
తీవ్రమైన ఉత్కంఠ, ఎన్నో సంచలనాల మధ్య ఏపీ కేబినెట్ కొలువు దీరింది. జగన్ తొలి విడతలోనే మొత్తం 25 మందితో కేబినెట్ ఏర్పాటు చేశారు. ఆశావాహుల లెక్క ఎక్కువుగా ఉన్నా జగన్ మాత్రం ఇప్పుడు కేబినెట్ మంత్రులుగా ఉన్న వారిలో 90 శాతం మంది రెండున్నరేళ్ల తర్వాత తప్పుకుంటారని.. వీరిలో కొత్తవారికి అవకాశం ఇస్తామని చెపుతూ ఇక్కడ అసంతృప్తులు చెలరేగకుండా చూసుకుంటున్నారు. తాజా కేబినెట్లో జగన్ ముందునుంచి హామీ ఇచ్చినట్టుగానే సామాజిక సమతుల్యత, ప్రాంతీయ సమానతకు పెద్ద పీట వేశారు. వైసీపీకి బలమైన సపోర్ట్ ఇచ్చిన గోదావరి, కృష్ణా జిల్లాలకు మాత్రం బంపర్ బొనాంజా దక్కింది. ఈ మూడు జిల్లాల నుంచి ఏకంగా ముగ్గురేసి మంత్రులకు కేబినెట్లో చోటు దక్కింది.
నారాయణను ఓడించి….
తాజా కేబినెట్లో ముగ్గురు మంత్రులు గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారిపై గెలిచి మరీ మంత్రులు అవ్వడం విశేషం. జగన్ ప్రభంజనంలో ముగ్గురు మంత్రులు మినహా మిగిలిన వారు అందరూ కొట్టుకుపోయారు. ఈ క్రమంలోనే టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ముగ్గురిని ఓడించిన వైసీపీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు జగన్ కేబినెట్లో చోటు దక్కింది. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి మంత్రి నారాయణపై విజయం సాధించిన పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్‌కు బీసీ కోటాలో కేబినెట్ బెర్త్ దక్కింది. అనిల్ ముందు నుంచి జగన్‌కు వీరవిధేయుడిగా ఉంటూ వచ్చారు. ఎన్నికలకు ముందు కూడా జగన్‌ను ఈ ఎన్నికల్లో గెలిపించుకోవడం కోసం అవసరమైతే చంపాలి లేదా చావాలని అని ఉద్రేకపూరితమైన వ్యాఖ్యలు కూడా చేసిన సంగతి తెలిసిందే. బలమైన మంత్రిగా ఉన్న నారాయణను ఓడించడంతో పాటు వరుసగా రెండోసారి గెలవడంతో అనిల్‌కు బీసీ కోటాలో మంత్రి పదవి దక్కింది.
పితానిపై గెలిచి….
ఇక ఆచంటలో మంత్రిగా ఉన్న పితాని సత్యనారాయణ ఇప్పటికే వరుసగా మూడుసార్లు గెలుస్తూ హ్యాట్రిక్ కొట్టారు. ఈ ఎన్నికల్లో పితానిపై విజయం సాధించిన చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు కూడా క్షత్రియ సామాజికవర్గం కోటాలో మంత్రి పదవి దక్కింది. దివంగత వైఎస్ ఆశీస్సులతో తొలిసారి అత్తిలి నుంచి పోటీ చేసిన ఆయన 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. విశేషం ఏంటంటే ఆయన గెలిచిన రెండుసార్లు కూడా మంత్రులపైనే గెలిచారు. ఇప్పుడు పితానిపై గెలిచిన రంగనాథరాజు 2004లో అప్పుడు దేవాదాయశాఖా మంత్రిగా ఉన్న దండు శివరామరాజును ఓడించారు.
అప్పుడు మామను ఓడించి….
ఇక బందరు నుంచి పోటీ చేసిన పేర్ని వెంకట్రామయ్య (నాని) కూడా జగన్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. బందరు నుంచి పోటీ చేసిన పేర్ని నాని తండ్రి కృష్ణమూర్తి కూడా గతంలో మంత్రిగా ఉన్నారు. గతంలో రెండుసార్లు కాంగ్రెస్ నుంచి గెలవడంతో పాటు ఇప్పుడు వైసీపీ నుంచి మూడో సారి గెలిచారు. గత ఎన్నికల్లో కొల్లు రవీంద్ర చేతిలో ఓడిన ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్న రవీంద్రను ఓడించి మంత్రి అయ్యారు. ట్విస్ట్ ఏంటంటే 2004లో నాని అప్పుడు మంత్రిగా ఉన్న నడికుదిటి నరసింహారావును ఓడించగా… ఇప్పుడు నరసింహారావు అల్లుడు, మంత్రిగా ఉన్న రవీంద్రను ఓడించి మంత్రి అయ్యారు.
Leave a Reply