అది వైసీపీ పక్కా సీటట….!

ఏపీకి గుండెకాయ లాంటి కృష్ణా జిల్లాలో ప‌శ్చిమ కృష్ణాలో ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాలకు సరిహద్దుల్లో విస్తరించి ఉన్న నియోజకవర్గం నూజివీడు. శతాబ్దాలుగా నూజివీడు ప్రాంతాన్ని నూజివీడు జమిందారులు పాలించారు. ఇలాంటి చరిత్ర ఉన్న నూజివీడులో నియోజకవర్గంలో ప్రస్తుతం నూజివీడు మున్సిపాలిటితో పాటు నూజివీడు, చాట్రాయి, ముసునూరు, ఆగిరిపల్లి మండలాలు ఉన్నాయి. సామాజికవర్గాల పరంగా చూస్తే నూజివీడు నియోజకవర్గంలో దశాబ్దాలుగా నూజివీడు జమిందార్‌ వంశస్తులు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ నుంచి ఐదు సార్లు గెలిచిన ఎమ్‌ఆర్‌. అప్పారావు, ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావులు అసెంబ్లీకి ఎన్నిక అవుతూ వస్తున్నారు.

గత రెండు ఎన్నికల్లోనూ…..

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1983 నుంచి 2004 వరకు నూజివీడులో గెలిచిన పార్టీయే స్టేట్‌లో అధికారంలో ఉంటుంది. అయితే 2009, 2014 ఎన్నికల్లో మాత్రం నూజివీడు ఓటర్లు స్టేట్‌ తీర్పునకు భిన్నంగా పట్టం కట్టారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసిన చిన్నం రామకోటయ్య ఇక్కడ గెలిస్తే స్టేట్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన మేకా ప్రతాప్‌ అప్పారావు గెలిస్తే స్టేట్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇలా గత రెండు ఎన్నికల్లోనూ నూజివీడు ఓటర్‌ భిన్నమైన తీర్పు ఇస్తున్నారు. సామాజికవర్గాల పరంగా చూస్తే నూజివీడు పట్టణంలో కాపుల ప్రాబ‌ల్యం ఎక్కువ. ముసునూడు, నూజివీడు రూరల్‌, ఆగిరిపల్లి మండలాల్లో కమ్మ సామాజికవర్గం ప్రభావం చూపుతుంది. నియోజకవర్గాల పున‌ర్విభజనలో క‌లిసిన చాట్రాయి మండలంలో కమ్మ సామాజిక వర్గంతో పాటు రెడ్లు కూడా ప్రభావం చూపుతారు. ఇక బీసీల్లో యాదవ సామాజికవర్గం ఇక్కడ భారీగా ఉంది.

బీసీ మంత్రంతో…..

ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ బీసీ మంత్రం పఠించి గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావును చివరి క్షణంలో పోటీకి దింపింది. జమిందార్‌ వంశానికి చెందిన వెలమ వంశస్తులు ఓటర్ల పరంగా మైనార్టీలుగా ఉన్న దశాబ్దాలుగా నూజివీడు జమిందారులుగా ఉండడంతో వారికున్న పట్టు నేపథ్యంలో వారు వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. ఇక్కడ ఐదు సార్లు గెలిచిన ఎంఆర్‌. అప్పారావు, నాలుగు సార్లు టీడీపీ నుంచి గెలిచిన కోటగిరి హనుమంతరావు రెండు సార్లు గెలిచిన మేకా ప్రతాప్‌ అప్పారావు వెలమ వంశస్తులే.ప్రస్తుతం వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మేకా ప్రతాప్‌ అప్పారావు గత నాలుగు ఎన్నికల్లోను పోటీ చేస్తూ వస్తున్నారు. 1999లో టీడీపీ టిక్కెట్‌ దక్కక‌ టీడీపీ రెబల్‌గా పోటీ చేసి 40 వేల ఓట్లు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. 2004లో కాంగ్రెస్‌ నుంచి నూజివీడు నియోజకవర్గ చరిత్రలోనే అత్యధికంగా 24వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన ప్రతాప్‌ 2009లో మాత్రం టీడీపీ అభ్యర్థి చిన్నం రామకోటయ్య చేతిలో ఓడిపోయారు.

రెండోసారి ఎన్నికై…..

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ముద్రబోయినపై విజయం సాధించి రెండోసారి అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు. నియోజకవర్గంలో నాలుగున్నర ఏళ్లల్లో జరిగిన అభివృద్ధి చూస్తే ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉండడంతో నియోజకవర్గంలో అభివృద్ధికి స్కోప్‌ లేకపోయింది. అయితే ప్రతాప్‌ వ్యక్తిగతంగా 2004, 2009 మధ్య తొలి సారి అసెంబ్లీకి ప్రాధినిత్యం వహించినప్పుడు నూజివీడు నియోజకవర్గ చరిత్రలోనే తిరుగులేని అభివృద్ధి చేశారు. నూజివీడుకు ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్‌ ఐటీ, 5 వేల ఇళ్ల తో ఎమ్‌ఆర్‌. అప్పారావ‌వు కాల‌నీ, నూజివీడు పెద్ద చెరువుకు సాగర జలాల తర‌లింపు ఇలా నియోజకవర్గ చరిత్రలోనే ఏ ఎమ్మెల్యే చెయ్యనంత అభివృద్ధి తొలి ఐదేళ్లల్లో చెయ్యడం ప్రతాప్‌కు ఇప్ప‌ట‌కీ కలిసిరానుంది. అయితే ప్రస్తుతం విపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ప్రతాప్‌ చెప్పిన పనులు నాలుగున్నర ఏళ్లలో ఏ మాత్రం జరగలేదు.

గ్రూపు విభేదాలతో……

ఇక స్టేట్‌లో అధికారంలో ఉన్నా నియోజకవర్గంలో విపక్షంలో ఉన్న టీడీపీ విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ గ్రూపులతో కొట్టుమిట్టాడుతుంది. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు), నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ముద్రబోయిన వెంకటేశ్వరరావు వర్గాలుగా పార్టీ నిలువునా చీలిపోయింది. వీరిద్దరూ ఒకరికి ఒకరు ఆధిపత్యం కోసం ఎత్తులు, పైఎత్తులు వేసుకుంటుండడంతో నియోజకవర్గంలో టీడీపీ వెనుక బడిపోయింది. వాస్తవంగా చూస్తే పార్టీ అధికారంలో ఉన్నందుకు ఇక్కడ టీడీపీ పుంజుకోవాల్సి ఉన్నా గ్రూపు రాజకీయాల నేపథ్యంలో టీడీపీ గ్రాఫ్‌ ఒక శాతం కూడా పెరగలేదు అంటే అతియోశక్తి కాదు. ఇప్పుడు నూజివీడు టీడీపీ గ్రూపు తగాదాలు, లుకలుకలే వైసీపీకి వరంగా మారుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లకు ఎట్టకేలకు మొన్నటికి నూజివీడు నియోజకవర్గ ఏఎంసీ చైర్మ‌న్ భ‌ర్తీ చేశారు. పార్టీ కోసం పదేళ్ల పాటు ప్రతిపక్షంలో కష్టపడిన టీడీపీ కార్యకర్తలకు పదవులు దక్కకపోవడంతో వారంత తీవ్ర నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికీ మాగంటి బాబు, ముద్రబోయిన మధ్య సరైన సఖ్య‌త లేదు.

వైసీపీ బలంగా ఉన్న…..

ఇక నియోజకవర్గంలో మండలాల వారీగా బలాబలాలు చూస్తే నూజివీడు మున్సిపాలిటీ ఎప్పుడూ ప్రతాప్‌కు కంచుకోటగా ఉంటూ వస్తుంది. 2004, 2009, 2014 మూడుఎన్నికల్లోనూ ఇక్కడ ప్రతాప్‌కే ప్రజలు పట్టం కట్టారు. ఇక ముసునూరు మండలం టీడీపీకి కంచుకోట. నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థితో సంబంధం లేకుండా ముసునూరు మండలం ఓటర్లు ఆ పార్టీ వైపే మగ్గు చూపుతున్నారు. చాట్రాయి మండలం ఆది నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంటుంది. ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో చాట్రాయిలో వైసీపీకి ఆధిక్యత కనపడుతుంది. నూజివీడు రూరల్‌ మండలం తెలుగుదేశం వైపు మగ్గు చూపుతుండగా ఆగిరిపల్లిలో హొరాహొరి ఉన్నా ఎవరికి మెజారిటీ వస్తుందో అంచనా వెయ్యలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మేకా ప్రతాప్‌ అప్పారావు వైసీపీ నుంచే మరో సారి పోటీ చెయ్యనున్నారు. వైసీపీలో ఆయనకు మరో అభ్యర్థి ఎవరూ పోటీయే లేరు.

టీడీపీ నుంచి ఎవరు?

ఇక టీడీపీ నుంచి ముద్రబోయిన వెంకటేశ్వరరావే పోటీ చేస్తారా అన్నది సందేహమే. ఆయనను తప్పించాలని నియోజకవర్గంలో ఆయన్ను వ్యతిరేఖిస్తున్న వర్గం బలంగా వాధిస్తోంది. ఇదే నియోజకవర్గం నుంచి దేవినేని ఫ్యామిలీకి చెందిన దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్‌తో పాటు ఈ నియోజకవర్గానికి చెందిన అట్లూరి ఛారిట‌బుల్‌ ట్రాస్ట్‌ అధినేత అట్లూరి రమేష్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు నూజివీడు సీటును బీసీలకు ఇవ్వాల్సి వస్తే ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పేరు సైతం చర్చల్లో నానుతుంది. ఇక్క‌డ ప్ర‌తిసారి అభ్యర్థి ఎంపిక విషయంలో టీడీపీ అధిష్టానం నాన్చుతూ నాన్చుతూ చివరిలో అభ్యర్థిని ఎంపిక చెయ్యడం కూడా నూజివీడు టీడీపీకి పెద్ద మైనెస్‌గా మారుతుంది. మరి ఈ సారైనా టీడీపీ ఇక్కడ ముందుగా అభ్యర్థిని ప్రకటిస్తుందా నాన్చి నాన్చి ఎన్నికల టైమ్‌లో అభ్యర్థిని ఖ‌రారు చేస్తుందా ? అన్నది చూడాల్సి ఉంది. నూజివీడు టీడీపీలో ముందుగా అభ్యర్థిని ప్రకటించి అందరి నాయకుల మధ్య సమన్వయం కుదిరితే వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరి పోరు ఖాయం. లేని పక్షంలో నూజివీడులో టీడీపీయే వైసీపీని గెలిపిస్తుంది అనడంలో సందేహమే లేదు.

Subhash Vuyyuru
About Subhash Vuyyuru 2088 Articles
Subhash Vuyyuru entered into journalism at the young age of 21 as a staff reporter in one of the leading news daily in Andhrapradesh. He has been working in various capacities such as state bureau reporter and sub editor since then. Subhash always says that he will show the same level of interest and passion towards his profession till the end of his career. He also says that his love towards journalism is no less than his love towards his parents and family. He has crystal clear understanding towards contemporary state and national level politics which is very evident through his fearless and sensational articles. He thinks that journalism clubbed with honesty and integrity can really influence the society and helps to bring positive changes in the society.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*