తన ప్రేమ కథనే తాను తెరకెక్కిస్తాడట

అప్పట్లో ఒకడుండేవాడు ప్రచార చిత్రం విడుదలైన నాటి నుంచి ఆ చిత్రంలోని నారా రోహిత్ పాత్ర తో పాటు క్రికెట్ ఆటగాడి పాత్ర పోషించిన శ్రీ విష్ణు పాత్రకి కూడా ప్రేక్షకులు అమితంగా ఆకర్షితులయ్యారు. ఈ రోజు(డిసెంబర్ 30 )విడుదలైన అప్పట్లో ఒకడుండేవాడు ఇప్పటికే విశ్లేషకుల మన్ననలు పొందింది. ప్రేక్షకులను కూడా తప్పకుండ ఆకట్టుకుంటుంది అని, ఈ ఏడాది తన గత ఐదు విడుదల కంటే కూడా అద్భుతంగా ఉంటుంది అని నారా రోహిత్ భరోసా ఇచ్చేసాడు. విడుదల రోజున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న నటుడు శ్రీ విష్ణు అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంలోని తన పాత్ర గురించి కొన్ని విశేషాలు పంచుకున్నారు.

“అప్పట్లో ఒకడుండేవాడు ఒక పీరియాడిక్ డ్రామా. ఇందులో నేను క్రికెట్ ఆటగాడి పాత్రలో కనిపిస్తాను. ప్రచార చిత్రం చూసిన వారిలో చాలా మంది ఈ చిత్రంలో కథానాయకుడు ఎవరు? ప్రతినాయకుడు ఎవరు? అని ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు. ప్రచార చిత్రమే కాదు వెండితెర పై పూర్తి చిత్రం చూసిన తరువాత కూడా ఆ సందేహం వెంటాడుతుంది అని నా నమ్మకం. నా పాత్రకు పోలీస్ పాత్ర విలన్. పోలీస్ పాత్రకు క్రికెటర్ పాత్ర విలన్.” అంటూ ప్రేక్షకులను మరింత సందిగ్ధంలో పడేసారు శ్రీ విష్ణు.

ఇప్పటి వరకు 21 చిత్రాలలో నటించిన శ్రీ విష్ణు, తాను చిత్ర రంగానికి దర్శకుడిని అవుదామని వచ్చానని, తన తొలి చిత్రంగా తన కథనే తెరకెక్కిస్తానని చెప్తున్నాడు. “ఎవరి దగ్గరైన దర్శకత్వ శాఖలో కొంత కాలం పని చేసి తరువాత దర్శకత్వం వహించే పద్దతిలో కాకుండా కొత్త తరహాలో నేను దర్శకుడి అవతారం ఎత్తుతాను. నేను నా 19 వ ఏటనే వివాహం చేసుకున్నాను. నాది ప్రేమ వివాహం. నా ప్రేమ కథనే నా దర్శకత్వ పరిచయ చిత్రానికి కథగా సిద్ధం చేసుకున్నాను. అందుకే ఇప్పుడు ఆ కథను చెప్పలేను.” అంటూ భవిష్యత్లో తాను దర్శకత్వం వహిస్తానని కచ్చితంగా వెల్లడించాడు శ్రీ విష్ణు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*