
అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల పోరులో వైసీపీ, టీడీపీలు పోటీ పడిన తీరు నభూతో అన్న విదంగా సాగింది. ప్రజా తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు? ఎవరిని ప్రజలు ఆశీర్వదించారు? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. కొన్ని కీలక నియోజకవర్గాలపై ఇప్పటికే లక్షల్లో పందేలు కూడా కడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ఉత్కంఠ రేపిన నియోజకవర్గాల్లో ఒకటి గుంటూరు జిల్లా చిలకలూరి పేట. ఇక్కడ నుంచి వరుస విజయాలు సాధిస్తున్నారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన చంద్రబాబు కేబినెట్ లో బెర్త్ కూడా సాధించారు. ఇక, ఇప్పుడు జరిగిన ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు.
బీసీ మహిళతో వైసీపీ ప్రయోగం…
మూడు సారి కూడా ముచ్చటగా విజయం సాదించి హ్యాట్రిక్ దిశగా దూసుకుపోయి చరిత్ర సృష్టించాలని ప్రత్తిపాటి భావించారు. అయితే, ప్రత్తిపాటికి చెక్ పెట్టాలని వైసీపీ నిర్ణయించుకుంది. తరచుగా జగన్‌పై పుల్లారావు విరుచు కుపడిన నేపథ్యంలో ఆయనకు ముకుతాడు వేయాలని భావించిన జగన్ ఇక్కడ నుంచి ప్రయోగాత్మకంగా బీసీ మహిళ, ఎన్నారై విడదల రజనీకి అవకాశం కల్పించారు. ఈమె ఆది నుంచి కూడా బారీ ఎత్తున దూసుకుపోయింది. బీసీ వర్గానికి చెందిన ఆమె నియోజకవర్గంలో ఎక్కువుగా ఆ వర్గం ఓటర్లను కొల్లగొట్టిందని తెలుస్తోంది. నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లను కూడా కలుపుకొని పోయింది. మొత్తంగా చూసుకుంటే.. నియోజకవర్గంలో అతి తక్కువ సమయంలోనే ఓ సంచలనంగా మారిన విషయం వాస్తవం.
ప్రత్తిపాటిపై విశ్వాసం…..
చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటిపై అంతులేని విశ్వాసం పెంచుకున్న వర్గాలు చాలానే ఉన్నాయి. వీటి ముస్లిం మైనార్టీ వర్గం. వ్యాపారులు, కమ్మ వర్గం ఎలాగూ పుల్లారావు వెంటే నిలిచింది. ఇక, ప్రభుత్వం అమలు చేసిన ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు చేరువ చేసిన ఘనత పుల్లారావుకు దక్కుతుంది. అదేసమయంలో రహదారుల విస్తరణ, మంత్రిగా తనదైన శైలి దూకుడు. ఏ సమస్యపైనైనా స్పందించే లక్షణం. నేరుగా చంద్రబాబుతో మాట్లాడగలిగే చొరవ వంటివి నియోజకవర్గంలో ప్రజలకు ప్రత్తిపాటిని చేరువ చేశాయి. పైగా అందరినీ కలుపుకొని పోయే తత్వం కూడా ప్రత్తిపాటిపై విశ్వాసాన్ని పెంచాయి.
గెలుపు ఎడ్జ్ పుల్లారావుదే….
ఈ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తారు. దాదాపు 75 శాతం పైగా జరిగిన పోలింగ్ ప్రక్రియ వైసీపీ, వర్సెస్ టీడీపీ అనే కోణంలోనే సాగడం గమనార్హం. ఒకపక్క మహిళా సెంటిమెంట్, మరోపక్క, సీనియర్ నాయకుడు అనే అభిమానం మధ్య జరిగిన పోలింగ్‌లో పుల్లారావుకే ఎడ్జ్ ఉందని అంటున్నారు పరిశీలకులు నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి, విజన్ ఉన్న నాయకుడిగా గుర్తింపు, అందరికీ అందుబాటులో ఉండే నేతగా పుల్లారావుకే మార్కులు పడుతున్నాయి. ఇక, వైసీపీ నాయకురాలు రజనీ విషయానికి వస్తే. ఆమె కూడా దూకుడు చూపించినా.. విజన్ లేక పోవడం, అభివృద్ధిపై ఎలాంటి వ్యూహాన్ని ప్రజల ముందు ఉంచకపోవడం, పోల్ మేనేజ్మెంట్లో పుల్లారావు ముందు తేలిపోవడం వంటి కారణాల నేపథ్యంలో ఎన్నికల ఫలితం పుల్లారావుకే అనుకూలంగా ఉందని అంటున్నారు.
మెజారిటీ పైనే….
నియోజకవర్గంలోని నాదెండ్ల, యడ్లపాడు, చిలకలూరిపేట మండలంతో పాటు పట్టణంలో అన్నింటా తమకే మెజార్టీ వస్తుందని టీడీపీ లెక్కలు వేసుకుంటోంది. మంత్రి ప్రత్తిపాటి 12 వేలకు తగ్గకుండా మెజార్టీ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. టీడీపీ శ్రేణులు సైతం ప్రత్తిపాటికి 10 వేల మెజార్టీ వస్తుందని బెట్టింగ్‌లు వేస్తున్నారు. ఇక వైసీపీ అంచనాల విషయానికి వస్తే యడ్లపాడుపై ముందు నుంచి ఆ పార్టీకి ఆశలు ఉన్నాయి. యడ్లపాడుతో పాటు చిలకలూరిపేట రూరల్‌లో తమకు వచ్చే ఆధిక్యం నాదెండ్లలో టీడీపీకి వచ్చే ఆధిక్యంతో సమానం అవుతుందని, పట్టణంలో తమకు వచ్చే మెజార్టీతో గట్టెక్కుతామని భావిస్తోంది. అయితే పట్టణంలో రెండు వర్గాలు ఓటుకు రూ.2 వేలు పంచగా పుల్లారావు పోలింగ్‌కు కొద్ది గంటల ముందు మరో రూ.1000 పంచడం ఆ పార్టీకే కలిసొచ్చిందంటున్నారు. మరి తుది ఫలితం చూడాలి.
Leave a Reply