ఈ ముగ్గురి గెలుపోటములపైనే జగన్ ఆరా…!!

ysjaganmohanreddy-tension-on-three-seats

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ మూడు స్థానాలను ప్రెస్టీజియస్ గా తీసుకుంది. రాష్ట్రమంతటా వైసీపీకి బలంగా అనుకూల పవనాలు వీస్తున్నాయన్న వార్తలు వస్తుండటంతో వైసీపీ అధినేత జగన్ ఈ మూడు స్థానాలపైనే ఎక్కువగా సీనియర్ నేతలతో చర్చించారట. మూడు చోట్ల సిట్టింగ్ లకే జగన్ తిరిగి టిక్కెట్లు ఇచ్చారు. అంతేకాదు ఈ మూడు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రత్యేకంగా పిలిపించుకుని గెలుపోటములపై విశ్లేషణ చేశారన్న టాక్ ఆ పార్టీలో నడుస్తోంది. జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేముందు ఈ మూడు నియోజకవర్గాల అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశమై గెలుపు అవకాశాల గురించి లోతైన చర్చలు జరిపారని తెలుస్తోంది.

ఖచ్చితంగా గెలుస్తానని….

గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంపై వైసీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇక్కడ వైసీపీ గెలిస్తే తెలుగుదేశం భవిష్యత్ నేతను తొలి దశలోనే నిలువరించినట్లవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తన గెలుపు ఖచ్చితమని అధినేత ముందు విశ్వాసం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. గత ఐదేళ్లుగా తాను పడిన కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుందని ఆయన చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారాలోకేష్ ఎంత ఖర్చు చేసినా ఆయనను పరాయి వాడిగానే చూశారన్నది ఆర్కే మార్క్ విశ్లేషణ. మంగళగిరి విలక్షణమైన నియోజకవర్గమని డబ్బులు తీసుకున్నా ఓటు విషయంలో విజ్ఞత పాటిస్తారని ఆళ్లవర్గీయులు చెబుతున్నారు.

అనిల్ కుమార్ యాదవ్ విషయంలో….

ఇక మరో నియోజకవర్గం నెల్లూరు టౌన్ నియోజకవర్గం. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తిరిగి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా మంత్రి నారాయణ బరిలోకి దిగారు. మంత్రి నారాయణ విచ్చలవిడిగా ఖర్చు చేశారంటూ అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కానీ జగన్ పై ఉన్న క్రేజ్, తనపై ప్రజలకు ఉన్న నమ్మకమే తనను తిరిగి గెలిపిస్తుందని అనిల్ కుమార్ యాదవ్ చెబుతున్నారు. మంత్రి నారాయణ కోట్లు ఖర్చు చేసినా టీడీపీ నేతల నుంచే ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయని వైసీపీ భావిస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ గెలుపు పై ధీమాను జగన్ ముందు వ్యక్తం చేశారు.

రోజాకు తిరుగులేదా..?

ఇక మూడో నియోజకవర్గం నగరి. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి బరిలోకి దిగారు. ప్రత్యర్థిగా, టీడీపీ అభ్యర్థిగా గాలి భానుప్రకాష్ ను బరిలోకి ఆ పార్టీ నాయకత్వం దించింది. అయితే సొంత కుటుంబ సభ్యులే గాలి భానుప్రకాష్ కు వ్యతిరేకంగా పనిచేశారన్న వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నగరిలో అధికంగా ఉన్న తమిళ ఓటర్లు రోజావైపు నిలిచారంటున్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం తర్వాత జరిగిన ఎన్నికలవ్వడంతో సానుభూతి పనిచేస్తుందనుకున్నామని, కానీ కుటుంబంలో తలెత్తిన విభేదాల వల్ల అది ఎంతమాత్రం పనిచేయలేదని రోజా చెబుతున్నారు. మొత్తం మీద ఈ మూడు సిట్టింగ్ స్థానాలపైనే జగన్ ఎక్కువగా ఆరా తీశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Ravi Batchali
About Ravi Batchali 36875 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*