
ఈ సారి చిత్తూరు జిల్లా రాజకీయం రంజుగా మారింది. ఇక్కడ ప్రధాన పార్టీలైన టీడీపీ వైసీపీల మధ్య రాజకీయ పోరేగాక వ్యక్తిగత పోరు తారస్థాయికి చేరుకుంటున్నాయి. రాజకీయాలు పార్టీల సరిహద్దులు దాటి వ్యక్తిగత , కుటుంబాల మధ్య వైషమ్యాలుగా ఎప్పుడో మారాయి. సదరు నేతలకు పార్టీలతో పాటు ప్రత్యర్థి వర్గం ఎదుగుదల..ఒదుగుదల వంటి అంశాలపై పట్టింపులుంటాయి. వారితో కలసి పనిచేయమని చెప్పినా..ఒకరికన్నా ఒకరిని తక్కువగా చూసినా పార్టీలో కొనసాగడం అన్నది ఇష్టముండని పని. అప్పుడప్పుడూ ఒకే ఒరలో ఇమిడినా కొన్నేళ్లే. నివురు గప్పిన నిప్పులా కోల్డ్ వార్ ఉండనే ఉంటుంది. సరిహద్దులు గీసుకుని పార్టీలకు పనిచేయడం సదరు నేతలకు వెన్నతో పెట్టిన విద్య.
ఒకరి స్థానాలపై మరొకరు….
ఇక అసలు విషయానికి వస్తే… వర్గ, ప్రతీకార రాజకీయాలతో నిండి ఉన్న చిత్తూరు జిల్లా ఈసారి ఎన్నికల యుద్ధానికి వేదిక కానుంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలపై టీడీపీ కన్నేసింది. ఎలాగైనా ఆ స్థానాలను తన ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. ఆ మూడు టార్గెట్ నియోజకవర్గాల్లో తొలి పేరు వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్, నగరి ఎమ్మెల్యే రోజా. రెండో టార్గెట్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి, మూడో టార్గెట్ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి. అయితే వైసీపీ కూడా అదే స్థాయిలో వ్యూహాలకు పదును పెట్టింది. కొడితే కుంభస్థలం కొట్టాలన్న రీతిలో చంద్రబాబును ఓడించేందుకు కుప్పం సీటుకే గురిపెట్టింది. అలాగే మంత్రి అమర్నాథ్రెడ్డి, పీలేరులో నల్లారిని ఓడించేందుకు వ్యూహాలను రచిస్తోంది. అందుకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తూ పొలిటికల్ హీట్‌ను మరింత పెంచేస్తోంది.
మంత్రిని ఓడించాలని….
మంత్రి అమర్నాథ్ రెడ్డి. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పుంగనూరులో గెలిచారు. అయితే ఆ తర్వాత అభివృద్ధి పేరుతో పార్టీ మారి ఏకంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. నాటి నుంచి రగిలిపోతున్న వైసీపీ అధినేత జగన్ ఎలాగైనా అమర్నాథ్రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకున్నారట. అమర్నాథ్ రెడ్డిని పలమనేరులో ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టారు. అయితే ఇప్పటి వరకు సరైన అభ్యర్థి దొరకలేదనే చెప్పాలి. దానికి తోడు తరుచూ ఇన్చార్జిలను మారుస్తుండటంతో నియోజకవర్గంపై ఎవరూ దృష్టి సారించడం లేదనే అపవాదు ఉంది.
రివేంజ్ తీర్చుకోవాలని….
ఇక దశాబ్దాల వైరం ఉన్న నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి ఇటీవల టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన పీలేరు నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కిషోర్‌కు పుంగనూరు నియోజకవర్గ బాధ్యతలను కూడా చంద్రబాబు అప్పగించారు.ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ఉన్నారు. వాస్తవానికి జిల్లాలో పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబాలది దశాబ్ధాల వైరం. పెద్దిరెడ్డి, కిరణ్‌ల మధ్య చాలా ఏళ్లుగా మాటలు కూడా లేవు.రివేంజ్ తీర్చుకోవడానికి ఇద్దరు నేతలు కాలుదువ్వుతున్నట్లు తెలుస్తోంది. పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించాలని కిషోర్ చూస్తుంటే , పీలేరులో కిషోర్‌కుమార్ రెడ్డిని మట్టి కరిపించాలని పెద్దిరెడ్డి వ్యూహాలతో రాజకీయ కత్తులు దూస్తున్నాడట. చూడాలి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో..? అన్నది.
Leave a Reply