మెగా మల్టి స్టారర్ మొదలవుతుందా?

మొన్నామధ్యన చిరు – పవన్ తో మెగా మల్టి స్టారర్ చిత్రాన్ని స్టార్ట్ చేస్తున్నామని టి సుబ్బరామిరెడ్డి ఆఫీసియల్ గా ఎనౌన్స్ కూడా చేసాడు. కానీ ఇంతవరకు పట్టాలెక్కలేదు గాని ఇప్పుడు మరో మెగా మల్టి స్టారర్ చిత్రం మొదలైపోతుంది అని ప్రచారం జరుగుతుంది. రామ్ చరణ్ – అల్లు అర్జున్ ఇద్దరి కాబినేషన్ లో ఒక మల్టి స్టారర్ చిత్రం రాబోతుందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వీరిద్దరూ ‘ఎవడు’ చిత్రంలో నటించారు. రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ చిత్రంలో అల్లు అర్జున్ కొన్ని నిమిషాలపాటు గెస్ట్ రోల్ చేసాడు. అప్పట్లో ఆ చిత్రం పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.

మళ్ళీ ఇప్పుడు కూడా వీరి ఇద్దరి కాంబినేషన్ లో మల్టి స్టారర్ చిత్రం ఖచ్చితంగా వుంటుందనే సంకేతాలు మాత్రం అందుతున్నాయి. రామ్ చరణ్ సోలోగా దూసుకుపోతున్నాడు. అటు అల్లు అర్జున్ కూడా రేసుగుర్రంలా పరుగెడుతున్నాడు. గత ఏడాది ‘ధ్రువ’ చిత్రంతో రామ్ చరణ్ సూపర్ హిట్ అందుకోగా… అల్లు అర్జున్ ‘సరైనోడు’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. మరి ఇంత దూకుడు మీదున్న వీరిద్దరూ కలిసి ఒకే చిత్రంలో కనబడితే ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు వుంటాయో ఊహకు కూడా అందదు.

ఇక ఇప్పుడు రామ్ చరణ్, సుకుమార్ డైరెక్షన్ లో ఒక ప్రేమ కథా చిత్రంలో నటిస్తుండగా… అల్లు అర్జున్ ‘డీజే’ లో నటిస్తున్నాడు. డీజే కంప్లీట్ కాగానే అల్లు అర్జున్ రైటర్ వంశీని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. మరి వీరు నటిస్తున్న చిత్రాలు కంప్లీట్ కాగానే రామ్ చరణ్ – అల్లు అర్జున్ కాంబో లో మల్టి స్టారర్ చిత్రం మొదలుకాబోతుందట. ఇప్పటికే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ‘చరణ్ – అర్జున్’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ అయినట్లు ప్రచారం మొదలైంది. ఈ టైటిల్ చూస్తుంటే ఖచ్చితంగా చరణ్ – అర్జున్ లు ఇద్దరూ ఈ మెగా మల్టి స్టారర్ లో నటించబోతున్నారనేది నిజమే అయ్యుంటుంది కదా…!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*