఆయనను వదిలిపెట్టనంటున్న జగన్….!!!

ysjaganmohanreddy allaramakrishnareddy

మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈదఫా ఎన్నికల్లో టిక్కెట్ దక్కడం లేదు. ఇక్కడి నుంచి తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి చేరిన ఉడుతా శ్రీనుకు మంగళగిరి టిక్కెట్ ను జగన్ కన్ఫ్మర్మ్ చేశారు. మంగళగిరి నుంచి ఈసారి బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని నిర్ణయం తీసుకోవడంతో ఆర్కే ను కాకుండా ఉడుతా శ్రీనును జగన్ ఎంపి చేసినట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం ఒకరికి టిక్కెట్ ఇవ్వకుండా జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనమే. నాలుగున్నరేళ్లు పార్టీనే నమ్ముకుని పనిచేసిన వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆళ్లకు టిక్కెట్ దక్కక పోవడానికి అనేక కారణాలు లేకపోలేదు. ఆళ్ల స్వయంకృతాపరాధమూ ఇందులో ఉందని చెప్పక తప్పదు.

బాబును ముప్పుతిప్పలు పెట్టి….

ఆళ్ల రామకృష్ణారెడ్డి…. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యేగానే కాదు… చంద్రబాబునాయుడిని, తెలుగుదేశం పార్టీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లుతాగించిన వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలన్నింటిపైనా ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయస్థానానికి వెళ్లారు.కొన్నింటిలో ఆయన విజయం సాధించారు. మరికొన్నింటిలో ప్రభుత్వానికి కోర్టు చేత అక్షింతలు వేయించారు. అలాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గత కొంత కాలం నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. మంగళగిరి నియోజకవర్గం రాజధాని పరిధిలోకి రావడంతో అధికార తెలుగుదేశం పార్టీనేతలు విచ్చలవిడిగా ఖర్చుచేస్తాయన్న భయంతో ఆళ్ల వెనకడుగు వేశారు.

పోటీ చేయలేనని చెప్పడంతో…..

ఇదే విషయాన్ని జగన్ తో చెప్పారు. తాను వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేయలేనని, ఆ స్థోమత తనకు లేదని, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ తో దాదాపు రెండు నెలల క్రితమే చెప్పారు. అయితే అప్పట్లో జగన్ ఆళ్ల ఆవేశంలో ఉన్నారని పెద్దగాపట్టించుకోలేదు. మరోసారి మళ్లీ ఆళ్ల అదే ప్రస్తావన తీసుకురావడంతో జగన్ మరి అభ్యర్థిని కూడా నువ్వే చూడు అని మాత్రం అన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతటితో ఆ కథ ముగిసిపోయిందనుకున్నారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు మాత్రం ఖచ్చితంగా పోటీ చేయాల్సిందేనని వత్తిడి తెచ్చారు. ఈ మేరకు ఆయన దగ్గరి బంధువు అయోధ్య రామిరెడ్డిని కూడా ఆళ్ల అనుచరులు సంప్రదించారు. అయితే టిక్కెట్ తెచ్చుకుంటే తాను ఆర్థికంగా అండగా ఉంటామని అయోధ్య రామిరెడ్డి భరోసా ఇచ్చారు. దీంతో ఆళ్ల అనుచరులు మళ్లీ జగన్ వద్దకు వెళ్లి ఆళ్లకు టిక్కెట్ ఇవ్వాలని కోరారు.

తన పక్కనే ఉంటారన్న…..

ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం జగన్ వద్దకు టిక్కెట్ కోసం వెళ్లలేదు. గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం 12 ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గం ఎక్కువ. ఇక్కడ అన్ని పార్టీలూ బీసీలకే టిక్కెట్లు కేటాయిస్తుంటాయి. దీంతో టీడీపీ నుంచి వచ్చిన ఉడుతా శ్రీనును అభ్యర్థిగా జగన్ ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆళ్లను తాను వదులుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా మంగళగిరి నేతలతో జగన్ అన్నట్లు తెలిసింది. ‘‘ఆయనను నా పక్కన కూర్చోబెట్టుకుంటాను… మీరే చూస్తారుగా’’ అని జగన్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ అధికారంలోకి వస్తే ఆళ్లకు సముచిత మైన స్థానం కల్పిస్తారన్నది అర్థమవుతుంది. మొత్తం మీద ఆళ్ల తాను పోటీ చేయనన్న ప్రస్తావన జగన్ వద్ద తీసుకురాకుంటే ఆయనకే టిక్కెట్ ఇచ్చావారేమో అనిపార్టీ నేతల నుంచి వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ ఇవ్వకుండా జగన్ తీసుకున్న నిర్ణయం నిజంగా సంచలనమే.

Ravi Batchali
About Ravi Batchali 30944 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*