
పశ్చిమగోదావరి జిల్లాలో గోపాలపురం నియోజకవర్గం టీడీపీకి పెట్టని కోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక 2004 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ ఆ పార్టీ ఓడిపోగా అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. ఇక 2014 ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీ చేసిన ముప్పిడి వెంకటేశ్వరావు వైసీపీ అభ్యర్ధి తలారి వెంకట్రావుపై విజయం సాధించారు. ఈ సారి కూడా వీరిద్దరే మళ్ళీ ప్రత్యర్ధులుగా బరిలోకి దిగుతున్నారు. అయిదేళ్లుగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న ముప్పిడి వెంకటేశ్వరరావు నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో బాగా కష్టపడ్డారు. ప్రజలకి అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలు అందేలా చేశారు. అయితే వ్యక్తిగతంగా సౌమ్యుడే అన్న పేరున్న నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలను పరిష్కరించడంలో మాత్రం ముప్పిడి ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ఉన్న రెండు వర్గాలు బలంగా ఉండడంతో కర్ర విరగకుండాపాము చావకుండా అన్న చందంగా ఆయన మధ్యే మార్గంగా తన పని తాను చేసుకెళ్లారు.
బాపిరాజు అండతోనే….
జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు సైతం ఇదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడం…ఆయనకి నియోజకవర్గంపై పట్టు ఉండటం ముప్పిడికి కలిసిరానుంది. చివరకు ముప్పిడిని వ్యతిరేకించే వర్గం ఆయనకు సీటు ఇవ్వొద్దని చెప్పినా చంద్రబాబు మాత్రం ఆయన వ్యక్తిత్వం, కమిట్మెంట్ నేపథ్యంలో ఆయనకే సీటు ఇచ్చారు. వైసీపీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన తలారి వెంకట్రావు మరోసారి బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల్లోనే ఉన్నారని ఆయనకు సీటు ఇస్తే సానుభూతి పవనాలు కలిసిరానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపాకి పెరిగిన బలం తలారికి ప్లస్. అయితే గోపాలపురం నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న టీడీపీని ఢీకొనడం కష్టం. ఇక జనసేన పొత్తులో భాగంగా ఇక్కడ బీఎస్పీ పోటీ చేస్తుంది. కొంత ఎస్సీ ఓటర్లు, పవన్ ఇమేజ్ బీఎస్పీకి ప్లస్. కానీ అది కూడా పూర్తి స్థాయిలో ఉండదు. దీంతో ప్రధాన పోరు తెదేపా-వైకాపాల మధ్యే జరగనుంది.
కమ్మ సామాజిక వర్గమే ఎక్కువ…..
ఈ నియోజకవర్గంలో గోపాలపురం, ద్వారకా తిరుమల, నల్లజర్ల, దేవరపల్లి మండలాలు ఉన్నాయి. ఇక ఇక్కడ ఎస్సీ, కమ్మ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. ఈ నియోజకవర్గంలో కమ్మ ఓటర్లు 42 వేలకు ఉంటారు. జిల్లా మొత్తం మీద ఈ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గం ఇదే. అభ్యర్థి ఎవరన్నదానితో సంబంధం లేకుండా ఈ సామాజికవర్గం ఓటర్లు సైకిల్ గుర్తుకు ఓటేయడంతో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో మాత్రం సైకిల్ దూసుకుపోతోంది. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ టీడీపీనే బలంగా ఉంది. కానీ ఈసారి గోపాలపురం ఓటరు ఆనవాయితీ తప్పకుండా టీడీపీకే మరో సారి పట్టం కడతారా లేదా మార్పు కోరుకుంటారా ? అన్నది చూడాల్సి ఉంది.
Leave a Reply