
తాజా ఎన్నికల ఫలితాలతో ఏపీలో అధికార టిడిపి నాయకులు చాలా మంది ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. వైసీపీ సునామీ దెబ్బకు కొట్టుకుపోయిన మహామహులందరూ కోలుకునేందుకు కనీసం మరో నెల రోజులైనా పట్టేలా ఉంది. తెలుగుదేశం పార్టీ మూడు దశాబ్దాల చరిత్రలో ఇదే ఘోరమైన ఓటమి. ఎన్నికలకు ముందు వరకు టీడీపీలో చాలా మందికి తాము గెలుస్తామన్న నమ్మకాలు ఉన్నాయి. గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు అర్థమైన కొందరు మాత్రం ఈ సారి తమ గెలుపు కష్టమే అని అంగీకరించినా గట్టి పోటీ ఇస్తామని ముందు నుంచి చెబుతూ వచ్చారు. వీరందరి అంచనాలు తల్లకిందులు అవుతూ వైసిపికి పూర్తి వన్ సైడ్ గా ఫలితాలు వచ్చాయి.
అభివృద్ధి ఇక్కడే అయినా….
ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబు గత నాలుగేళ్లలో ఏదైనా చేసిన అభివృద్ధి అంటూ ఉంటే అది కృష్ణా-గుంటూరు జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. కృష్ణా జిల్లా కంటే కూడా చంద్రబాబు ఎక్కువగా గుంటూరు జిల్లాపైనే ఫోకస్ ఉంచారు. గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటు, రాజధాని చుట్టూ అంతర్గత రహదారులు, బహిర్గత రహదారులు, పట్టిసీమ వాటర్ ద్వారా కృష్ణ – గుంటూరు డెల్టాకు నీళ్లు అందించడం ఇలా చెప్పుకుంటూ పోతే గుంటూరు జిల్లా ప్రజలకు బాబు చాలా మేళ్లు చేకూర్చారు. ఎన్నికలకు ముందు వెలువడిన సర్వేలు, ప్రీ పోల్ అంచనాల్లో కూడా చాలా జిల్లాల్లో టిడిపి ఏటికి ఎదురీదుతూ ఉందన్న అంచనాలు ఉన్నా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం ఆ పార్టీ స్పష్టమైన ఆధిక్యత చూపిస్తుందని చాలా మంది నమ్మారు. చివరకు ఫలితాలు చూస్తే జిల్లాలో ఉన్న 17 అసెంబ్లీ సీట్లలో 15 అసెంబ్లీ సీట్లతో పాటు.. 3 ఎంపీ సీట్లకు గాను రెండు ఎంపీ సీట్లలో వైసీపీ జెండా ఎగిరింది.
సీనియర్లు ఉన్నప్పటికీ…..
తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కంటే గుంటూరు జిల్లాలోని చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఆరు, ఏడు నియోజకవర్గాల్లో మూడు నుంచి నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి ఉన్నారు. ఈ ఎన్నికల్లో వీరంతా మట్టికరిచారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్న ఈ జిల్లాలో ఎందుకు చిత్తయ్యిందని విశ్లేషించుకుంటే అనేక కారణాలు ఇక్కడ టిడిపి ద్వారా ఓటమికి కనిపిస్తున్నాయి. వాస్తవానికి వైసీపీ అధినేత జగన్ కూడా గుంటూరు జిల్లాలో ఎన్నికలకు ముందు కొన్ని ఈక్వేషన్లు, స్ట్రాటజీలు పాటించినా టిడిపి కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామన్న ఆశలు పెట్టుకోలేదు. పీకే టీం గుంటూరు జిల్లాపై చాలా సర్వేలు చేసి జగన్ కు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇక్కడ అభ్యర్థుల ఎంపిక జరిగింది. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లాలోనే ఎక్కువమంది కమ్మ సామాజికవర్గానికి సీట్లు ఇస్తోంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి 8 మంది కమ్మ సామాజిక వర్గ అభ్యర్థులు తమ రెండు ఎంపీ సీట్లలో సైతం పోటీ చేశారు. ఈ క్రమంలోనే జగన్ చిలకలూరిపేట లాంటి నియోజకవర్గాల్లో చాలా ప్రయోగాత్మకమైన ఎత్తుగడలు వేశారు. చిలకలూరిపేటలో బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ విడదల రజనీకి సీటు ఇచ్చారు.
బీసీల్లో చీలిక….
ఆ నియోజకవర్గంలో పుల్లారావు బలంగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో ఆయన ఓటమి వెనక ఆయన స్వయంకృతాపరాధంతో పాటు బీసీల భారీ చీలిక రావడం కూడా ఓ కారణమే. గత ఐదు ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర ఈ ఎన్నికలలో ఓడిపోయారు. వాస్తవంగా చూస్తే పొన్నూరు నియోజకవర్గంలో కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జగన్ ఈ సారి అనూహ్యంగా అదే సామాజికవర్గానికి చెందిన కిలారి వెంకటరోశయ్యకు సీటు ఇవ్వడంతో ఆయన స్వల్ప తేడాతో గెలిచి నరేంద్రకు చెక్ పెట్టారు. జగన్ జిల్లాలో చిలకలూరిపేట, గుంటూరు వెస్ట్, రేపల్లె మూడు నియోజకవర్గాల్లో బిసి అభ్యర్థులను రంగంలోకి దించారు. దీంతో బీసీల్లో ఆలోచన వచ్చింది. నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. ఇక్కడ టిడిపి సీనియర్ గా ఉన్న రాయపాటి సాంబశివరావును ఢీ కొట్టేందుకు అదే సామాజికవర్గానికి చెందిన విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీకృష్ణదేవరాయలను రంగంలోకి దింపారు. లావు ఎన్నికలకు ఏడెనిమిది నెలల ముందు నుంచే నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలో దూసుకుపోయారు. ఉన్నత విద్యావంతుడు, యువకుడు కావడంతో పాటు సామాజిక సమీకరణలు కరెక్ట్ గా సెట్ అవడంతో ఈ ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు.
జగన్ వ్యూహంతో….
గురజాల నియోజవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. 1989 తర్వాత అక్కడ ఈ సామాజికవర్గానికి చెందిన ఎవరూ పోటీ చేయలేదు. తాజా ఎన్నికల్లో జగన్ కాసు మహేష్ రెడ్డికి సీటు ఇవ్వడంతో ఆ సామాజికవర్గం కసితో పని చేసి మరీ యరపతినేని శ్రీనివాసరావును ఓడించింది. గత ఎన్నికల్లో బొల్లా బ్రహ్మనాయుడు పెదకూరపాడు పంపి రాంగ్ స్టెప్ వేసిన జగన్… ఈ ఎన్నికల్లో తిరిగి వినుకొండ నుంచి బరిలోకి దింపడం ద్వారా ఇక్కడ టిడిపి నుంచి బలంగా ఉన్న జీవి ఆంజనేయులకు చెక్ పెట్టారు. పెదకూరపాడులో కొమ్మలపాటి శ్రీధర్ కు ధీటుగా అంతే స్థాయిలో ఆర్థికంగా బలంగా ఉన్న అదే సామాజికవర్గానికి చెందిన నంబూరి శంకర్రావును రంగంలోకి దింపడం ద్వారా ఇక్కడ వైసీపీ జెండా ఎగిరేలా చేశారు. తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఓడినా అన్నాబత్తుని శివకుమార్, మేరుగ నాగార్జునను రంగంలోకి దింపడం ద్వారా సానుభూతి పవనాలతో పాటు పార్టీ వారు గట్టెక్కేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. చంద్రబాబు పదే పదే గుంటూరు జిల్లా ప్రజలకు తాను రాజధాని ఇచ్చి, వారు తనకు ఎంతో రుణపడేలా చేశానని చెబుతూ వచ్చారు తప్ప రాజధాని భూసేకరణ చట్టం జరిగిన అన్యాయాలపై ఎవరు నోరు మెదపకుండా చేశారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇవన్నీ ఇప్పుడు తాజా ఎన్నికల్లో గట్టిగా ప్రభావం చూపాయి.
రాజధాని ప్రాంతంలోనూ…..
చంద్రబాబు నిజంగా తమకు ఎంతో చేశాడని రాజధాని ప్రాంత వాసులు విశ్వసిస్తే ఆయనకు నిజంగానే పట్టం కట్టే వారు కానీ రాజధాని ప్రాంతం నియోజకవర్గాలు అయిన మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో సైతం టిడిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీలో తలపండిన సీనియర్ నేతగా ఉన్న వాళ్లు సైతం ఈ ఎన్నికలలో ఓడిపోయారు. అంటే గుంటూరు జిల్లాలో సైతం జగన్ తో పాటు పీకే వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికలో పాటించిన ఈక్వేషన్లు అన్ని పని చేసినట్టు తెలుస్తోంది. చివరకు చంద్రబాబు మంగళగిరి లాంటి చోట్ల కూడా తన కుమారుడుని పోటీకి పెట్టి గెలిపించుకోలేని పరిస్థితి వచ్చింది. ఏదేమైనా గుంటూరు జిల్లాలో అభివృద్ధి చేశానని చంద్రబాబు పదే పదే చెప్పుకోవడం మినహా ఆ అభివృద్ధి అనేది ప్రజలకు కనపడకపోవడంతో వాళ్లంతా ఈ ఎన్నికల్లో ఆయనకు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారు.
Leave a Reply