
రాష్ట్రంలో ఏ చిన్న అవకాశమొచ్చినా అధికార, విపక్ష పార్టీలు వదులుకోవడం లేదు. ప్రధానంగా టీడీపీ, వైసీపీలు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం రోజూ సాధారణంగా మారింది. నిన్న ఏపీ వ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం విపక్షాలు బంద్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు టీడీపీ, బీజేపీలు దూరంగా ఉన్నాయి. బంద్ కు టీడీపీ మద్దతు తెలపక పోవడంతో వైసీపీ దానిపై విమర్శలను ఎక్కుపెట్టింది. చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే బంద్ ను నీరుగారుస్తున్నారని తీవ్ర విమర్శలు చేసింది.
తిరుపతి బైక్ దగ్దం ఘటనకు….
అయితే బంద్ సందర్భంగా తిరుపతిలో జరిగిన ఒక ఘటనను అధికార తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. తిరుపతిలో నిన్న బంద్ సందర్భంగా ఒక బైక్ దగ్దమయింది. ఆందోళనల్లో భాగంగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ బైక్ ను తగులబెట్టినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ ఘటన వెనక వైసీపీ హస్తం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఏపీ మంత్రివర్గ సమావేశంలోనే ఈ బైక్ దగ్దం ఘటన చర్చకు రావడం విశేషం. బైక్ దగ్దం ఘటన వెనక వైసీపీ నేతలు ఉన్నారని ఏకంగా మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ఆరోపించారు.
భూమనకు లింకు పెట్టి……
అంతేకాకుండా గతంలో తునిలో జరిగిన సంఘటనను కూడా ఆయన ప్రస్తావించిడం విశేషం. కాపు ఉద్యమంలో భాగంగా తునిలో సభ నిర్వహించినప్పుడు రైలును ఆందోళన కారులు దగ్దం చేశారు. ఈ ఘటన వెనక వైసీపీ నేతలు ఉన్నారని, ముఖ్యంగా తిరుపతి వైసీపీ నేతల భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారని అప్పట్లోనే టీడీపీ ఆరోపించింది. మళ్లీ బంద్ సందర్భంగా బైక్ ను తిరుపతిలోనే తగులబెట్టడం వెనక కూడా భూమన హ్యాండ్ ఉందంటున్నారు టీడీపీ నేతలు. బైక్ దగ్దం ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ చేయాలని చంద్రబాబు మంత్రులకు సూచించడం గమనార్హం.
అభివృద్ధిని అడ్డుకునేందుకే…..
ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిని అడ్డుకునేందుకు ఆందోళనల పేరుతో అరాచకానికి వైసీపీ దిగుతుందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నేతలను ఆదేశించారు. అయితే ఈ ఘటనతో తమకు సంబంధం లేదంటున్నారు వైసీపీ నేతలు. కడుపు మండి ప్రజలే బైక్ ను దగ్దం చేస్తే దీన్ని చంద్రబాబు రాజకీయం చేసి లబ్ది పొందాలని చూస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రతి చిన్న విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకోవడం, ప్రత్యర్థిని ఇరుకున పెట్టాలనుకోవడం ముందు ముందు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో చూడాలి మరి.
Leave a Reply