
ఏపీలో ఫ్యాన్ ప్రభంజనంలో మహామహులే కొట్టుకుపోయారు. రాజధాని జిల్లాలో ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తమకు తిరుగు ఉండదని తెలుగుదేశం పార్టీ భావించినా ఈ రెండు జిల్లాల ప్రజలు ఆ పార్టీకి అదిరిపోయే షాక్ ఇచ్చారు. ఫ్యాన్ ప్రభంజనంలో ఈ రెండు జిల్లాల్లో మహామహులే కొట్టుకుపోయారు. కృష్ణా జిల్లాలో మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, జవహర్, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ చిత్తు చిత్తుగా ఓడిపోయారు. గుంటూరు జిల్లాలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబుతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ సైతం ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది. ఈ రెండు జిల్లాల్లో టిడిపి కేవలం నాలుగు సీట్లతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలో ఎన్నికలకు ముందు ఓ నియోజకవర్గ ఇన్చార్జ్కు సీటు ఇచ్చేందుకు వైసిపి అధినేత జగన్ తటపటాయించారు. చివరకు అక్కడ కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు చక్రం తిప్పి ఆ వ్యక్తికి సీటు ఇప్పించారు. తాజా ఎన్నికల్లో ఆ అభ్యర్థి ఘనవిజయం సాధించారు.
అభ్యర్థిని మార్చాలనుకుని….
2014 ఎన్నికల్లో ఆంధ్రా ప్యారీస్ తెనాలి నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన అన్నాబత్తుని శివకుమార్ ఆ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు బలమైన పోటీ ఇచ్చే విషయంలో ఎన్నికలకు ముందు చాలా సందేహాలు ఉన్నాయి. దీంతో జగన్ అక్కడ అభ్యర్థిని మార్చేందుకు ప్రయత్నాలు చేశారు. పీకే చేయించిన సర్వేల్లో శివకుమార్ అక్కడ అంత బలమైన అభ్యర్థి కాదన్న రిపోర్టులు కూడా వచ్చాయి. తనను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకున్న ఆయన మోహన్ బాబుతో తనకు ఉన్న బంధుత్వాన్ని వాడుకుని తిరిగి టిక్కెట్ తనకే దక్కేలా జగన్‌తో చెప్పించుకున్నట్టు ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో ప్రచారం జరిగింది.
మోహన్ బాబు రికమండేషన్ తో….
ఇక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మోహన్ బాబు తనకు ఎన్నికల్లో సీట్లు, ఇతరత్రా విషయాల్లో ఎలాంటి అబ్లిగేషన్లు లేవని ఈ ఒక్క సీటు విషయంలో మాత్రం తన మాట మన్నించాలని జగన్ కు చెప్పారట. దీంతో జగన్ తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్‌కే తిరిగి సీటు కేటాయించారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పై ఓడిన శివకుమార్ ఐదేళ్లపాటు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతుగా కష్టపడ్డారు. ఎన్నికల్లో శివ కుమార్ కు టీడీపీ నుంచి ఆలపాటి రాజాతో పాటు అటు జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ రూపంలో ఇద్దరు బలమైన ప్రత్యర్థులు రంగంలో ఉన్నారు. ఎన్నికలకు ముందు మనోహర్ వైసీపీలో చేరి ఇక్కడ పోటీ చేస్తారన్న టాక్ కూడా వచ్చింది.
నాదెండ్లను ఓడించి….
చివరకు మనోహర్ జనసేనలోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. ఇటు శివకుమార్ సీటు డైలమాలో ఉండగా మోహన్ బాబు ఒత్తిడితో జగన్ శివకుమార్‌కే తిరిగి సీటు ఇవ్వగా ఆయన 17 వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించి… తెనాలి నుంచి అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారు. శివ కుమార్ తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ గతంలో టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు ఎన్టీఆర్ మంత్రి వర్గంలో కూడా పని చేశారు. ఇప్పుడు ఆయన వారసుడుగా శివకుమార్ కూడా తెనాలి నుంచి ఏపీ అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు.
Leave a Reply