
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరు రాష్ట్రంలో చక్రం తిప్పుతారు? అనే ప్రశ్నలు జోరుగా సాగుతున్నాయి. అదేసమయంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మాదే గెలుపని ఇటు అధికార టీడీపీ, అటు వైసీపీ కూడా చెబుతున్నా యి. ఈ క్రమంలో ఆయా పార్టీలు గెలుపు గుర్రాల మెజారిటీపైనా అంచనాలు వేస్తున్నాయి. ఖచ్చితంగా అక్కడ గెలుస్తామని, మెజారిటీ కూడా వేలల్లో ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇంత కాన్ఫిడెంట్‌గా టీడీపీ నాయకులు మాత్రం చెప్పకపోవడం గమనార్హం. అదే పోలవరం నియోజకవర్గం. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో తమదే గెలుపని వైసీపీ నాయకులు ప్రకటించారు. అంతేకాదు, ఇక్కడ మెజారిటీ కూడా తమ అభ్యర్థికి 20 వేల ఓట్ల పైచిలుకు వస్తుందని అంటున్నారు. దీంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.
లెక్కలు కరెక్టే…..
వైసీపీ వేస్తున్న లెక్కలు, చెబుతున్న అంచనాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేస్తే.. ఆ పార్టీ లెక్కలు కరెక్టే అనిపిస్తున్నాయి. పోలవరం నియోజకవర్గం పూర్తిగా గిరిజనులకు రిజర్వ్ చేసిన ప్రాంతం. ఇక్కడ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు కారణంగా ఈ నియోజకవర్గం జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరిలోని మొత్తం స్థానాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలోనే ఇక్కడ నుంచి మొడియం శ్రీనివాసరావు కూడా టీడీపీ టికెట్‌పై విజయం సాధించారు. అయితే, దీనికి ముందు జరిగిన రెండు ఎన్నికలు, ఒక ఉప ఎన్నిక సహా కాంగ్రెస్, వైసీపీల నుంచి పోటీ చేసిన తెల్లం బాలరాజు విజయం సాధించారు. దివంగత వైఎస్‌కు అత్యంత సన్నిహితుడుగా, శిష్యుడుగా మెలిగిన బాల రాజు 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై విజయం సాధించారు. ఇక, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుని జగన్‌కు జై కొట్టారు.
ఆరోపణలతోనే…..
ఈ క్రమంలో 2012లో జరిగిన ఉప ఎన్నికలోనూ బాలరాజు పోలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ టికెట్ పై విజయం సాధించారు. ఇక, 2014 విషయానికి వచ్చే సరికి విభజన వేడి, చంద్రబాబు హవా నేపథ్యంలో బాలరాజు ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలోనే మొడియం శ్రీనివాసరావు ఇక్కడ విజయం సాధించారు. అయితే, ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన ఇక్కడ చేసింది ఏమీ లేదు. పైగా అవినీతి, అక్రమాలకు తెరలేపారన్న ఆరోపణలు ఉన్నాయి. నేరుగా సచివాలయంలోనే వసూళ్ల దుకాణం పెట్టడంతో రెండు మూడు సార్లు చంద్రబాబు నేరుగా పిలిపించి హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక, ఏలూరు ఎంపీ నియోజకవర్గంలో ఉండడం, ఎంపీ మాగంటి బాబును కూడా లెక్కచేయకుండా కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లు చేయడంతో మొడియంను మాగంటి కూడా పక్కన పెట్టారు. ఇలా ఇటు తన స్వార్థం కోసం పార్టీని కూడా భ్రష్టుపట్టించారు.
చివరి నిమిషంలో మార్చినా…..
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఈ దఫా ఎన్నికల్లో మొడియంకు టికెట్‌కు కూడా ఇవ్వలేదు. ఇక, చివరి నిముషంలో బొరగం శ్రీనివాస్‌ను చంద్రబాబు రంగంలోకి దింపారు. అయితే, సమయం తక్కువగా ఉండడం, ప్రచారంలో పెద్దగా ఎవరూ కలిసి రాకపోవడం, ఎక్కడికి వెళ్లినా.. ప్రజల నుంచి కూడా స్పందన అంతంత మాత్రంగానే ఉండడంతో బొరగం కూడా పెద్ద ఇంట్రస్టుగా ప్రచారం చేయలేక పోయారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇక్కడ వైసీపీ నుంచి బరిలోకి దిగిన తెల్లం బాలరాజుకే ప్రజలు మొగ్గు చూపారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ బాలరాజుపై ఎక్కువగానే అంచనా వేస్తోంది. ఆయన దాదాపు 20 వేల భారీ మెజారిటీతో గెలుస్తారని, పశ్చిమలో వైసీపీ గెలవబోయే తొలి సీటు కూడా ఇదేనని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, బాలరాజు గెలిస్తే.. ఎస్టీ కోటాలో జగన్ కేబినెట్లో బెర్త్ కూడా ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Leave a Reply