ఇంకా అన్వేషణలోనే వైసీపీ….!

రాజధాని అమరావతికి కేంద్ర బిందువు గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, క్రోసురు మండలాలు ఉన్నాయి. ఆంధ్రుల కల‌ల రాజధాని అమరావతి మండల కేంద్రం ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి పేరుతో ఉన్న మండ‌ల కేంద్ర‌మైన … పంచారామాక్షేత్రాల్లో ఒకటైన అమరలింగేశ్వరుడు కొలువై ఉన్న అమరావతి కృష్ణానది ఒడ్డునే ఉంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇదే నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు వరుస విజయాలు సాధించారు. ఇక ప్రస్తుతం టీడీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఆయన ఇక్కడ నుంచి వరుస విజయాలు సాధిస్తున్నారు. నియోజకవర్గంలో సామాజిక సమీకరణల పరంగా చూస్తే నియోజకవర్గాల పున‌ర్విభజన తర్వాత కమ్మ సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉంది.

రెండు ఎన్నికల్లో సులువుగానే…..

పార్టీ ఏదైనా కీలక మండలాలు… మెజారిటీ గ్రామాల్లో ఆ వర్గానిదే ఆధిపత్యం. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొమ్మాలపాటి సైతం ఆ వర్గానికి చెందిన వ్యక్తే. 2009లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన నూర్జహాన్‌పై సులువుగానే విజయం సాధించిన ఆయన గత ఎన్నికల్లో వైసీపీ నంచి పోటీ చేసిన స్థానికేత‌రుడు, వినుకొండ నియోజకవర్గానికి చెందిన బొల్లా బ్రహ్మనాయుడుపై మరో సారి పెద్ద పోటీ లేకుండా సులువుగానే గెలిచారు. ఇక నియోజకవర్గంలో నాలుగున్నర ఏళ్లలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పనితీరు పరిశీలిస్తే రహదారులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలులో ఆయన మంచి మార్కులే వేయించుకున్నారు. వరుసగా రెండు సార్లు గెలవడంతో తొలి ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా తర్వాత నాలుగున్నర ఏళ్లు అధికారంలో ఉండడంతో ప్రజలకు కావాల్సిన మౌలిక సౌకర్యాల కల్పన, నియోజకవర్గ అభివృద్ధి, రహదారులు, పెన్షన్లు, ఇళ్ల మంజూరులో ఆయన మంచి మార్కులే వేయించుకున్నారు.

పట్టించుకోవడం లేదని క్యాడర్……

నియోజకవర్గంలో ఆయన యువరక్తాన్ని ప్రోత్సహించి కొత్త కేడర్‌ను ఎంక్రేజ్‌ చెయ్యడంతో సహజంగానే పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారు, పాతవారు శ్రీధర్‌ తీరుపై గుర్రుతో ఉన్నారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో ఉన్న తమను పట్టించుకోవడం లేదని వారంతా ఎమ్మెల్యే తీరుపై రగులుతున్నారు. పాత కేడర్‌లో శ్రీధర్‌పై నివురు గప్పిన నిప్పులా అసంతృప్తి వ్యక్తం అవుతుంది. శ్రీధర్‌ను వ్యతిరేఖిస్తున్న వర్గం వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్‌ రాదని ప్రచారం చేస్తుండగా… ఇదే ఛాన్స్‌ అనుకుంటున్న కొందరు ఆశావాహులు తమకే సీట‌ని క‌ల‌లు కంటున్నారు. కాని వాస్తవంగా చూస్తే పెదకూరపాడు నియోజకవర్గంలో రెండున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం జెండా ఎగరని పక్షంలో వరుసగా రెండు సార్లు గెలుస్తున్న శ్రీధర్‌పైనే చంద్రబాబు నమ్మకం ఉంచారు. ఇటీవల గుంటూరు జిల్లాల్లో టిక్కెట్లు డిసైడ్‌ చేసిన ఐదారు నియోజకవర్గాల్లో పెదకూరపాడు కూడా ఉంది. అక్కడ నుంచి శ్రీధర్‌ మూడో సారి పోటీకి రెడీ అవుతున్నారు.

కొత్త పేర్ల పరిశీలనలో వైసీపీ….

విపక్ష వైసీపీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొల్లా బ్రహ్మనాయుడు ప్రస్తుతం వినుకొండ నియోజకవర్గానికి వెళ్లిపోయారు. ఆ తర్వాత గుంటూరు నగరానికి చెందిన మాజీ కార్పోరేటర్‌ కావటి మనోహర్‌ నాయుడును ఇన్‌చార్జ్‌గా నియమించినా ఆయనకు శ్రీధర్‌ను ఢీ కొట్టే సత్తా లేదని డిసైడ్‌ అయిన పార్టీ అధిష్టానం పలువురు కొత్త పేర్లను తెర మీదకు తీసుకువస్తుంది. తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన నంబూరి శంకర్‌రావుకు మనోహర్‌ నాయుడు స్థానంలో పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. వైసీపీ ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు ఇన్‌చార్జులను మార్చడం వీరు శ్రీధర్‌ను ఢీకొట్టే స్థాయిలో పార్టీని బలపరచలేదు. సంస్థాగతంగా బలమున్నా వైసీపీ నియోజకవర్గంలో మంచి అభ్యర్థిని ప్రకటిస్తే గెలుపు సులువేనంటున్నారు. ప్రస్తుతం పెదకూరపాడులో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంచి జోరు మీద ఉండడంతో పాటు మూడో సారి పోటీకి రెడీ అవుతుంటే… అటు వైసీపీ అభ్యర్థి అన్వేషణలో తలమొన‌కలౌతుంది. ఇక కొత్తగా పోటీకి రెడీ అవుతున్న జనసేన ప్రభావం పెదకూరపాడు నియోజకవర్గంలో శూన్యం.

Ravi Batchali
About Ravi Batchali 37845 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*