
టీడీపీ కీలక నేత, ఎస్సీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ ఎస్సీ వర్గానికి చెందిన జూపూడి ప్రభాకర్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖరారయినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబుకు అత్యంత విధేయుడిగా వ్యవహరిస్తున్న ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు మరింత మంచి పదవి ఇవ్వాలని భావించిన సీఎం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు అమరావతి వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి గత 2014 ఎన్నికల సమయంలో వైసీపీలో ఉన్న జూపూడి ఆ ఎన్నికల్లోనే జగన్ నుంచి టికెట్ పొందారు. ప్రకాశం జిల్లా కొండపి నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున బాల వీరాంజనేయస్వామి పోటీ చేశారు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో జరిగిన పోరులో స్వల్ప తేడాతో జూపూడి విజయావకాశం కోల్పోయారు.
బలమైన గళం….
ఆ ఎన్నికల్లో 91 వేల పైచిలుకు ఓట్లు స్వామి పొందితే.. జూపూడి 86 వేల పైచిలుకు ఓట్లు పొందారు. ఎస్సీల్లో మంచి గుర్తింపు పొందిన ఈయన విద్యా వంతుడు కావడం మరింత కలిసివచ్చింది. అయితే, కొండపిలో తాను గెలిచే అవకాశం ఉన్నప్పటికీ.. వైసీపీలోని స్థానిక నేతలు కక్షగట్టి తనకు వ్యతిరేకంగా గ్రౌండ్ లెవెల్లో చక్రం తిప్పడం వల్లే తాను ఓటమి పాలయ్యానని గుర్తించిన జూపూడి.. అనంతర కాలంలో రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జూపూడి పార్టీ మారినప్పుడు కొండపిలో తన ఓటమికి ఎంపీ వైవి.సుబ్బారెడ్డితో పాటు మాజీ మంత్రి బాలినేని కారణమని విరుచుకుపడ్డారు. టీడీపీలో చేరాక పార్టీ తరఫున, అధినేత చంద్రబాబు తరఫున బలమైన గళం వినిపిస్తున్న నాయకుల్లో ప్రధమ స్థానంలో నిలిచారు. ఈయన కృషిని గమనించిన చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించారు. అయితే, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలని భావిస్తున్నట్టు తన మనసులో కోరికను బాబు వద్ద వ్యక్తం చేయడంతో దానికి అనుగుణంగా చంద్రబాబు ఈయనకు టికెట్ కేటాయించాలని నిర్ణయించుకున్నారు.
ఎర్రగొండపాలెంలో…..
ప్రస్తుతం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన పాలపర్తి డేవిడ్‌రాజు.. అనంతర పరిణామాల నేపథ్యంలో టీడీపీలోకి చేరిపోయారు. ఈయన రాకతో ఇక్కడ టీడీపీ బటపడుతుందని బాబు భావించారు. అయితే, పాలపర్తి స్థానిక నేతలతో కలుపుగోలు తనం ప్రదర్శించకపోగా.. ఆధిపత్య రాజకీయాలకు తెరదీశారు. గడిచిన నాలుగేళ్లలో ఆయన ఇక్కడ చేసిన అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఆయనకు గెలుపు అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయని పలు సర్వేల్లో స్పష్టమైంది.
డేవిడ్ రాజు సంతనూతలపాడుపై…..
దీంతో ఆయన గతంలో తాను పోటీ చేసిన సంతనూతలపాడుపై దృష్టి పెట్టారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం సంతనూతలపాడులో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలపు సురేష్ గతంలో ఎర్రగొండపాలెం నుంచి గెలిచారు. ఇప్పుడు ఆయన వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లిపోతున్నారు. ఇక ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యేగా ఉన్న డేవిడ్‌రాజు గతంలో సంతనూతలపాడులో గెలవడంతో ఇప్పుడు ఆయన వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఇటు వస్తున్నారు.
ఈక్వేషన్ల ప్రకారమే…..
ఇక డేవిడ్‌రాజు సంతనూతలపాడులో పోటీ చేయడం దాదాపు ఖరారు కావడంతో దీంతో ఇక్కడ అభ్యర్థి అవసరమైంది. ఇక, ఎర్రగొండ పాలెం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అజితారావుకు మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నా.. గెలుపు అంతంత మాత్రమేనని ఓ నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు.. ఇక్కడి నుంచి జూపూడిని బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇప్పుడు జూపూడి ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మార్పుల్లో ప్రస్తుత సంతనూతలపాడు టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బీఎన్.విజయ్‌కుమార్‌కు టిక్కెట్ వచ్చే పరిస్థితి లేదు. నియోజకవర్గంలో కూడా ఆయనపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరి ఎన్నికల వేళ ఈ ఈక్వేషన్లు ఎలా మారతాయో ? చూడాలి.
Leave a Reply