యంగ్ లీడర్ వీరిని ఎదుర్కొంటారా?

ysrcongresspartyjanasenatelugudesamparty

రాజమండ్రి రాజకీయాలు వచ్చే లోక్ సభ ఎన్నికలకు మరింత వేడెక్కనున్నాయి. ఇక్కడ త్రిముఖ పోటీ ఆసక్తికరంగా మారనుంది. అన్ని సవ్యంగా.. అన్నిపార్టీలూ ఒకే చేస్తే ఇక్కడ వీరు ముగ్గురూ బరిలోకి దిగే అవకాశముంది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో పరిధిలో మూడు ప్రధాన పార్టీలూ బలంగా ఉండటమే టఫ్ ఫైట్ కు కారణమని చెప్పకతప్పదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. ఇక వైసీపీ అభ్యర్థికి సామాజిక పరమైన బలం ఉంది. దీంతో పాటు జనసేన అభ్యర్థి కూడా మామూలోడు కారు. ఆయనకు జనంలో ఉన్న ప్రజాదరణతో పాటు పవన్ కల్యాణ్ చరిష్మా, కాపు ఓటు బ్యాంకు ఈయనకు మరింత ప్లస్ కానున్నాయి.

ముగ్గురు అభ్యర్థులు ఖారారు….

రాజమండ్రి పార్లమెంటు పరిధిలో తూర్పు గోదావరి జల్లాలోని రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం, రాజానాగరం, అనపర్తి నియోజకవర్గాలతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు, గోపాల పురం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంతో రెండు జిల్లాల్లో ఎవరికి బలమైన గాలులు వీస్తాయో వారిదే గెలుపని చెప్పక తప్పదు. ఇప్పటికే అభ్యర్థులు దాదాపుగా ఖరారయినట్లుగానే చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాగంటి మురళి మోహన్ మరోసారి బరిలోకి దిగనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బీసీ సామాజికవర్గానికి చెందిన మార్గాని భరత్ కు టిక్కెట్ ఖాయమైనట్లే. ఇక జనసేన నుంచి నిన్న మొన్నటి వరకూ బీజేపీ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న ఆకుల సత్యనారాయణపేరే ఖరారు కావచ్చు.

మాగంటిది అదే ధీమా…..

ఇందులో మాగంటి మురళీ మోహన్ ప్రస్తుత ఎంపీ. ఆయన ఈసారి కూడా తనకు ప్రజలు అవకాశమిస్తారని భావిస్తున్నారు. మోదీ పై వ్యతిరేకత, చంద్రబాబు ఇమేజ్, బీసీ ఓటు బ్యాంకుతో గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నారు. నిన్నమొన్నటి వరకూ తన కోడలికి టిక్కెట్ ఇప్పించాలన్న ప్రయత్నంలో మురళీ మోహన్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే తానే బరిలోకి దిగనున్నట్లు ఆయన క్యాడర్ కు సంకేతాలు ఇచ్చారు. దీంతో మురళీమోహన్ మరోసారి ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోనూ తమకు బలం ఉందని చెబుతున్న మురళీ మోహన్ గెలుపుపై ధీమాతో ఉన్నారు.

వైసీపీ అభ్యర్థికి అదే బలం…..

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మార్గాని భరత్ రాజకీయాలకు పూర్తిగా కొత్త. ఆయన యువకుడు కావడం బలమైన సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆయన ఎక్కువగా దానిపైనే ఆధారపడినట్లు కన్పిస్తుంది. యువకుడిని కావడంతో ప్రజలతో పాటు యువత కూడా తనవైపు మొగ్గు చూపుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. ఇప్పటికే భరత్ అన్ని నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక జనసేన అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ పేరును ఖరారు చేస్తారంటున్నారు. ఈయనకు ఎంపీగా ఎన్నికవ్వాలని బలమైన కోరిక. ప్రజాదరణ ఉన్న నేత కావడంతో జనసేన సింబల్ తనకు కలసి వస్తుందని ఆకుల భావిస్తున్నరు. మొత్తం మీద రాజమండ్రి పార్లమెంటు స్థానంలో జరగనున్న ముక్కోణపు పోటీలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి యువకుడు మార్గాని భరత్ సీనియర్ నేతలను ఎదుర్కొనబోతున్నారు. మరి ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూడాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 38976 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*