
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇచ్ఛాపురంలో జరగిన సభలో ఆయన ప్రసంగిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో 25 జిల్లాలను ఏర్పాటు చేస్తానన్నారు. తద్వారా ప్రజలకు ప్రభుత్వం దగ్గరవుతుందన్నారు. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి స్థానికంగా యువతకు ఉపాధిఅవకాశాలు కల్పిస్తామని చెప్పారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో గ్రామ స్వరాజ్యం వస్తుందన్నారు. ప్రతి పథకం పేద వాడి ఇంటివద్దకే వచ్చేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు. పథకాల అమలులో కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా కేవలం అర్హత మాత్రమే చూస్తానని హామీ ఇస్తున్నానని చెప్పారు.
గ్రామ సచివాలయాల ద్వారా…..
ప్రతి గ్రామంలో యాభై ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ గా తీసుకని ఒకరికి ఉద్యోగమిచ్చి, వారికి ఐదు వేలు జీతమిస్తామన్నారు. ఆ యాభై ఇళ్లకు పథకాలు అందించే బాధ్యత అతనిదేనన్నారు. గ్రామ సచివాలయంతో సంప్రదిస్తూ పథకాలను సక్రమంగా అమలు చేసే బాధ్యతను అతనిపైనే ఉంచుతామన్నారు. రేషన్ బియ్యం కూడా నేరుగా ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. నవరత్నాల్లో ప్రతి అంశమూ ఎవరి చుట్టూ తిరిగే పనిలేకుండా, సిఫార్సు లేకుండా, లంచం ఇవ్వకుండా నేరుగా ఇంటికి వచ్చేలా చూస్తామని జగన్ హామీ ఇచ్చారు.
రైతులకు భరోసా…..
నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడాలన్నదే తన అభిమతమన్నారు. ప్రజల సూచనలు సలహాలు తీసుకుంటూ కొన్ని మార్పులు చేసుకుంటున్నానన్నారు. ప్రతి రైతుకు పంట పెట్టుబడి తగ్గించేందుకు 9గంటల ఉచిత విద్యుత్తు పగటి పూట ఇస్తామనిహామీ ఇచ్చారు. ప్రతి రైతుకు బ్యాంకురుణాలపై వడ్డీ లేని రుణాలిప్పిస్తామన్నారు. రైతు పెట్టుబడి ఖర్చు కోసం మే నెలలోనే సంవత్సరానికి 12,500లు పెట్టుబడి పథకం కింద ఇస్తామన్నారు. రైతులు అప్పులు పాలు కావడానికి ప్రధానకారణ బోర్లు వేయడమేనని, రైతులందరికీ బోర్లు ఉచితంగా వేయిస్తామన్నారు. రైతుకు బీమా పథకం సక్రమంగా అమలుకావడం లేదని, బీమా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించే ఏర్పాట్లు చేస్తామన్నారు. రైతులు బీమా మొత్తాన్నిచెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రైతుల కోసం మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. పంట వేసే ముందే ధరను ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పారు. ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.రైతన్నకు అండగా ఉండటానికి పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు. వ్యవసాయరంగంలో వాడే ట్రాక్టర్ కు ట్యాక్స్ రద్దు చే్స్తామన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మరణిస్తే ప్రతి రైతన్నకుటుంబానికి వైఎస్సార్ బీమా కింద ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు. అసెంబ్లీలో తొలి సమావేశంలోనే చట్టాన్నిరూపొందిస్తామన్నారు. ప్రతి ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. ప్రతి ప్రాజెక్టులో చంద్రబాబు కమిషన్లు దండుకోవడానికి పనులు చేపట్టారన్నారు.
పోరాటం కొనసాగుతుంది……
ప్రజాసంకల్ప యాత్ర ముగిసినా ఈ పోరాటం ఇంకా కొనసాగుతుందన్నారు. వచ్చే నాలుగు నెలల్లో జరిగే యుద్ధం కేవలం నారాసురుడు ఒక్కడితోనే కాదని, ఎల్లోమీడియాతో పోరాటం చేయాలన్నారు. జిత్తులమారి చంద్రబాబు అనేక పొత్తులు పెట్టుకుంటారని, అన్యాయాలను, మోసాలను జయిస్తానని, అందుకు మీ సహకారం కావాలని, తనను ఆశీర్వదించాలని జగన్ కోరారు. ఒక్కసారి అధికారంలోకి వస్తే ముప్ఫయి ఏళ్ల పాటు పాలన చేసి ప్రజల గుండెల్లో నిలుస్తానని వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు.
ఎల్లోమీడియాను…..
చంద్రబాబునాయుడు ఈ మధ్యకాలంలో రాష్ట్ర సమస్యలను మాట్లాడటం లేదన్నారు. మోదీతో యుద్ధమంటూ ఆయన తన బాజా పత్రికల్లో రాయించుకుంటున్నారన్నారు. ఎల్లోమీడియాను, రెండు పేపర్లను, టీవీ ఛానళ్లను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగకపోయినా జరిగిందన్నట్లు చిత్రీకరిస్తున్నారన్నారు. విశ్వసనీయత చంద్రబాబుకు లేదన్నారు. హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేసే ఇంటికి పోయే పరిస్థితి రాజకీయాల్లో రావాలన్నారు. ఈవ్యవస్థను మార్చాలంటే తన ఒక్కడి వల్ల కాదని, మీ అందరి తోడు, దీవెనలు కావాలన్నారు. అందరి ఆశీర్వాదాలతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలో పూర్తి ప్రక్షాళన తీసుకువస్తామన్నారు. మార్పు తెస్తామన్నారు.
Leave a Reply