
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత ఎన్నికల్లో పెద్దగా పోటీ లేకపో యినా.. వచ్చే ఎన్నికల నాటికి మాత్రం ఇక్కడ వివిధ పార్టీల నాయకుల మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ నాయకులు నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఈయనపై వైసీపీ తరఫున పోటీ చేసిన మేకా శేషుబాబు గట్టిపోటీ ఇచ్చారు. దాదాపు 45,591 ఓట్లు సాధించారు. అయితే, రామానాయుడు మాత్రం 6వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. కట్ చేస్తే.. మరో ఆరేడు మాసాల్లోనే ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఇక్కడ పాగా వేసేందుకు వైసీపీ తనకున్న దారులన్నింటినీ వినియోగించుకునేందుకు రెడీ అయింది.
మాజీని ఆహ్వానించి……
ఇప్పటికే ఇక్కడ వైసీపీ నియోజకవర్గం ఇంచార్జుగా గుణ్ణం నాగబాబు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఆయన వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే, గత ఎన్నికల్లో తాను ఖర్చు పెట్టుకుని ఆర్థికంగా దెబ్బతిన్నానని, అయినా కూడా పార్టీలోనే ఉన్నానని, ఈ సారి కూడా తనకే టికెట్ కేటాయించాలని మేకా శేషుబాబు ఇప్పటికే వైసీపీ అధిష్టానం వద్ద ప్రతిపాదన పెట్టారు. అయితే, గత ఎన్నికల నాటికి ఇప్పటికీ పరిస్థితిని వైసీపీకి అనుకూలంగా మలచడంలో ఇక్కడి నాయకత్వం విఫలమైందని జగన్ గుర్తించినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాబ్జీని వైసీపీలోకి ఆహ్వానించి ఆయనకు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం.
వార్ స్టార్ట్ అయింది……
ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఈ టికెట్ కోసం ఇప్పటికే వార్ ప్రారంభించడం గమనార్హం. ఇక, తాజాగా మరో సంచలన నాయకుడు తెరమీదికి వచ్చాడు. వచ్చే ఎన్నికల్లో ప్రతాపం చూపనున్న జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన తరఫున ఇక్కడ పోటీ చేసేందుకు మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నేత హరిరామజోగయ్య తనయుడు సూర్యప్రకాష్ జనసేన చేరారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్.. సూర్యప్రకాష్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాలకొల్లులోని హరిరామజోగయ్య నివాసానికి పవన్ వెళ్లిన సందర్భంగా దాదాపు గంట పాటు సమకాలీన రాజకీయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా పవన్ చేస్తున్న పోరాటాలను హరిరామజోగయ్య ప్రశంసించారు.
హోరాహోరీ పోరే……
అనంతరం జోగయ్య రాసిన 60 వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తకాన్ని పవన్‌కు బహుకరించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్‌కు టికెట్ ఇచ్చే అవకాశం పైనా చర్చించుకున్నట్టు సమాచారం. ఇక్కడ జోగయ్య ఫ్యామిలీకి మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పాలకొల్లులో హోరాహోరీ పోరు ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో పంచారామ పాలిటిక్స్ అదరనున్నాయని అంటున్నారు పరిశీలకులు.
Leave a Reply