కాకారాయుళ్లకు కట్…!!

ysjaganmohanreddy-chiefminister-of-andhrapradesh

అన్నం ఉడికిందా? లేదా ? తెలుసుకోవడానికి మెతుకు పట్టుకుని చూస్తారు. పరిపాలన విధానాన్ని పట్టుకోవడం అంత సులభం కాదు. కానీ ఆనుపానులు దొరికించుకోవడానికి వారం రోజుల వ్యవధి సరిపోతుంది. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత శాఖలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్న జగన్ మోహన్ రెడ్డి తన ప్రాధాన్యాలను స్పష్టంగానే చెబుతున్నారు. అధికారుల వద్ద మంచి మార్కులే పడుతున్నాయి. నివేదికలు, ఒక పని పూర్తయ్యేందుకు పట్టే వ్యవధి విషయంలో కొంచెం కఠినంగానే కనిపిస్తుండటం యంత్రాంగానికి హెచ్చరికలు పంపుతోంది. గత పాలనకు పూర్తిభిన్నమైన శైలి, వైఖరి ముఖ్యమంత్రి తీసుకొంటున్నారంటున్నారు. పొగడ్తలతో , ఆచరణ సాధ్యం కాని టైమింగుతో పొలిటికల్ బాస్ ను మెప్పిస్తూ పబ్బం గడుపుకోవడం చాలా మంది అధికారులకు అలవాటు. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా టు ది పాయింట్ అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తుండటంతో ప్రశంసించేందుకు సైతం వెసులుబాటు దొరకడం లేదని కొందరు కాకారాయుళ్లు వాపోతున్నారు. చంద్రబాబు నాయుడు తాను ఏమనుకుంటున్నది చెప్పేందుకే ఎక్కువ సమయం వెచ్చించేవారు. అధికారులు తమ భావాలు చెప్పడానికి, సాధ్యాసాధ్యాలు వివరించడానికి తగినంత టైమ్ ఇచ్చేవారు కాదు. దీంతో చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రికి క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియకుండా పోతుండేవి.

ఆ ముద్ర పోయేలా…

జగన్ మోహన్ రెడ్డి అంటే వర్గ పోరాటంలో ఆరితేరిపోయిన నాయకునిగా బ్యూరోక్రసీలో ఒక సెక్షన్ భావిస్తూ వచ్చింది. అంతేకాకుండా చెప్పింది వినరనే అపప్రధనూ మోపింది. పెద్దలను గౌరవించరనే మరో అపవాదు. వీటన్నిటికారణంగా ముందస్తుగానే ముఖ్యమంత్రిగా జగన్ పై ఒక ఒపీనియన్ రూపుదిద్దుకుంది. యంత్రాంగం సంపూర్ణంగా సహకరించాలంటే ఆరకమైన భావన నెలకొని ఉండటం మంచిదికాదని సీఎం గ్రహించారనే చెప్పాలి. సమీక్షల్లో సీనియర్ అధికారుల పట్ల చాలా గౌరవంగా ప్రవర్తించడమే కాకుండా, వారి నుంచి సంబంధిత విషయం లోతుపాతులు తెలుసుకోవడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. దీంతో అధికారుల్లో ఆనందం తొంగిచూస్తోంది. ముఖ్యమంత్రి తాము చెప్పింది వింటారనే భరోసా కలుగుతోంది. చివరలో మాత్రం ఆ శాఖకు సంబంధించి తనకున్న ప్రాధాన్యాలు సీఎం స్పష్టంగా చెబుతున్నారు. ఆ బాధ్యత అధికారులదే అన్న విషయమూ సంకేతాత్మకంగా స్పష్టం చేస్తున్నారు. దాంతో అధికారమూ, బాధ్యత ఆయా శాఖాధిపతులపై ఉంచినట్లవుతోంది.

హాయి…హాయిగా…

గతంలో అర్థరాత్రివరకూ సమీక్షలు నడిపే సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం నెలకొల్పింది. దీనివల్ల అధికారుల్లో తమ శాఖలపై శ్రద్ధ కరవైంది. చెప్పింది వింటే చాలు. ఊ కొడితే చాలు. పని జరిగినా లేకపోయినా పెద్దగా పట్టించుకోరనే భావన సర్వత్రా వ్యాపించింది. ఫైళ్ల కదలిక, పనుల్లో చాలా ఉదాసీనత ఏర్పడింది. పైకి మాత్రం యంత్రాంగం పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తుండేది. పని మాత్రం జరిగేది కాదు. నిరంతరం ఉన్నతాధికారులు సమీక్షల్లో ఉన్నారనే సమాధానమే వస్తుండేది. అధికారులు కూడా తమకు తోచిన సమాధానం చెబుతూ ముఖ్యమంత్రిని సంతృప్తి పరచడంపైనే ధ్యాస నిలిపేవారు. ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలు ఏ పని అయినా చిటికెలో పూర్తయిపోతోందన్నట్లుగా ప్రచారం చేస్తుండేవారు. ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉండటమనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది. 2018 నాటికే పోలవరం పూర్తి చేస్తామంటూ యంత్రాంగం ఊదరగొట్టడం అందులో భాగమే. నిజానికి ఇంకా సగం పని మిగిలే ఉంది. తాజాగా సీఎం సమీక్షలో సైతం ఏడాదిలో పూర్తయిపోతుందన్నట్లుగా అధికారులు తేల్చేయాలనుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి రెట్టించి అడగడంతో రెండేళ్లు పడుతుందని చావు కబురు చల్లగా చెప్పారు. ఆ టైమ్ లోపు కచ్చితంగా పూర్తి కావాల్సిందేనని సీఎం పేర్కొనడంతో సీరియస్ నెస్ అధికారులకు సైతం అర్థమైంది. కార్యాలయ పనివేళల్లో మాత్రమే సమీక్షలు చేయడం అనేది అధికారులకు హాయిగా అనిపిస్తోంది.

ఆడి తప్పకుండా…ఆచితూచి..

వాగ్దానం చేయడం చాలా సులభం. నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు చేతికి ఎముక లేదన్నట్లుగా హామీలు గుప్పించేశారు. వాటన్నిటినీ అమలు చేయడం అంత సులభం కాదు. అలాగని పక్కనపెట్టేసి మాట తప్పడం తనకు అలవాటు లేదు. ఈ విషయంలో జగన్ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని సన్నిహితులు పేర్కొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నవరత్నాలు, ఎన్నికల వాగ్దానాలు అమలు చేసి తాను డిఫరెంట్ అని నిరూపించుకోవాలనేది ఆయన తాపత్రయం. గతంలో చంద్రబాబు నాయుడు రైతు రుణ మాఫీ, డ్వాక్రా మహిళల రుణ మాఫీల విషయంలో వైఫల్యం చెందారు. తనపై అటువంటి ముద్ర పడకూడదనేది జగన్ యోచన. అందుకే మేనిఫెస్టో విషయంలో ముందుకే వెళ్లాలని అధికారులకు సూచిస్తున్నారు. నిధుల సర్దుబాటు కష్టసాధ్యమవుతోంది. రైతు భరోసాను అక్టోబర్ నుంచి ప్రారంభించాలనుకోవడం, మూడువేల రూపాయల పింఛన్ స్కీమ్ ను వెంటనే కాకుండా దశలవారీగా పెంచేందుకు నిర్ణయించుకోవడం వంటివి ఆచితూచి తీసుకుంటున్న విధానాలుగా అధికారులు పేర్కొంటున్నారు. అయితే పరిపాలన పరంగా మార్పులు జరిగిన తర్వాత శాఖల పనితీరు బాగా పుంజుకొంటుందంటున్నారు. అధికారులు చెప్పిన విషయాలను సీఎం నోట్ చేసుకుంటూ పనుల పూర్తికి తేదీలను సైతం నమోదు చేసుకోవడం యంత్రాంగంలో కొంచెం గాబరా పుట్టిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 33975 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*