
రానున్న ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో జగన్ సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి జగన్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళుర్పించిన అనంతరం ఆయన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. అక్కడి నుంచి ప్రచారం ప్రారంభమవుతుంది. ఇడుపులపాయలో అదే రోజు జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. ఇడుపుల పాయ నుంచి నేరుగా గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం చేరుకుని పిడుగురాళ్లలో జరిగే సభలో పాల్గొంటారు.
పాదయాత్ర వెళ్లని ప్రాంతాల్లో….
వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా దాదాపు 123 నియోజకవర్గాలను టచ్ చేశారు. పాదయాత్ర వెళ్లని నియోజకవర్గాల్లో ఇప్పుడు జగన్ పర్యటించాలని ప్లాన్ చేశారు. ప్రచారానికి కేవలం 20 రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో బస్సులో కొంత ప్రాంతం, హెలికాప్టర్ ద్వారా జిల్లాలకు వెళ్లేలా జగన్ రూట్ మ్యాప్ ను పార్టీ రూపొందిస్తోంది. రోజుకు మూడు నుంచి నాలుగు బహిరంగ సభలు ఉండేలా చూస్తున్నారు. జిల్లాలో కనీసం నాలుగు చోట్ల బహిరంగ సభలు పెట్టాలన్న నిర్ణయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది.
వీక్ గాఉన్న ప్రాంతాల్లోనే…..
ఇక బలహీన నియోజకవర్గాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాలని జగన్ నిర్ణయించారు. టీడీపీ బలంగా ఉన్న, వైసీపీ వీక్ గా ఉన్న నియోజకవర్గాల్లో జగన్ బహిరంగ సభలు ఉండేలా ప్లాన్ చేశారు. గుంటూరు జిల్లాలో ప్రచారం అయిన తర్వాత భోగాపురం, నెలిమర్ల, పి. గన్నవరం, నర్సీపట్నం నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో జగన్ పాల్గొంటారు. మొత్తం 42 నియోజకవర్గాలను ఇప్పటి వరకూ జగన్ ప్రచారంలో ఎంపిక చేసినట్లుతెలుస్తోంది. మొత్తం 75 బహిరంగ సభల్లో జగన్ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నామినేషన్ 22న….
జగన్ పులివెందుల నుంచి పోటీ చేయనున్నారు. ఈ నెల 22వ తేదీన జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. జగన్ నామినేషన్ వేసిన తర్వాత ఆయన పర్యటించని నియోజకవర్గాల్లో షర్మిలపర్యటించనున్నారు. ముఖ్యంగా రాయలసీమలోని కర్నూలు, చిత్తూరు,కడప, అనంతపురం జిల్లాల్లో షర్మిల ప్రచారం నిర్వహిస్తారు. కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో మాత్రమే విజయమ్మ ప్రచారం నిర్వహించనున్నారు. తాడో పేడో తేల్చుకునేందకు సిద్ధమయిన జగన్ తానే పార్టీ కి స్టార్ క్యాంపెయినర్ కావడంతో ఆయన ప్రచారంకోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత జగన్ ప్రచారంతో పార్టీకి ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందన్నది చూడాల్సి ఉంది.
Leave a Reply