
రాష్ట్ర ప్రజలకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఉన్న ఈ నియోజకవర్గంలో ఎన్నికల హోరుతో రాజకీయం వేడెక్కింది. అన్నీ రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తూ పోలవరాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తోన్న మంగళగిరి మీద పట్టుకోసం రెండు పార్టీలు ఎంతలా చెమటోడుస్తున్నాయో ? పోలవరంలోనూ అదే పోరు ఉంది. ఎన్ని పార్టీలు ఉన్న ఇక్కడ టీడీపీ-వైసీపీల మధ్యే ప్రధాన పోటీ జరగనుంది. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన మొడియం శ్రీనివాస్ వైసీపీ అభ్యర్ధి తెల్లం బాలరాజుపై విజయం సాధించారు. అయితే ఈసారి మొడియంపై అటు ప్రజల్లోనూ..ఇటు టీడీపీ కేడర్ ల్లోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో మొడియంని పక్కనబెట్టి బొరగం శ్రీనివాసరావుని పోటీకి దించారు.
అభ్యర్థిని మార్చి…..
అయితే ఐదేళ్లుగా ఎమ్మెల్యేపై వచ్చిన వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు తెదేపాకి మైనస్ అయ్యాయి. కానీ అభ్యర్ధిని మార్చి ఆ వ్యతిరేకతని కొంతవరకు తగ్గించే పని చేశారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి 35 వేల పైచిలుకు ఓట్లతో సత్తా చాటిన బొరగం శ్రీనివాస్ పదేళ్ల పాటు టీడీపీ సీటు కోసం ప్రయత్నాలు చేశారు. 2009 ఎన్నికల్లోనూ ఆయన టీడీపీ సీటు రేసులో నిలిచారు. అలాగే ఈ ఐదేళ్లు నియోజకవర్గంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి కూడా జరగలేదు. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చంద్రబాబు ఇమేజ్ మాత్రమే టీడీపీని గట్టెక్కించాలి. అటు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉన్న తెల్లం బాలరాజు మరోసారి వైకాపా నుంచి బరిలోకి దిగుతున్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధి, 2014లో ఓడిపోయిన సానుభూతి, ప్రభుత్వం మీద వ్యతిరేకత బాలరాజుకి ప్లస్ కానున్నాయి. ఎప్పుడు నుండో ప్రజల్లో ఉంటున్న బాలరాజుపై ప్రజల్లో అభిమానం ఉంది.
గిరిజనుల ఓట్లే….
తెల్లం బాలరాజు నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇక్కడ చేసిందేమి లేదన్న ఆరోపణలు కూడా తీవ్రంగా ఉన్నాయి. పార్టీలోనే ఓ వర్గం ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించినా చివరకు అధిష్టానం ఆయనకే సీటు ఇచ్చింది. మరోవైపు ఇక్కడ జనసేన కూడా పోటీలో ఉంది. చిర్రి బాలరాజు ఆ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో తెలంగాణలోని కొన్ని ముంపు మండలాలని కలిపారు. దీంతో ఇక్కడ పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, టి నరసాపురంతో పాటు తెలంగాణ నుంచి విలీనం అయిన వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు ఉన్నాయి. కాపులు, గిరిజనుల ఓట్లు ఎక్కువగా ఉండటం వలన రెండు సామాజికవర్గాలపైనే గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ వైకాపా అభ్యర్ధి తెల్లం బాలరాజు గెలుపు సులువనే చెప్పాలి. అయితే నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిస్థితులు…జనసేన పోటీలో ఉండటం లాంటి అంశాలు ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఎన్నికల సమయంలో ప్రజలు ఏ పార్టీ వైపు ఉంటారో చూడాలి..
Leave a Reply