‘‘వెస్ట్’’లో విన్నర్ వీరేనటగా….!!!

ysrcongressparty-telugudesamparty-in-westgodavari-district

పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు రాష్ట్రంలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. అప్పట్లో తన మిత్రపక్షమైన బీజేపీతో కలసి దున్నేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక్క స్థానం కూడా దక్కలేదు. దీంతోనే అధికారానికి ఆ పార్టీ దూరమయింది. ఏకపక్షంగా గత ఎన్నికల్లో సాగిన పశ్చిమ గోదావరి ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. గత ఎన్నికల మాదిరి ఇప్పుడు పరిస్థితులు లేవన్నది వాస్తవం. గత ఎన్నికల్లో జనసేన, బీజేపీ మద్దతుతో టీడీపీకి కొన్ని ప్రధాన సామాజిక వర్గాలు అండగా నిలిచాయి. అందువల్లనే తీర్పు వన్ సైడ్ అయింది.

జనసేన నామమాత్రమేనా?

ఈసారి బీజేపీ, జనసేన, టీడీపీ, వైసీపీలు విడివిడిగా పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యనే ఉంది. జనసేన ఈ రెండు పార్టీల ఓట్లు చీల్చడానికే పనికొస్తుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సొంత జిల్లా కావడంతో పాటు ఆయన స్వయంగా భీమవరం నుంచి పోటీ చేస్తుండటం ఆ పార్టీకి కొంత కలసి వస్తుందనుకున్నా ఒకటి, రెండు సీట్లకు మించి ఇక్కడ జనసేనకు విజయావకాశాలు లేవన్నది సుస్పష్టం. కానీ జనసేన ఎఫెక్ట్ మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పై పడే అవకాశాలున్నాయి.

వైసీపీకి ఆరు స్థానాల వరకూ…

పశ్చమగోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో ఆరు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు స్పష్టంగా ఉన్నట్లు ఓటరు నాడిని బట్టి తెలుస్తోంది. ప్రధానంగా అన్ని నియోజకవర్గాలను గంపగుత్తగా టీడీపీకి గత ఎన్నికలలో అప్పగించినా ఈజిల్లా అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకపోవడం టీడీపీకి మైనస్ గా చెప్పొచ్చు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇసుక మాఫియా వివాదంలో చిక్కుకున్నారు. పోలవరం ప్రాజెక్టు అధికార టీడీపీ శరవేగంతో నిర్మిస్తున్నా ఆ ప్రభావం మాత్రం కన్పిచడం లేదన్నది విశ్లేషకుల అంచనా. పోలవరం నిర్వాసితులతో పాటు ఎమ్మెల్యేల అవినీతి ఈ జిల్లాలో ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది.

జాగ్రత్త పడటంతోనే…..

ఇక వైసీపీ విషయానికొస్తే గత ఎన్నికల్లో చేసిన తప్పులు చేయకుండా జగన్ జాగ్రత్తలు తీసుకున్నారు. బీసీలు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో జగన్ బీసీ డిక్లరేషన్ ను కూడా ఇక్కడే ప్రకటించడం విశేషం. ముఖ్యంగా శెట్టి బలిజ, గౌడ సామాజిక వర్గం వైసీపీకి అండగా నిలిచిందని పోల్ తర్వాత పరిస్థితిని తెలియజేస్తుంది. అభ్యర్థులను కూడా సరైన వాళ్లను ఈసారి రంగంలోకి దించడంతో వైసీపీకి ఆరు అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా దక్కుతాయన్న అంచనా ఉంది. మొత్తం మీద గత ఎన్నికలలో జీరో రిజల్ట్ సాధించిన వైసీపీ ఈసారి అంత ఎక్కువ కాకపోయినా కనీస స్థానాలను దక్కించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 30963 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*