ఇక్కడ పాగా వేసేదెవరో…!

ysrcongressparty-telugudesamparty

అనూహ్య పరిణామాల మధ్య పెడన సీటు నుండి టీడీపీ తరుపున ఎవరు పోటీ చేస్తున్నారో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం పెడనకు తెదేపా ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని అధినేత చంద్రబాబుని కోరారు. ఇక ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. ఈ సీటు నుండి బందరు ఎంపీ గా ఉన్న కొనకళ్ళ నారాయణ పోటీ చేస్తారని చాలరోజులుగా ప్రచారం జరిగింది. అలాగే మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్, మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కుమార్తె శ్రీదేవి కూడా పెడన టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఇక చివరికి ఈ ఊహాగానాలు అన్నిటికి చెక్ పెడుతూ…ఎన్నో ఏళ్ళు పెడన నుండి టీడీపీ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న కాగిత వెంకట్రావు తనయుడు వెంకట కృష్ణ ప్రసాద్‌కి అధినేత టికెట్ ఖరారు చేశారు.

యాక్టివ్ గా లేకపోవడంతో….

తండ్రికి ఉన్న పేరుతో పెడనలో ప్రచారం చేసేందుకు ప్రసాద్ సిద్ధమయ్యాడు. అయితే ఎన్నో ఏళ్ళు టీడీపీకి సేవలు అందించిన కాగితకి 2014లో మంత్రి పదవి కూడా రావాల్సింది. కానీ కొన్ని సామాజిక సమీకరణాలు వలన ఆయనకి పదవి రాలేదు. ఇక కాగితకి పెడనలో మద్ధతుదారులు చాలామంది ఉన్నారు. టీడీపీ క్యాడర్ కూడా గట్టిగానే ఉంది. పెడనలో అభివృద్ధి బాగానే జరిగింది గాని అనుకున్నంత మాత్రం జరగలేదు. సి‌సి రోడ్లు, అంగన్వాడీ కేంద్రల నిర్మాణాలు, ఎన్టీఆర్ ఇళ్ళ నిర్మాణం బాగానే జరిగాయి. అటు సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువయ్యాయి. ఈ నియోజకవర్గం చివర్లలో ఆక్వా రంగం బాగానే అభివృద్ధి జరిగింది. అయితే కాగిత ఆరోగ్యం సరిగా లేకపోవడం వలన అంత యాక్టివ్‌గా పనులు చేయలేదని టాక్ ఉంది. ఇక అనూహ్య పరిణామాల మధ్య పెడన మున్సిపాలిటీ ఛైర్మన్ హోదాని టీడీపీ కోల్పోయింది. దీంతో పెడన పట్టణంలో టీడీపీ కొంత వీక్ అయింది. అటు తండ్రి స్థానంలో దిగుతున్న ప్రసాద్‌కి అనుకున్నంత పేరు ఏమి లేదు. కేవలం తండ్రి పేరు చెప్పుకునే ఓట్లు అడగాల్సి ఉంది.

జోగికి కూడా పట్టుండటంతో….

మరోవైపు వైసీపీ నుండి జోగి రమేశ్ బరిలోకి దిగుతున్నారు. 2009లో కాంగ్రెస్ నుండి జోగి ఇక్కడ నుండి గెలిచారు. అయితే 2014లో మళ్ళీ సొంత నియోజకవర్గం మైలవరం వెళ్ళి దేవినేని మీద పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ జగన్ పెడన తీసుకొచ్చి నిలబెడుతున్నారు. ఆయన ఎప్పటి నుండో ప్రచారంలో దూసుకెళ్లుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేయడంతో…జోగికి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా వైసీపీకి కూడా బలం పెరగడంతో జోగికి కలిసొచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వైసీపీని ఐదేళ్ళ నుండి ఉప్పాల రామ్ ప్రసాద్ బలపరుస్తూ ఉన్నారు. 2014లో జగన్ ఉప్పాలని కైకలూరు పంపించారు. అక్కడ ఓడిపోవడంతో…మళ్ళీ పెడన సమన్వయకర్తగా ఉండి…పెడన మున్సిపాలిటీ ఛైర్మన్ వైసీపీకి దక్కడంలో కీలకపాత్ర పోషించారు. పార్టీ కోసం ఇంత కష్టపడిన ఉప్పాల కూడా పెడన టికెట్ ఆశిస్తున్నారు. కానీ పార్టీ సర్వేలో ఎక్కువ మద్ధతు ఉండటంతో జోగికి టికెట్ ఖరారు అయింది. ఉప్పాలకి ఎమ్మెల్సీ పదవి హామీ దక్కిందని తెలుస్తోంది.

గెలుపోటములను తారుమారు చేసే…..

అయితే కాగిత, జోగి, ఉప్పాల ఒకే సామాజికవర్గం వారు. దీంతో ఈ సామాజికవర్గం వారు రెండు వైపులా ఉన్నారు. ఇక ఉప్పాల వర్గం సైలెంట్‌గా కాగితకి మద్ధతు ఇస్తుందనే టాక్ ఉంది. మరి చూడాలి ఎన్నికల సమయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో. ఇక్కడ పవన్ కల్యాణ్ అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. దీంతో జనసేన అభ్యర్ధికి కూడా ఓట్లు బాగానే పడతాయి. 2009లో ప్రజారాజ్యం అభ్యర్ధికి దాదాపు 30వేల ఓట్లు వరకు పడ్డాయి. జనసేన వలన గెలుపోటములు తారుమారయ్యే అవకాశం ఉంది. కాగా, పెడన నియోజకవర్గంలో కాపు, గౌడ కులాలు కీలక పాత్ర పోషిస్తాయి. లక్ష యాభై వేల ఓట్లల్లో సుమారు 45 వేల ఓట్లు కాపు కులం వారివే. రెండో స్థానంలో గౌడ కులంకు చెందిన వారున్నారు. వారికి సుమారు 35 వేల ఓట్లు వరకు ఉన్నాయి. వీరే గెలుపుని డిసైడ్ చేస్తారు. మరి చూడాలి ఈసారి పెడనలో పాగా ఎవరు వేస్తారో…

Ravi Batchali
About Ravi Batchali 22708 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*