జగన్ పార్టీకి జిలేబీ లాంటి సీటు…!!!

ysrcongressparty-rajyachoti-constiuency

రాయచోటీ నియోజకవర్గం కడప జిల్లాలో ఎన్నికల వేళ ఆసక్తికర నియోజకవర్గంగా మారింది. రాయచోటి నియోజకవర్గంలో వరుస విజయాలతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డికి మరోసారి విజయావకాశాలున్నాయా? టీడీపీ తిరిగి ఇక్కడ గెలుస్తుందా? 2009 సాధారణ ఎన్నికలు, 2012 ఉప ఎన్నికలు, 2014 ఎన్నికల్లోనూ గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటి నియోజకవర్గంలో గెలిచారు. రాయచోటి నియోజకవర్గం చరిత్ర చూసినా ఇక్కడ కాంగ్రెస్ తర్వాత వైసీపీ బలంగా కన్పిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో ఆ ఓటు బ్యాంకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరమయింది. దీంతో పాటు వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కూడా కావడం ఇక్కడి నేతలకు కలసి వచ్చే అంశంగా చెబుతారు.

రెండే… రెండు సార్లు….

రాయచోటి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 15 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అత్యధిక సార్లు విజయం సాధించింది. 1983లో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఇక్కడ రెండు సార్లు మాత్రమే గెలవడం విశేషం. అంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2009 లో బరిలోకి దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే నియోజకవర్గంలో మూడుసార్లు జెండా ఎగరవేసింది. రాయచోటి నియోజకవర్గాన్ని వైసీపీ కంచుకోటగా భావిస్తారు. అందునా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డిని కులాలు, మతాలుకు అతీతంగా ప్రజలుఆదరిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆయనకు గత మూడు ఎన్నికల్లో వచ్చిన భారీ మెజారిటీయే ఇందుకు ఉదాహరణగా చెప్పాలి.

అందరూ ఏకమై…..

గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యేగా ఉన్నా ప్రతిపక్షంలో ఉండటంతో హైలెట్ అయ్యారు. గత పదేళ్లుగా ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీపడలేదు. దీంతో పాటు రాయచోటిలో బలమైన నేతలుగా ఉన్నమండిపల్లి రాంప్రసాద్, గడికోట ద్వారకానాధరెడ్డిలు శ్రీకాంత్ రెడ్డిని బలపరుస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ వైసీపీలో ఉన్న అసంతృప్తులు తొలిగిపోయాయి. గడికోట ద్వారకానాధ రెడ్డి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి బావమరిది. ద్వారకానాధరెడ్డి మొదట్లో కొంత బెట్టు చేసినా ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి విజయానికి కృషి చేస్తుండటం గమనార్హం.

అసంతృప్తి సెగలతో….

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం ఇక్కడ రెడ్డప్పగారి పల్లి రమేష్ కుమార్ రెడ్డికి టిక్కెట్ కేటాయించింది. వాస్తవంగా ఇక్కడ సుగవాసి పాలకొండరాయుడికి కొంత బలం ఉంది. ఆయన 1999, 2004లో టీడీపీ అభ్యర్థిగా రాయచోటి నుంచి గెలిచారు. రాయచోటి నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థి పాలకొండరాయుడే. అయితే పాలకొండరాయుడు తనయుడు ప్రసాద్ తనకు టిక్కెట్ ఇవ్వాలని గట్టిగానే ప్రయత్నించారు. కానీ ప్రసాద్ కు టీటీడీ సభ్యుడిగా నియమించారు తప్ప టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ప్రసాద్ బాబు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈయనను బుజ్జగించినా కూడా లోలోపల తమ టిక్కెట్ ను తన్నుకుపోయారన్న కసితో ఆయనను ఓడించాలన్న ఉద్దేశ్యంతోనే ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద రాయచోటిలో టీడీపీ జెండా ఎగరడం కష్టమే. జగన్ పార్టీకి ఇది జిలేబీ లాంటి సీటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Ravi Batchali
About Ravi Batchali 41287 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*