జంప్ చేసినా టిక్కెట్ గ్యారంటీయా?

పార్టీ మారిన వారికి టిక్కెట్ గ్యారంటీయా? తనను నమ్మి వచ్చిన పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలకు ఈసారి కూడా చంద్రబాబు టిక్కెట్ కన్ ఫర్మ్ చేయనున్నారా? మంత్రి నారా లోకేష్ కామెంట్స్ తో తెలుగుదేశం పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లాలో పార్లమెంటు సభ్యురాలిగా బుట్టా రేణుక, కర్నూలు సిటీ ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డి టిక్కెట్లను చినబాబు కన్ ఫర్మ్ చేయడంతో పార్టీ మారిన నేతలందరికీ దాదాపు టిక్కెట్లు వచ్చే ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఖరారు చేస్తుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

వీరిలో ఎక్కువ మంది….

గత ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా పార్టీలో చేరుతున్నప్పుడు తాము చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి, ఆయన వల్లనే ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తుందని భావిస్తున్నామని చెప్పారు. అయితే వరుసగా చంద్రబాబు చేయిస్తున్న సర్వేల్లో ఈ 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురైదుగురు మినహాయించి మిగిలిన వారందరూ నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్నట్లు తేలింది. ఈ ఎమ్మెల్యేలకు చంద్రబాబు పిలిచి మరీ క్లాస్ పీకారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు ప్రజలతో కూడా మమేకం కావాలని సూచించారు.

లోకేష్ చెప్పారంటే…..

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వకుంటే భవిష్యత్తులో తమను నమ్మి ఎవరూ పార్టీలోకి రారని కూడా టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లుంది. లోకేష్ నోటి నుంచి వచ్చిందంటే సహజంగా అది చంద్రబాబు చెప్పినట్లే. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ లోకేష్ కు తెలియకుండా ఇప్పుడు ఏమీ జరగని పరిస్థితి. భవిష్యత్ లో ఆయనే పార్టీ అధినేత కానుండటంతో పార్టీలో చీమ చిటుక్కుమన్నా లోకేష్ కు తెలియాల్సిందే. ఇటీవల చంద్రబాబు కంటే ముందే లోకేష్ ముందస్తు ఎన్నికలకు వెళ్లమని చెప్పడం విశేషం. సహజంగా ఇలాంటి నిర్ణయాలను పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటిస్తుంటారు. కాని ఇందుకు విరుద్ధంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని, తాము షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతామని చెప్పడం విశేషం.

సంబరంలో జంప్ జిలానీలు….

లోకేష్ తాజా ప్రకటనతో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలు హ్యాపీగా ఉన్నారు. చంద్రబాబు మనసులో ఉన్న నిర్ణయాన్నే లోకేష్ బయటకు చెప్పేశారని వారు అభిప్రాయపడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి మారిన ఎమ్మెల్యేలు టెన్షన్ గా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు తమకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కదేమోనన్న టెన్షన్ లో ఉన్నారు. వారు తిరిగి వైసీపీ గూటికి చేరేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ ప్రకటన వారికి ఊరట కల్గించాయి. జంప్ జిలానీలు వచ్చే ఎన్నికలలో తిరిగి గెలుస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే టిక్కెట్ వచ్చే అవకాశముందన్న వార్తలు మాత్రం వారికి సంతోషం కల్గిస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం సర్వే ఫలితాలను బట్టి మాత్రమే టిక్కెట్లను కేటాయిస్తారని సీనియర్ నేతలు చెబుతుండటం విశేషం.

Ravi Batchali
About Ravi Batchali 35931 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*