
గత మూడు దశాబ్దాలుగా ఇక్కడ గెలిచిన పార్టీయే అధికారంలోకి వస్తుంది. ఈ సెంటిమెంట్ నియోజకవర్గంలో బలంగా ఉంది. అందుకే ఈ నియోజకవర్గంలో గెలుపోటములపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పుడు గెలుపోటములపై తీవ్రస్థాయిలో చర్చజరుగుతోంది. ఇక్కడ వైసీపీ గెలుస్తుందన్న సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. దీంతో సెంటిమెంట్ ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుందని వైసీపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
ఎవరు గెలిస్తే …ఆ పార్టీ…
ఉంగుటూరు నియోజకవర్గంలో 2004, 2009 ఎన్నికలలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా వట్టి వసంతకుమార్ గెలిచారు. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గన్ని వీరాంజనేయులు విజయం సాధించారు. 1989 ఎన్నికల నుంచి ఇదే జరుగుతుంది. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి రావడం సెంటిమెంట్ గా మారింది. ఏ ఒక్క ఎన్నికల్లో ఈ సెంటిమెంట్ తప్పలేదు. అందుకనే ఉంగుటూరు నియోజకవర్గంలో గెలిచేందుకు ఇటు టీడీపీ, అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు గట్టి ప్రయత్నాలే చేశాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యే బలంగా….
ఈసారి కూడా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకు చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. ఆయన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నమ్ముకున్నారు. తాను నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాలున్నాయి. ప్రతి మండలంలోనూ తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు ఉంది. తాను చేసిన ప్రతి అభివృద్ధి పనినీ ఆ గ్రామంలోనే బోర్డు పెట్టి తెలిపానని గన్ని వీరాంజనేయులు అంటున్నారు. ఇక్కడ మొత్తం 11 సార్లు ఎన్నికలు జరగగా, ఆరు సార్లు కాంగ్రెస్, ఐదు సార్లు టీడీపీ గెలిచాయి.
జనసేన ఎఫెక్ట్ తో…..
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపును పుప్పాల వాసుబాబు పోటీ చేశారు. ఈయన కూడా బలమైన అభ్యర్థే. గత ఎన్నికలలో ఓటమి పాలుకావడంతో ఆ సానుభూతి పనిచేస్తుందని చెబుతున్నారు. జగన్ పాదయాత్ర సమయంలోనూ విశేష స్పందన రావడంతో తన గెలుపు ఖాయమన్న ధీమాలోవాసుబాబు ఉన్నారు. గత ఎన్నికల్లో వాసుబాబు 9వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి జనసేన అభ్యర్థిగా నవుడు వెంకటరమణ బరిలో ఉండటంతో టీడీపీ ఓటు బ్యాంకుకు చిల్లుపడే అవకాశముందంటున్నారు. మొత్తం మీదఇక్కడ వైసీపీకే ఎడ్జ్ ఉందని పోలింగ్ అనంతరం విశ్లేషకుల అంచనా. ఈ నియోజకవర్గంలో గెలిస్తే జగన్ సీఎం అయినట్లేనని వైసీపీనేతలు బెట్టింగ్ లకు కూడా దిగుతున్నారు.
Leave a Reply