
రాజకీయాల్లో లోకల్ నేతలకు ఉండే హవా అంతా ఇంతా కాదు. స్థానికంగా ఎదిగే నేతలకు ప్రజలకు మధ్య అవినాభ సం బంధం ఉంటుంది. స్థానిక సమస్యలు లోకల్ నేతలకైతే.. బాగా తెలుస్తాయని, వారికి అవగాహన కూడా ఉంటుందని ప్రజలు భావిస్తారు. స్థానిక ప్రజలు ఆయా నేతలతో అటాచ్ మెంట్‌ను పెంచుకుంటారు. వారి సమస్యలు చెప్పుకొనేందు కు క్యూకడతారు. ఎంతో పాదర్శకంగా వ్యవహరిస్తారని భావిస్తారు. అంతేకాదు, లోకల్ నేతలైతేనే తాము నేరుగా వెళ్లి కలిసేందుకు అవకాశం ఉంటుందని కూడా భావిస్తారు. అందుకే లోకల్ నేతలకు ప్రజలు జై కొడతారు. అయితే, గుంటూరు జిల్లా తెనాలిలో మాత్రం గత రెండు దశాబ్దాలుగా ప్రజలకు లోకల్ నేతలు లభించడం లేదు. ఇక్కడ ఎవరు ఏ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నా.. వారు నాన్‌లోకల్ కావడం గమనార్హం.
నాలుగు ఎన్నికల నుంచి…..
దీంతో ఇక్కడి ప్రజలు తమ సమస్యలు పట్టించుకునే నాధుడు లేకపోవడంపై తీవ్ర ఆవేదన, ఆందోళన సైతం వ్యక్తం చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే.. గడిచిన నాలుగు ఎన్నికల నుంచి ఇక్కడ గెలుస్తున్న నాయకులు ఇక్కడి పరిస్థితులు, ప్రజలతో సంబంధాలు లేనివారే. 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభావం భారీ ఎత్తున కనిపించింది. దీంతో ఇక్కడ నుంచి బరిలోకి దిగిన సీనియర్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నాదెండ్ల భాస్కరరావు తనయుడు నాదెండ్ల మనోహర్ గెలుపు గుర్రం ఎక్కారు. వాస్తవానికి ఆయనకు ఈ నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం లేదు. ఆయన వేమూరు నియోజకవర్గానికి చెందిన నేత. అయినా.. కూడా ఇక్కడ కాంగ్రెస్ జెండా పై గెలుపొందారు. ఇక, ఆయన స్పీకర్‌గాకూడా చేయడంతో కేవలం ఆయన హైదరాబాద్‌కే పరిమితమయ్యారు.
నాదెండ్ల గెలిచినా….
మనోహర్ ఇక్కడ వరుసగా రెండుసార్లు గెలిచినా ఆయన ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉండేవారు. ఆయన ఎప్పుడు వచ్చేవారో ? ఎప్పుడు వెళ్లేవారో కూడా తెలిసేది కాదు. మొత్తంగా ఆయనకు వ్యక్తిగత ఇమేజ్ ఎలా ఉన్నా కామన్ మ్యాన్‌కు మాత్రం అందుబాటులో ఉండేవారు కాదు. ఆయన వద్దకు వెళ్లి తమ సమస్యలు చెప్పుకొనేందుకు ప్రజలు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఒకవేళ వెళ్లినా ప్రొటోకాల్ నిబంధనలు వారిని తీవ్రంగా వేధించాయి. ఇక, ఆయన ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేసినా.. కేవలం పేరుకే అన్నట్టుగా తయారైంది. ఫలితంగా ఈ నియోజకవర్గంలో సమస్యలు ఎక్కడివి అక్కడే మధ్యలోనే నిలిచిపోయాయి. పేదలకు ఎలాంటి భరోసా కనిపించలేదు.
రాజా ది గ్రేట్ అంటూ…..
ఇక, 2014లో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉరఫ్ రాజా.. ఇక్కడ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన కూడా వేమూరు నియోజకవర్గానికి చెందిన నాయకుడే కావడం గమనార్హం. ఈయనకు కూడా ఇక్కడ సమస్యలపై పట్టులేదు. అందుకే ఇప్పటికీ ఇక్కడ సమస్యల పరిష్కారంలో ఆయన దూకుడు ప్రదర్శించలేక పోతున్నారు. ఇంకా చెప్పాలంటే గతంలో వేమూరు నుంచి గెలిచి మంత్రి అయిన రాజా ఇప్పుడు తెనాలి ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన ఉండేది మాత్రం గుంటూరులోనే.
గుంటూరులోనే మకాం…..
పార్టీ పరంగా చూసుకున్నా.. స్థానిక నేతలతో ఆలపాటి కలిసి మెలిసి అడుగులు వేయలేక పోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. తెనాలి ప్రజలు ఎవరు ఎవరిని గెలిపించినా.. వారి పార్టీ అధికారంలోకి వస్తోంది. అయినా కూడా వారికి మాత్రం సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇక, ఇప్పుడు స్థానిక నాయకుడు అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ నుంచి మరోసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈయన స్థానికుడు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న నేత. అంతేకాదు.. ఆయన నాన్‌లోకల్ ఉద్యమాన్ని కూడా చాపకింద నీరులా .. ఉధృతం చేస్తున్నారు. శివకుమార్ మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ కుమారుడు కావడం ఆయనకు కలిసి వస్తున్న ప్రధాన విషయం. దీంతో ఆయన లోకల్ నినాదంతో ముందుకెళుతున్నారు.మరి ప్రజలు ఆదరిస్తారో? లేదో? చూడాలి.
Leave a Reply