
ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ఎవరు ? గెలుస్తారు అన్నదానిపై ప్రధాన పార్టీల అభ్యర్థులు కాకుండా న్యూట్రల్ జనాలు సైతం రకరకాల అంచనాలకు వస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సహజంగానే గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తుంటారు. మీడియా వర్గాలు, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఉన్న లెక్కలను బట్టి అక్కడ ఖచ్చితంగా ఎవరు ? గెలుస్తారు అన్న దానిపై ఓ అంచనాకు వస్తుంటారు. చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములపై అంచనాలు అందుతున్నా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఇరు పార్టీలకు సమానమైన అవకాశాలు ఉండడంతో అక్కడ ఎవరు ? గెలుస్తారన్నది ఖచ్చితంగా ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇలాంటి నియోజకవర్గాల్లోనే కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ఎంపీ సీటు కూడా ఉంది. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొనకళ్ల నారాయణ వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. మూడోసారి టిడిపి అభ్యర్థిగా రంగంలో ఉన్న కొనకళ్ల ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానన్న ధీమాతో ఉన్నారు.
బలమైన అభ్యర్థిగా….
ఇక వైసీపీ అభ్యర్థిగా తెనాలి మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి పోటీలో ఉన్నారు. బాలశౌరి ఈ ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీలో ఉండడం ద్వారా ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. గత నాలుగు ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఘనత బాలశౌరిదే. 2004లో తెనాలి లోక్సభ సీటు నుంచి కాంగ్రెసు తరపున పోటీ చేసిన ఆయన ఎంపీగా గెలిచారు. 2009లో తెనాలి ఎంపి సీటు రద్దు కావడంతో కాంగ్రెస్ నుంచి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ తరపున గుంటూరు నుంచి పోటీ చేసి గల్లా జయదేవ్ చేతిలో చిత్తుగా ఓడారు. ఇక ఈ ఎన్నికల్లో జిల్లా మారి మచిలీపట్నం నుంచి మరోసారి వైసీపీ తరపున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ పరిధిలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉండడంతో జగన్ బాలశౌరిని ఇక్కడ నుంచి పోటీ చేయించారు. ఈ ఎన్నికల్లో కొనకళ్ళ వర్సెస్ బాలశౌరి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఎవరు గెలుస్తారన్నది ఎవరు ? ఖచ్చితంగా అంచనాకు రాలేని పరిస్థితి.
ఏడు అసెంబ్లీ సెగ్మంట్లలోనూ….
లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు సైతం పోటీ ఇచ్చారు. ఈ మూడు నియోజకవర్గాల్లో జనసేన గెలుస్తుందా ? లేదా ప్రధాన పార్టీల గెలుపును తారుమారు చేస్తుందా ? అన్న దానిని బట్టే ఈ ఎంపీ సీటులో టిడిపి, వైసీపీ అభ్యర్థుల గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి. ఈ ఏడు సెగ్మెంట్లలో ఎక్కడ ? ఏ పార్టీ గెలుస్తుందన్నది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. పామర్రులో వైసీపీ గెలుపునకు అవకాశాలు ఉన్నాయి. గన్నవరంలో మాత్రం టిడిపి అభ్యర్థి వంశీకి ఎడ్జ్ ఉందంటున్నారు. అలాగే పెనమలూరులోనూ బోడె ప్రసాద్ స్వల్ప ఆధిక్యతతో బయటపడవచ్చు. గుడివాడలో వైసిపి వర్సెస్ టిడిపి మధ్య నరాలు తెగే ఫైట్ కొనసాగింది. ఇక్కడ ఎవరు గెలిచినా మూడు నాలుగు వేల లోపు మెజారిటీ మాత్రమే దక్కనుంది. మచిలీపట్నం, పెడనలో గెలుపుపై ఇరు పార్టీలు ధీమాగానే ఉన్నాయి. పెడనలో జనసేన గట్టి పోటీ ఇవ్వడంతో టిడిపి కాస్త వెనకబడినట్లు చెబుతున్నారు.
ఎవరి ఫేట్ మారుతుంది….?
మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ఏటికి ఎదురీదుతూ ఉన్నారు. అవనిగడ్డలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్, జనసేన అభ్యర్థి ముత్తంశెట్టి కృష్ణారావు బుద్ధ ప్రసార్కు గట్టి పోటీ ఇచ్చారు. ఓవరాల్గా చూస్తే పెనమలూరు, గన్నవరంలో టిడిపికి కాస్త ఎడ్జ్ కనబడుతోంది. పామర్రులో వైసీపీకే అవకాశాలు ఉన్నాయి. గుడివాడలో గట్టిపోటీ ఉన్నా చివరిలో తమదే పైచేయి అని వైసిపి భావిస్తోంది. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో అంతిమ గెలుపు ఎవరిదో చెప్పలేని పరిస్థితి. మరి ఈ హోరాహోరీ సమరంలో కొనకళ్ళ గెలిచి హ్యాట్రిక్ కొడతారా ? లేదా నాలుగోసారి నియోజకవర్గం మారిన బాలశౌరి ఫేట్ మారుతుందా ? అన్నది 23న తేలిపోనుంది.
Leave a Reply