
రాజకీయాలకు దేవుడికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఉంది కూడా. నామినేషన్ మొదలుకుని ప్రచారం వరకు కూడా నాయకులు, పార్టీలు మొత్తంగా దేవుళ్లపై భారం వేసిన పరిస్థితిని మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ముఖ్యంగా రెండు కీలక నియోజకవర్గాలు దేవుడి గుప్పిట్లోనే ఉన్నాయి! అది కూడా కలియుగ దైవంగా కీర్తి గడించిన శ్రీవేంకటేశ్వరస్వామి కనుసన్నల్లో మెలిగే ఈ రెండు నియోజకవర్గాల్లో ఒకటి టీడీపీ అధినేత సొంత జిల్లా చిత్తూరులోని తిరపతి కాగారెండోది పశ్చిమ గోదావరి జిల్లాలోని చిన్నతిరుపతిగా పేరు తెచ్చుకున్న ద్వారకాతిరుమల ప్రాంతం. ఇది గోపాలపురం నియోజకవర్గంలో ఉండడంతో ఇది కూడా వెంకన్న ఖాతాలోనే ఉన్నట్టుగా నాయకులు భావిస్తారు.
ఆయన ఆశీస్సులతోనే….
శ్రీవారి ఆశీస్సులు లేకుండా ఈ రెండు నియజకవర్గాల్లోనూ గెలుపు గుర్రం ఎక్కడం కష్టమని ప్రతి పార్టీ నాయకుడు కూడా భావిస్తారు. అందుకే నామినేషన్‌ను దాఖలు చేయడానికి ముందు ఇక్కడి అభ్యర్థులు పెద్ద ఎత్తున శ్రీవారి కరుణ కోసం ప్రయత్నిస్తారు. తిరుమల తిరుపతిని పెద్ద తిరుపతిగా అందరూ భావిస్తే ద్వారకాతిరుమలను చిన్నతిరుపతిగా భావిస్తుంటారు. పెద్ద తిరుపతిలో స్వామికి మొక్కుకున్న వారు అక్కడికి వెళ్లలేని పక్షంలో చిన్నతిరుపతిలో మొక్కులు చెల్లించుకోవచ్చన్న సంప్రదాయం ఉంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్న ఈ ద్వారకాతిరుమల మండలం 2009 నుంచి గోపాలపురం అసెంబ్లీ సీటులోనూ.. రాజమహేంద్రవరం ఎంపీ సీటు పరిధిలోనూ ఉంది.
వైసీపీకి వరమదే…..
ఈ క్రమంలోనే ఇప్పుడు రాష్ట్రంలో హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో ఈ రెండు నియోజకవర్గాల్లో వెంకన్న ఎవరిని కరుణిస్తాడు? వైసీపీనా? టీడీపీనా? అనే చర్చ జోరుగా సాగుతోంది. తిరుపతి నుంచి టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే సుగుణమ్మ, వైసీపీ తరఫున భూమన కరుణాకర్‌రెడ్డి పోటీ చేశారు. ఇద్దరి మధ్య పోరు హోరా హోరీగా సాగింది. పోల్ మేనేజ్మెంట్లో ఇద్దరూ నువ్వా – నేనా అనే రేంజ్లో తలపడ్డారు. ఇక, ప్రభుత్వ పథకాలు టీడీపీకి కలిసి వస్తుండగా, జగన్ మ్యానియా వైసీపీకి వరంగా మారింది. దీంతో తిరుపతిలో ఎవరు గెలుస్తారనేది శ్రీవారే నిర్ణయించాలని అంటున్నారు ఇక్కడి వారు. సుగుణమ్మ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ఆ జోరు లేదు. ఇక ఎన్నికలకు ముందు వరకు స్పీడ్‌గా ఉన్న భూమనకు ఎన్నికల్లో అందరూ అనుకున్న రేంజ్లో ఓటింగ్ పడలేదన్న టాక్ ఉంది. దీంతో ఇక్కడ గెలుపుపై ఎవ్వరూ అంచనాకు రాలేకపోతున్నారు.
అదే డిసైడ్ చేస్తుందట….
ఇక, చిన్నతిరుపతి ఉన్న గోపాలపురం నియోజకవర్గం ఒకరకంగా టీడీపీకి కంచుకోట. ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ టికెట్‌పై పోటీ చేశారు. ఇక, వైసీపీ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన తలారి వెంకట్రావులు తలపడ్డారు. ఇక్కడ కూడా హోరా హోరీ పోరు సాగింది. అయితే, ఇక్కడ కొన్ని మండలాలు టీడీపీకి, మరికొన్ని వైసీపీకి అనుకూలంగా ఉంటే.. ద్వారకాతిరుమల ఉన్న మండలం అభ్యర్థుల గెలుపు, ఓటములను డిసైడ్ చేయనుంది. దీంతో ఈ మండలంలో పడే ఓట్లే గెలిచే నాయకు డిని డిసైడ్ చేస్తుందని అంటున్నారు. మొత్తానికి ఇక్కడ కూడా చిన్న వెంకన్నపైనే నాయకులు ఆశలు పెంచుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Leave a Reply