
ప్రకాశం జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం ఎర్రగొండపాలెం నియోజవకర్గం రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఇక్కడ గత ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ నేత పాలపర్తి డేవిడ్ రాజు.. తర్వాత చంద్రబాబు ఆకర్ష్ మంత్రానికి ముగ్ధులై.. సైకిల్ ఎక్కారు. దీంతో ఇక్కడ వైసీపీ కేడర్ కూడా దాదాపు టీడీపీలోకి చేరిపోయింది. అయితే, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి డేవిడ్ రాజుకు టీడీపీ టికెట్ ఇస్తుందా? లేదా? అనేది సందేహంగా మారింది. ఆయన పార్టీలో చేరినా కూడా పార్టీని అభివృద్ది చేయడంపై పెద్దగా దృష్టి పెట్టలేదని, ముఖ్యంగా దళిత తేజం వంటి కేవలం ఎస్సీలకే కేటాయించిన పథకాలను కూడా ప్రజలలోకి తీసుకు వెళ్లడంలో విఫలమయ్యారని చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు.
తీవ్రమైన వ్యతిరేకతతో….
సరే! ఈయన విషయాన్ని పక్కన పెడితే.. ఎర్రగొండపాలెంలోని కాంగ్రెస్ కేడర్ అంతా ఇప్పటికీ వైసీపీకి అండగానే ఉందని ఇక్కడ వైసీపీ నాయకులు చెబుతున్నారు. దీంతో ఇక్కడి నుంచి రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ను జగన్ రంగంలోకి దింపుతున్నారు. 2009లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన సురేష్ గత ఎన్నికల్లో సంతనూతలపాడుకు మారి అక్కడ వైసీపీ నుంచి గెలిచారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎర్రగొండపాలెంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి పార్టీ మారిన డేవిడ్‌రాజుపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దీనిని గుర్తించిన టీడీపీ అధిష్టానం డేవిడ్‌ను మళ్లీ ఇక్కడ నిలబెడితే.. ఇబ్బంది ఖాయమని గుర్తించి కొత్తవారికే తాము కూడా టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఫ్యాన్ పార్టీకి కంచుకోటే….
వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినా ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్సార్ సీపీకి కంచుకోటగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఫార్టీ ఫిరాయించిన డేవిడ్‌రాజును ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తే ప్రజలు తిరస్కరించే అవకాశం ఉంది. దీని నుంచి బయటపడేందుకు టీడీపీ ఇక్కడి నుంచి కొత్త అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సూచన మేరకే ఇక్కడ అభ్యర్థి నియామకం ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో మాగుంట ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉంటే తన లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చాలని ఆయన పట్టుబడుతున్నారు.
మళ్లీ వైసీపీ జెండాయేనా?
మాగుంట ముందుగా ఎర్రగొండపాలెం సీటునే మార్చాలని బాబు వద్ద ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తోంది. కొత్త అభ్యర్థిని నిలిపితే అతడి విజయానికి టీడీపీ పాత వర్గంతో పాటు డేవిడ్ రాజు వర్గం కూడా కలిసి పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తంగా ఎర్రగొండ పాలెం నియోజకవర్గంలో వైసీపీ తన బలాన్ని నిరూపించేందుకు రెడీ అవుతోందని సమాచారం. దీనికి తగిన విధంగానే టీడీపీ కూడా తన వ్యూహాలను మార్చుకుంటోంది. ఏదెలా ఉన్నా క్షేత్రస్థాయిలో వైసీపీకి తిరుగులేని బలం ఉండడంతో ఎర్రగొండపాలెంలో ఎలాంటి సంచలనాలు నమోదు కాకపోతే మళ్లీ వైసీపీ జెండాయే ఎగిరే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Leave a Reply